నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
బాలసదనంలో బాధితులకు షెల్టర్ ఇవ్వడంలో ఇక్కడి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని డీఎల్ఎస్ఏ కార్యదర్శి సౌజన్య అన్నారు. బాధితులను బాలసదనంలో చేర్పించుకోవడం లేదని వచ్చిన ఫిర్యాదు మేరకు బుధవారం బాలసదనాన్ని పరిశీలించారు. ముందుగానే ఫిర్యాదుపై సిబ్బందితో సమావేశం నిర్వహించాలని డీడబ్ల్యూఓ సబితను ఆదేశించిన ఉదయం 10.45 నిమిషాలైన ఎవరు రాలేదు. సిబ్బంది ఎవరు లేకపోవడంతో డీఎల్ఎస్ఏ కార్యదర్శి బాలసదనంలో పర్యటించి వివరాలు తెలుసుకున్నారు. అక్కడి చేరుకున్న డీడబ్ల్యూఓతో మాట్లాడి వివరాలు అడిగారు. సిబ్బంది మధ్య గొడవల కారణంగా బాధితులను చేర్పించుకోవడం లేదని తెలిసింది. వెంటనే సిబ్బందికి మెమోలు జారీ చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా డీఎల్ఎస్ఏ కార్యదర్శి సౌజన్య మాట్లాడుతూ… ఫోక్సో, లైంగికదాడి, ఇతర బాధిత చిన్నారులకు రక్షణకల్పించేందుకే బాలసదనం ఉందన్నారు. కానీ కొన్ని రోజుల క్రితం ఓ బాధితురాలిని సిబ్బంది లేదని చెప్పి పక్క జిల్లా నిర్మల్ బాలసదనంకు పంపించారన్నారు. ఇదే విషయమై ఇక్కడ తనిఖీ రావడంతో రెగ్యూలర్ కుక్, అంటెండర్ ఉన్నట్టు గుర్తించామన్నారు. సంక్షేమ శాఖ అధికారి కూడా వీరిని నియంత్రించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలిసిందన్నారు. ఈ విషయమై కలెక్టర్ కు డీఎల్ఎస్ఏ ద్వారా లేఖరాస్తామన్నారు. అప్పటికి చర్యలు లేకపోతే లీగల్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు.