తెలంగాణాకు కృష్ణా జలాల్లో న్యాయమైన వాటను సాధించే అంశంపై రేవంత్‌రెడ్డి నూతన ప్రభుత్వం వెంటనే శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణాలో గత ప్రభుత్వంలో జరిగిన లోపాలపై చర్చించాలి. కాదనలేం కానీ అంతకన్నా ముందు తక్షణావసరాలపై చొరవచూపాలి. శ్వేత పత్రాలను విడుదల చేస్తూ ప్రాజెక్టుల చుట్టూ విమర్శలు, ప్రతి విమర్శలతో కాలక్షేపం చేయటం సరికాదు. కీలకమైన ట్రిబ్యునల్‌కు సంబంధించిన అంశాలపై దృష్టిని సారించాలి. వచ్చే నెల నుండే వాదనలు ప్రారంభం కావాల్సి ఉండగా అందుకు సంబంధించిన స్టేట్మెంట్ ఆఫ్ కేసు (ఎస్‌ఓసి)ని ఇంతవరకు మన ప్రభుత్వం తరపున దాఖలు చేయలేదు. నూతన ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర ప్రత్యుత్తరాలు జరపకపోవడంతో ఇంటర్ స్టేట్ విభాగం అధికారులు ఏం చేయాలో తెలియని సందిగ్ధ స్థితిలో ఉన్నారు.
కరువు వర్షపాతం లాంటి పరిస్థితులతో పాటు సాగుకు యోగ్యమైన భూ ములు క్యాచ్‌మెంట్ ఏరియా విస్తీర్ణం తదితర అంశాల వారీగా ట్రిబ్యునల్స్ నదీ జలాల్లో వాటాలను కేటాయిస్తాయి. అందుకు విరుద్ధంగా కేవలం అప్పటికే వినియోగంలో ఉన్న కృష్ణా జలాలను మాత్రమే ఏపీ పునర్విభజన చట్టం 2014 లోని సెక్షన్ 89 ప్రకారం ప్రాజెక్టుల వారిగా ఏపీ, తెలంగాణకు జలాలను కేటా యించాలని కేంద్ర ప్రభుత్వం గతంలో బ్రిజేష్ కుమార్‌కు మార్గదర్శకాలను జారీ చేసింది. కానీ, ఆ మార్గదర్శకాలతో తెలంగాణకు ఒరిగిందేమీ లేదు. అంతర్రాష్ట్ర జలవివాదాలు చట్టం 1956లోని సెక్షన్ 3 ప్రకారం ట్రిబ్యునల్ విచారణ చేసే అధికారం కల్పించాలని సుదీర్ఘపోరాటం చేసింది. దీంతో దిగొచ్చిన కేంద్రం సెక్షన్3 ప్రకారం కృష్ణా జలాలను పంపిణీ చేయాలని, కృష్ణాజల వివాద ట్రిబ్యు నల్ -2కు గతేడాది అక్టోబర్ నెలలో నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. ఉమ్మడి ఏపీకి కేటాయించిన జలాలను ఇరు రాష్ట్రాల మధ్య పున:పంపిణీ చేయా లని, గోదావరి డైవర్షన్ ద్వారా వచ్చే 45 టీఎంసీల నీటి విషయాన్ని కూడా తేల్చాలని ట్రిబ్యునల్ సిఫారసు చేసింది. దీనితో నూతన మార్గదర్శకాల ప్రకారం విచారణ చేపట్టేందుకు బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్-2 సిద్ధమైంది.
కృష్ణా జలాల్లో తెలంగాణకు అత్యంత కీలకమైన న్యాయమైన వాటా సాధన కోసం ట్రిబ్యునల్ ఎదుట వాదనలను వినిపించాలంటే మన రాష్ట్ర ప్రభుత్వం అంతర్రాష్ట్ర అంశాల్లో అనుభవజ్ఞులైన సమర్థులైన అధికారులు, సహాయకులను ఇంటర్ స్టేట్ విభాగంలో నియమించాలి. వారికి ఈ.ఎన్.సి. జనరల్ ఎప్పటి కప్పుడు దిశానిర్దేశం చేస్తూ ఉండాలి. కానీ, ప్రస్తుతం ఆ పరిస్థితి లేకుండా పోయింది. శ్వేత పత్రం తయారీ, మేడిగడ్డ పర్యటనపై దృష్టి సారించినంతగా ఇంటర్ స్టేట్ విభాగంపై, ట్రిబ్యునల్ అంశంపై ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించలేదు. వెంటనే ఇంటర్ స్టేట్ అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి, వారికి దిశానిర్దేశం చేసినందుకు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టక పోవటం అవగాహనా లోపమా? నిర్లక్ష్యమా అర్ధం కావటం లేదు. మరొక వైపు ఇంటర్ స్టేట్ విభాగం ఛీఫ్ ఇంజనీర్ మోహన్‌కుమార్ ఇటీవలే నెలరోజులు సెలవుపై వెళ్లడంతో ప్రభుత్వ బాధ్యతలను ఈఎంసి జనరల్ వద్ద విధులు నిర్వహిస్తున్న చీఫ్ ఇంజనీర్ శంకర్ నారాయణకు అప్పగించింది. తెలం గాణ తరఫున ట్రిబ్యునల్ ఎదుట బలమైన వాదనలు వినిపించేందుకు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం సీనియర్ న్యాయవాదులు వైద్యనాథన్, రవీందర్రావు, నిఖిల్ స్వామి, తదితరులను నియమించింది. కానీ ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తమను కొనసాగిస్తుందా? లేదా? అనే సందిగ్ధంలో న్యాయవాదులు పడిపో యారు. ఆ న్యాయవాదులు విచారణకు సంబంధించిన అంశాలను పొందుపర చడానికి సందేహాన్ని వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. నూతన ప్రభుత్వాన్ని నుంచి స్పష్టమైన హామీనిస్తే తప్ప ట్రిబ్యునల్‌కు సంబంధించిన అంశాలను ముట్టుకో కూడదనే భావనలో వారు ఉన్నట్టు తెలుస్తోంది. అయినప్పటికీ అంతర్రాష్ట్ర జలవిభాగం అధికారులతోగానీ, న్యాయవాదులతోగానీ, రాష్ట్ర ప్ర భుత్వం ఇప్పటి వరకు సమావేశాన్ని నిర్వహించలేదు. దీంతో ఏం చేయాలో తెలీక అంతర్రాష్ట్ర జల విభాగం అధికారులు దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. ఈ విషయంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఎంత త్వరగా నిర్ణయాలను తీసుకుంటే తెలంగాణకు అంత మంచిది.
– డాక్టర్ కోలాహలం రామ్ కిశోర్, 9849328496