చర్చలు సఫలం… సమ్మె విరమణకు ఒప్పందం

– డీహెచ్‌ డాక్టర్‌ జి.శ్రీనివాసరావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌/ ముషీరాబాద్‌
కాంట్రాక్ట్‌ ఏఎన్‌ఎంల సమస్యలు, సమ్మెపై సీఐటీయూ, ఏఐటీయూసీ, బీఆర్టీయూ, తదితర సంఘాలు నాయకులు, కాంట్రాక్ట్‌ ఏఎన్‌ఎంల ప్రతినిధులతో నిర్వహించిన చర్చలు సఫలమయ్యాయని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ గడల శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం ఆయన వివిధ సంఘాల నాయకులతో హైదరాబాద్‌ కోఠిలోని తన కార్యాలయంలో చర్చించారు. కాంట్రాక్ట్‌ ఏఎన్‌ఎంల డిమాండ్ల అమలుకున్న సాధ్యాసాధ్యాలపై కమిటీ వేయాలని ఆయా యూనియన్లు కోరికను మన్నించి ప్రభుత్వం అందకు అంగీకరించిందని తెలిపారు. ప్రభుత్వం తరపున సమ్మె విరమించాలని కోరగా యూనియన్‌ నాయకులు సానుకూలంగా స్పందించారనీ, ప్రభుత్వ ఉత్తర్వులు ఇచ్చిన నాటి నుంచే సమ్మె విరమిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఈ నెల 4న కమిటీ వేస్తూ ఉత్తర్వులు విడుదల చేయ నున్నట్టు తెలిపారు.
జీవో వచ్చాకే సమ్మె విరమణ :భూపాల్‌
చర్చల అనంతరం తెలంగాణ యునైటెడ్‌ మెడికల్‌, హెల్త్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (టీయుఎంహెచ్‌ఇయూ – సీఐటీయూ అనుబంధం) గౌరవాధ్యక్షులు భూపాల్‌ మీడియాతో మాట్లాడారు. అన్ని జిల్లాల నాయకులతో సంప్రదించిన వారి సమ్మతితోనే జీవో వచ్చాక సమ్మె విరమించాలని నిర్ణయించినట్టు తెలిపారు. అప్పటి వరకు సమ్మె యధాతధంగా కొనసాగుతుందని చెప్పారు. ప్రభుత్వం కమిటీ వేశాక నివేదిక సమర్పించాల్సి ఉంటుందనీ, అందుకోసం నాలుగైదు రోజుల్లో రాష్ట్ర కమిటీ సమావేశం ఉంటుందని తెలిపారు. సోమవారం జీవో వచ్చేంత వరకు ముందు నిర్ణయించినట్టుగానే సమ్మె కార్యక్రమాలను కొనసాగించాలని కాంట్రాక్ట్‌ ఏఎన్‌ఎంలకు సూచించారు.