చర్చలు విఫలం

Negotiations failed– రైతు నేతలు, కేంద్రమంత్రుల మధ్య పురోగతి లేని చర్చలు
– పెరుగుతున్న మహిళా రైతుల సంఖ్య
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
కనీస మద్దతు ధర చట్టం, రుణమాఫీ తదితర రైతుల డిమాండ్లపై రైతు నేతలు, కేంద్ర మంత్రుల మధ్య చర్చలు విఫలం అయ్యాయి. దీంతో ఉద్యమం కొనసాగుతోందని రైతులు ప్రకటించారు. హర్యానా సరిహద్దులో జరుగుతున్న రైతుల ఉద్యమం ఆరో రోజు కొనసాగింది. ఈ సందర్భంగా ఆదివారం చండీగఢ్‌ లోని మహాత్మా గాంధీ స్టేట్‌ ఇన్సిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎంజిఎస్‌ఐపిఎ) రైతు నాయకులతో కేంద్ర మంత్రులు నాలుగో విడత చర్చలు జరిగాయి. చర్చల్లో రైతు నేతలు కిసాన్‌ మజ్దూర్‌ మోర్చా (కెఎంఎం) సమన్వయకర్త సర్వన్‌ సింగ్‌ పంధేర్‌, బికెయు ఏక్తా (సింధుపూర్‌) అధ్యక్షుడు జగ్జిత్‌ సింగ్‌ దల్లేవాల్‌ హాజరయ్యారు. కేంద్ర వ్యవసాయ మంత్రి అర్జున్‌ ముండా, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్‌ గోయల్‌, కేంద్ర హౌం వ్యవహారాల సహాయ మంత్రి నిత్యానంద్‌ రారు పాల్గొన్నారు. అలాగే పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మన్‌ కూడా చర్చల్లో పాల్గొన్నారు. అంతకుముందు కేంద్ర మంత్రులు, పంజాబ్‌ సీఎం హౌటల్‌ లో భేటీ అయి, రైతు ఆందోళనపై చర్చించారు. సమావేశానికి ముందు, పంధర్‌ మాట్లాడుతూ, తమకు ఆశ ఉందని, బంతి ఇప్పుడు కేంద్రం కోర్టులో ఉందని అన్నారు.
పెరుగుతున్న మహిళా రైతుల సంఖ్య
రైతు ఉద్యమం పెరుగుతున్న కొద్దీ మహిళా రైతుల సంఖ్య మరింత పెరుగుతోంది. మహిళా సంఘాల సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొంటూభోజన ఏర్పాట్లలో సహకరిస్తున్నారు. రైతు కుటుంబాలకు చెందిన మహిళలు తమ పిల్లలతో కలిసి నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వాస్తవానికి, పంజాబ్‌ నుండి రైతులు అధికంగా ఉద్యమంలో పాల్గొంటున్నారు. అమృత్‌సర్‌, లూథియానా, ఫిరోజ్‌పూర్‌ ప్రాంతాల రైతులు ఎక్కువగా వచ్చారు. గత 5 రోజులుగా రైతులందరూ కుటుంబానికి దూరంగా ఉండటంతో కుటుంబ సభ్యులు ఆదివారం వారిని కలవడానికి వచ్చారు.