వామపక్షాలతో చర్చలు జరుగుతున్నాయి

with the left
Discussions are going on– స్క్రీనింగ్‌ కమిటీ భేటీ తర్వాత మురళీధరన్‌ వెల్లడి
– తుది జాబితాపై కాంగ్రెస్‌ కసరత్తు…
– వీలైనంత త్వరగా రెండో జాబితా ప్రకటిస్తాం : మాణిక్‌ రావ్‌ ఠాక్రే
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తుది జాబితాను వీలైనంత త్వరగా ప్రకటిస్తామని కాంగ్రెస్‌ నేతలు తెలిపారు. ఇప్పటికే 55 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన ఆ పార్టీ, మిగిలిన స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై శనివారం నాడిక్కడ కీలక భేటి జరిగింది. కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) కేసీ వేణుగోపాల్‌ నివాసంలో రాష్ట్ర నేతలు భేటీ అయ్యారు. ఈ భేటీలో స్క్రీనింగ్‌ కమిటీ చైర్మన్‌ మురళీధరన్‌, రాష్ట్ర ఇన్‌చార్జి మాణిక్‌ రావ్‌ ఠాక్రే, పీసీసీ రేవంత్‌ రెడ్డి, ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, ఇతర నేతలు హాజరయ్యారు. సాయంత్రం 4 గంటలకు ప్రారంభమైన ఈ భేటి… రాత్రి 10 గంటల వరకు సాగింది. దాదాపు ఆరు గంటల పాటు సాగిన ఈ భేటిలో పెండింగ్‌ లో ఉన్న 64 స్థానాలతో పాటు, వామపక్ష పార్టీలతో పొత్తులపై చర్చించారు. భేటీకి ముందు స్క్రీనింగ్‌ కమిటీ చైర్మన్‌ మురళీధరన్‌ మీడియాతో మాట్లాడారు. రెండో విడత అభ్యర్థుల జాబితాపై చర్చించబోతున్నట్లు వెల్లడించారు. ఏ సమయంలో అయినా తుది జాబితా రావచ్చన్నారు. వామపక్ష పార్టీలతో పొత్తు, సీట్ల కేటాయింపుపై చర్చలు జరుగుతున్నాయని చెప్పారు.
కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఒక్కో సీటు కోసం అనేక మంది ఆశావాహులు పోటీపడుతున్నారని రాష్ట్ర ఇన్‌చార్జి మాణిక్‌ రావ్‌ ఠాక్రే అన్నారు. తెలంగాణలో బిజెపి పరిస్థితి ఎలా ఉందో అందరికి తెలుసునని, బిజెపి నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థులే లేరని విమర్శించారు. స్క్రీనింగ్‌ కమిటీ నివేదికను కాంగ్రెస్‌ ఎలక్షన్‌ కమిటీ(సీఈసీ) ముందు పెడతామన్నారు. త్వరలోనే సీఈసీ భేటీ ఉంటుందని, వీలైనంత త్వరగా అభ్యర్థుల జాబితా ప్రకటిస్తామని అన్నారు. అయితే సీఈసీ తరువాత మరో జాబితా ఉంటుందా లేదా అన్నది స్పష్టత వస్తుందన్నారు. వామపక్ష పార్టీతో ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి చర్చలు జరుపుతున్నట్లు చెప్పారు. తెలంగాణలో మరోసారి రాహుల్‌, ప్రియాంక గాంధీల పర్యటనలు ఉండేలా ప్రయత్నిస్తున్నట్లు వివరించారు. కాంగ్రెస్‌లో రెబెల్స్‌ లేరని, అధిష్ఠానం నిర్ణయం మేరకు అభ్యర్థుల ప్రకటన ఉంటుందని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు.