నియామకాలలో జరుగుతున్న స్కాములు, రిక్రూట్మెంట్లలో చోటుచేసుకుంటున్న పేపర్ లీకేజీలు, పోటీ పరీక్షల కోసం నడుస్తున్న కోచింగ్ సెంటర్లలో జరుగుతున్న ప్రమాదాలు మనల్ని పట్టి పీడిస్తున్న రోగాలు కావు, అవి రోగపు లక్షణాలు. ఉపాధి కల్పన పట్ల పరిపాలనలో జరుగుతున్న అశ్రద్ధకు అవి ఆనవాళ్లు. ఇప్పటికీ నిరుద్యోగం రాచపుండై కూర్చున్నది. మరింత నిర్లక్ష్యం చేస్తే అది క్యాన్సర్‌ను మించిన మహమ్మారిగా మారుతుంది. రాజస్థాన్ రాష్ట్రంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ అధికారి ఒక సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్ట్‌కు సంబంధించిన రాత పరీక్ష పేపర్‌ను తన కుమారుడి కోసం లీక్ చేశాడు. జార్ఖండ్‌లో 583 ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులకు 4.4 లక్షల మంది అప్లరు చేశారు. ఉద్యోగాన్ని పొందడానికి 0.1శాతం మాత్రమే అవకాశాలన్నమాట! కేవలం 10-12 రోజులే వ్యవధి గలిగిన ఈ ఉద్యోగానికి సంబంధించిన వ్యాయామ పరీక్షలో పదకొండు మంది యువకులు ప్రాణాలు కోల్పోయారు. 2018లో ఉత్తరప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్‌లో ఐదవ తరగతి విద్యార్హత నిబందనతో వెలువడిన ఒక ప్యూన్ ఉద్యోగ నోటిఫికేషన్‌కి 3700 మంది పిహెచ్‌డి డిగ్రీ కలిగిన వాళ్లు అప్లరు చేశారు. ఇప్పుడు అక్కడి పరిస్థితి మరింత దయనీయంగా ఉన్నదని టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక ఒక కథనాన్ని రాసింది. ఇలా అనేక ఉద్యోగాలకు మించిన అర్హతతో అభ్యర్థులు పోటీ పడటం గతంలోనూ జరిగినప్పటికీ, అది అలాగే కొనసాగడం విచారకరం.
కోవిడ్ తర్వాత ఉపాధి పని పద్ధతులలో ఏర్పడిన మార్పులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన నేపథ్యంలో, ప్రయివేటు సెక్టార్ స్థిరమైన ఉపాధి కల్పనలకు మొహం చాటేస్తున్న పరిస్థితులలో ఇలాంటి నియామకాలన్నీ బతుకు పోరాటానికి చేసే యుద్ధాల్లా తయారయ్యాయి. గత పదిహేనేండ్ల పాటు ఎంతో ఊరించిన సాప్ట్‌వేర్ రంగం కారిపోయిన తేనె తుట్టేలా తయారైంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగాల పట్ల ఆసక్తి అభ్యర్థులకు పెరిగిపోయింది. సరళీకరణ విధానాల తర్వాత అవినీతి వ్యవస్థీకృతమై పని జరగడానికి అందరిని మేనేజ్ చేసినట్లే పరీక్షల్లో సఫలీకృతం కావడానికి దొడ్డిదారిని వెతకడం చాలామందికి తప్పుగా అనిపించడం లేదు. అందుచేతనే పేపర్ లీకేజీల సంఖ్య, దొడ్డి దారి నియామకాలూ బాగా పెరుగుతున్నాయి. కేంద్రం ఒక సమగ్ర విధానానికి నీళ్లొదిలి లేటరల్ ఎంట్రీ పేరున నేరుగా ప్రధాన స్థాయీల్లో నియామకాలు చెపడుతున్నప్పుడు మిగతా వాళ్లు కూడా తాము చేసేది తప్పు కాదని భావిస్తారు. నైపుణ్యం గల అనుభవజ్ఞులను కేబినెట్ సెక్రెటరీ స్థాయిల్లో నియమించుకోవాలంటే దానికి పార్లమెంటు చట్టాల ద్వారా విధివిధానాలు రూపొందించుకుంటే ఆశ్రిత పక్షపాతానికి అవకాశముండదు, అది అందరికీ ఆదర్శమౌతుంది.
దేశ రాజధాని న్యూఢిల్లీలో రావుస్ అకాడమీలో ఐఏఎస్ కోచింగ్ తీసుకుంటున్న ముగ్గురు వరద నీరు కోచింగ్ సెంటర్ పార్కింగ్ సెల్లార్‌లోకి చేరడంతో అందులో మునిగిపోయి చనిపోయారు. దీని ద్వారా స్పష్టమవుతున్నది ఏమిటంటే? భారత విద్యా విధానం డిగ్రీ పట్టాల ద్వారా ఉద్యోగార్హతలను మాత్రమే ఇస్తుంది, దానికి కావలసిన నైపుణ్యాన్ని తమకు తామే అభ్యర్థులు వెతుక్కోవాలి, పెంచుకోవాలి. కోచింగ్ సెంటర్లన్నీ ఏ మాత్రం ప్రభుత్వ నియంత్రణ లేని కారణంగా పూర్తిగా లాభాపేక్షతో నడుస్తుండడంతో అక్కడ కూడా ప్రయోజనం పొందలేని వాళ్లు తమకు తామే భారమై వెనుతిరుగుతున్న పరిస్థితులున్నవి. దేశంలోని మొత్తం ఉద్యోగార్థులలో 88శాతం మందికి కావలసిన నైపుణ్యాలు లేవని యాజమాన్యాల సమాఖ్య బహిరంగంగా ప్రకటించింది. ఉద్యోగాన్ని పొంది ట్రైనింగుల్లోనే వెనుదిరుగుతున్న వారూ గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. కేంద్రం గత బడ్జెట్లో నైపుణ్యాభివృద్ధి ప్రస్తావన చేసింది. దానికోసం పరిమిత సంఖ్యకు ఆర్థిక సహాయతను ప్రకటించింది. ఈ ప్రయత్నం కొంత మందికి తాత్కాలికి ఉపశమనాన్ని ఇస్తది. శాశ్వత పరిష్కారానికి, పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో కాకపోయినా, ప్రయివేటు పబ్లిక్ భాగస్వామ్యంలోనైనా ఉపాధి సంసిద్ధతకు తూగే విద్యార్హతలను పెంపొందించి సంధానించే సమగ్ర మౌలిక వసతులు, యంత్రాంగం అవసరం.
భారతదేశంలోని మొత్తం కార్మికులలో 65 శాతం మంది 35 ఏండ్లవయసు లోపల ఉన్నారు. ఇందులో కేవలం రెండు శాతం మాత్రమే నైపుణ్యం గల (స్కిల్డ్) వారు ఉంటే, ప్రతి ఇద్దరిలో ఒకరు ఏ రకమైన ఉద్యోగానికి పనికిరారు. 2030 కల్లా 90 మిలియన్ల కొత్త ఉద్యోగాలు ఏర్పడనున్నాయి, ఇందులో 70 శాతం మంది సహాయక కార్యక్రమాల్లో మాత్రమే నిమగమవుతారని మాకెన్సీ అనే మేనేజ్‌మెంట్ కన్సల్టెన్సీ సంస్థ ఒక రిపోర్టుని ఇచ్చింది. ఇవన్నీ రవాణా, గిడ్డంగుల నియంత్రణ, గిగ్ ఇండిస్టీ( స్విగ్గీ, జొమాటో, అర్బన్ క్లాప్, సహాయక) మొదలగు వాటిల్లోనే ఉండే అవకాశం ఉందని కూడా తెలిపింది. ఇవన్నీ స్థిరమైన ఉపాధి కిందకు రావు, ఆదాయ భద్రతకు కూడా నోచుకోవు. కార్పొరేట్ విద్యా విధానం అభ్యర్థుల భవిష్యత్తును ”నా ఘర్‌కా నా ఘట్‌కా” చేసింది. మంచి చదువులతో ఉన్నత ఉద్యోగాలాకు అర్హుల్ని చేయలేదు. స్వయం ఉపాధి చేసుకునే స్వతంత్రతనూ పొందనివ్వలేదు. వ్యాపార ధోరణి ఎక్కువైనచోట కొన్ని ర్యాంకులకే పరిమితమై మిగతా వారందరినీ పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో ఓమోస్తరు నైపుణ్యాలు ఉన్న విద్యార్థులు కూడా వెనుకబడిపోతూ ఏమాత్రం ఉద్యోగానికైనా సరితూగే స్కిల్ పొందలేకపోతున్నారు.
విజయవాడ నగరంపై విరుచుకుపడిన వరద విలయతాండవాన్ని పరిశీలించడానికి వెళ్లిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు చేరిన విన్నపాలలో అత్యధికం ”ఏదైనా స్థిరమైన ఉపాధి కల్పించండి” అని మొరపెట్టుకున్నవే అని స్వయాన వారే పత్రికా ముఖంగా తెలిపారు. స్థిరమైన ఉపాధి లేమి నేటి ప్రధాన సమస్య. దేశం మొత్తం మీద 6.5 శాతమే నిరుద్యోగమని అధికారికంగా ప్రకటించినప్పటికీ వాస్తవంలో అది చాలా ఎక్కువ. రాష్ట్రాల పరంగా చూసినప్పుడు కొన్ని ప్రధాన రాష్ట్రాలలో తప్ప అంతటా 15 నుండి 25శాతం వరకు నిరుద్యోగం తాండవిస్తున్నది. జమ్ము కాశ్మీర్‌లో 24.8శాతంగా ఉన్నది. మారుతున్న పరిస్థితులలో ఊడిపోతున్న ఉద్యో గాలు ఒకవైపు కలవరపెడుతుంటే ప్రభుత్వాల అనాలోచిత చర్యలు పరిస్థితిని అద్వానపరుస్తున్నాయి. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సిఎస్‌ఆర్) ద్వారా ప్రతి కంపెనీ ప్రతి ఏటా తమ లాభాల్లో రెండు శాతం మేర ఖర్చు చేసి వెనుకబడిన ప్రాంతాలలో వెనుకబడిన వారికి చేయూతనిచ్చే కార్యక్రమాలను చేయాలని నిబంధన ఉన్నది. దీనికి నీళ్లొదిలి సి.ఎస్.ఆర్ నిధులను ఉపాధి కల్పనకు వినియోగించాలని కేంద్ర ప్రభుత్వమే కార్పొరేట్ కంపెనీలకు వెసులుబాటు నిచ్చింది.ఇది పూర్తిగా అనాలోచిత చర్య.
ఉపాధి కల్పన దేశ ఆర్థిక వ్యవస్థకు పునాది వంటిది. దానిని సహాయ కార్యక్రమాల స్థాయికి దిగజార్చకూడదు. సరైన పాలసీ విధానాలను అవలంబిస్తే విరివిగా అందుబాటులో ఉన్న కార్మికులను ఉపయోగించుకొని త్వరితగతిన అభివృద్ధి సాధించవచ్చు కానీ రాజకీయ లక్ష్యాలు అధికార పీఠం కోసం మాత్రమే పరితపిస్తున్నప్పుడు ప్రజా జీవితాల్లో సహాయక కార్యక్రమాలు తప్ప దూరదృష్టి గల పునాదులు నామమాత్రంగానే కనిపిస్తాయి. దేశంలో ప్రతి ఐదు రోజులకు ఒక శతసహస్ర కోటీశ్వరుడు పుట్టుకొస్తున్నారంటే దానికి వేల రెట్లు ప్రజలు పేదలుగా మారుతున్నట్టేనని గతంలోనే ఆక్స్‌ఫామ్ వంటి సంస్థలు తేల్చేశాయి. సామాన్యులు బిలియనీర్లు కావాలని కోరుకోవట్లేదు గానీ బికార్లు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. అయితే నిరుద్యోగ సమస్యను ముంచుకొస్తున్న ముప్పుగా భావించకపోతే మూల్యం మరీ భారమౌతుంది.
– జి.తిరుపతయ్య, 9951300016.