మతోన్మాదుల కుట్రలను ఓడించిన నెహ్రూ

Nehru defeated the conspiracies of fanaticsమన జాతిపిత గాంధీజీ హత్యకు పన్నిన కుట్ర వెనుక ఆర్‌ఎస్‌ఎస్‌ హస్తం ఉన్న సంగతి అందరికీ తెలిసినదే. ఐనప్పటికీ అదే ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు గాంధీజీ పట్ల ఎంతో భక్తి నటిస్తారు. ఈ నాటకం గురించి కూడా అందరికీ తెలుసు. గాంధీతో బాటు సర్దార్‌ పటేల్‌, సుభాష్‌ చంద్రబోస్‌, అంబేద్కర్‌ తదితర జాతీయోద్యమ నాయకుల పట్ల కూడా హిందూత్వ శక్తులు చాలా గౌరవాన్ని నటిస్తూంటారు. కాని ఒక్క జవహర్‌లాల్‌ నెహ్రూ విషయంలో మాత్రం విపరీతమైన ద్వేషాన్ని వెళ్లగక్కుతూ వుంటారు. చరిత్రలో నెహ్రూకు సంబం ధించిన జ్ఞాపకాలు కూడా ఏవీ మిగల కూడదన్నట్టుగా వ్యవహరిస్తూంటారు.
ఇంత విద్వేషాన్ని కలిగి వుండడానికి కారణం ఏమిటి? తామే సిసలైన దేశభక్తులమని రొమ్ములు బాదు కుంటూ చెప్పుకునే హిందూత్వ వాదులకు మూడు దశాబ్దాలపాటు బ్రిటిష్‌ పాలకులతో పోరాడిన నెహ్రూ పట్ల- అందులో తొమ్మిదేండ్లపాటు బ్రిటిష్‌ జైళ్లలో మగ్గిన నెహ్రూ పట్ల ఈ ద్వేషం ఎందుకు? ఇది తెలియాలంటే స్వతంత్రం వచ్చిన తొలినాళ్లలో హిందూ, ముస్లిం మతోన్మాదులు ఆ స్వతంత్రాన్ని వమ్ము చేయడానికి పన్నిన కుట్రలేమిటో తెలియాలి. ఆ కుట్రలను వమ్ము చేసి జాతీయోద్యమ స్ఫూర్తికి అనుగుణంగా లౌకికతత్వాన్ని స్థిరపరచిన నెహ్రూ పాత్ర ఏమిటో తెలియాలి.
భారత దేశానికి స్వాతంత్య్రం ఇవ్వనున్నట్టు అప్పటి బ్రిటిష్‌ ప్రధాని అట్లీ 1946 ఆగస్టులో ప్రకటించారు. అప్పటి నుంచీ 1952 వరకూ ఆరేండ్లపాటు హిందూ, ముస్లిం మతోన్మాద శక్తులు, సంస్థలు చేయని దురాగతం అంటూ లేదు.
1946 సెప్టెంబర్‌లో నెహ్రూ ప్రధానిగా ఒక మధ్యంతర ప్రభుత్వం ఏర్పడింది. ఒక నెల తిరక్కుండానే బెంగాల్‌ ప్రాంతంలోని నవాఖలిలో భారీ ఎత్తున హింసాకాండ చెలరేగింది. ప్రత్యేక పాకిస్తాన్‌ కావాలన్న డిమాండ్‌తో ముస్లింలీగ్‌ ప్రత్యక్ష కార్యాచరణకు పిలుపునిచ్చింది (ఈ పిలుపును ఆర్‌ఎస్‌ఎస్‌ ఏనాడూ వ్యతిరేకించలేదు. పైగా హిందువులకు వేరే రాజ్యం కావాలంటూ అదే ద్విజాతి సిద్ధాంతాన్ని బలపరిచింది. మతాలు వేరైనా మతోన్మాదులు మాత్రం ఒకరినొకరు బలపరుచుకుంటూ వుంటారన్నదానికి ఇదే ఉదాహరణ). ముస్లింలీగ్‌ నాయకత్వంలో నడుస్తున్న బెంగాల్‌ ప్రొవిన్షియల్‌ ప్రభుత్వం ఈ అల్లర్లను అణచివేయడానికి ఏ విధమైన శ్రద్ధా కనబరచలేదు. నవాఖలిలో హిందువుల మీద జరిగిన హింసాకాండకు ప్రతీకారంగా అన్నట్టు పొరుగునే ఉన్న బీహార్‌లో పెద్ద ఎత్తున ముస్లింల మీద దాడులు జరిగాయి. ఈ దాడుల వెనుక ఆర్‌ఎస్‌ఎస్‌దే ప్రధాన పాత్రఅని వేరే చెప్పనక్కరలేదు.
మహాత్ముడు 1946 నవంబర్‌ 6న స్వయంగా నవాఖలి పర్యటించారు. అప్పటి నుంచీ మత ఘర్షణలు చెలరేగు తున్న ప్రాంతాలన్నింటానాలుగు మాసాలపాటు, 1947 మార్చి 4 వరకూ పర్యటిస్తూనే వున్నారు. కాలినడకన కల్లోలిత ప్రాంత గ్రామాలలో తిరిగారు. నెహ్రూ కూడా నవంబర్‌ 1946లో బీహార్‌ అంతా పర్యటించారు. నెహ్రూతో బాటు సర్దార్‌ పటేల్‌, రాజేంద్ర ప్రసాద్‌, మౌలానా ఆజాద్‌, ఆచార్య కృప లానీ, జయప్రకాశ్‌ నారాయణ వంటి ఇతర జాతీయ నేతలందరూ మతోన్మాద ప్రమా దం నుండి దేశాన్ని కాపాడుకోవడానికి రంగంలోకి ప్రత్యక్షంగా దిగారు. దానితో బాటు నెహ్రూ తాత్కాలిక ప్రభుత్వ నేతగా అధికార యంత్రాంగాన్ని పూర్తిగా రంగం లోకి దించి పరిస్థితిని అదుపు చేయడానికి సర్వ శక్తులనూ ఒడ్డారు. ”హిందూ- ముస్లిం ఘర్షణలు జరిగే ప్రదేశంలో నేను ప్రత్యక్షంగా అడ్డుగా నిల బడ తాను. హిందూ, ముస్లిం సోదరులు ఒకరినొకరు చంపుకునే ముందు వాళ్లు నా శవం మీదుగా నడిచిపోవలసిందే” అని నెహ్రూ ప్రకటించారు.
బ్రిటిష్‌ ప్రభుత్వం మతోన్మాద శక్తులకు ఆజ్యం పోయడానికే అన్నట్టు దేశాన్ని మత ప్రాతిపదికన చీల్చడానికే నిర్ణయించింది.దాని పర్యవసానంగా ఇటు బెంగాల్‌ నుంచి, అటు పశ్చిమ పంజాబ్‌ నుంచి శరణార్ధులు లక్షలాదిగా భారతదేశంలోకి తల దాచుకోడానికి రాసాగారు. దేశంలో వివిధ ప్రాంతాల్లో హింసాకాండ చెలరేగింది.1947 ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో నెహ్రూ ”దేశంలో శాంతి, సామ రస్యాలను నెలకొల్పడం ఈ ప్రభుత్వపు మొదటి బాధ్యత. అందుకోసం మతో న్మాద శక్తులను నిర్దాక్షిణ్యంగా అణచి వేస్తాం….దేశం ఏదో ఒక మతం పాలనలో నడవాల నుకోవడం చాలా తప్పు. మన మువ్వన్నెల జెండాకు తలొంచి గౌరవించేవారందరూ, వారే మత విశ్వాసాలను కలిగి వున్నప్పటికీ, ఏ కులానికి చెందినవారైనప్పటికీ, సమాన హక్కులను కలిగి వుంటారు” అని ప్రకటించారు. ఆ వెంటనే నెహ్రూ ఘర్షణలు జరిగిన ప్రాంతాలన్నింటినీ ప్రత్యక్షంగా సందర్శించారు (నేటికీ మణిపూర్‌ను సందర్శించ డానికి సాహసించని మోడీ స్థాయి ఏపాటిదో చూడండి).
కొద్ది కాలంలోనే మత ఘర్షణలు నిలిచిపోయి పరిస్థితి అదుపులోకి వచ్చింది. గాడ్సే ఇంతలోనే మహాత్ముడిని పొట్టన పెట్టు కున్నాడు. ”గాంధీజీ హత్య వెనుక ఉన్నది ఒక రిద్దరు వ్యక్తులు మాత్రమే కాదు. ఒక పెద్ద సంస్థ ఉంది” అని నెహ్రూ ప్రకటించారు. 1948 ఫిబ్రవరి 5న రాష్ట్రాల ముఖ్యమంత్రులకు రాసిన లేఖలో దేశంలో వివిధ ప్రాంతాల్లో అనేకమంది ప్రముఖులను హత్యలు చేసి అల్లకల్లోలాన్ని సృష్టించి దేశాన్ని అస్థిరతపాలు చేసి అధికారాన్ని చేజిక్కించు కోవాలనే కుట్ర సాగుతోందంటూ నెహ్రూ హెచ్చరించారు.
ఉప ప్రధాని, హోం శాఖామాత్యులు అయిన సర్దార్‌పటేల్‌ ఈ కుట్రను ఛేదిం చడంలో నెహ్రూకు పూర్తి అండదండలిచ్చారు. ఆర్‌ఎస్‌ఎస్‌ను నిషేధించారు. 25వేల మంది ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలను జైళ్లలో పెట్టారు. 1949లో తమకు, రాజకీయాలకు ఎటు వంటి సంబంధం లేదంటూ ఆర్‌ఎస్‌ఎస్‌ రాతపూర్వకంగా ఇచ్చిన వివరణ తర్వాత ఆర్‌ఎస్‌ఎస్‌ మీద నిషేధాన్ని ఎత్తివేశారు (తమ ఆర్‌ఎస్‌ఎస్‌ మూలాలను మోడీతో సహా అనేకులు బహిరంగంగా ప్రకటించుకోవడం బట్టి ఆనాటి వివరణ ఎంత బూటకమో తేటతెల్లమౌతోంది).
ఆ తర్వాత 1951-52 కాలంలో మొదటి సాధారణ ఎన్నికల పూర్వ రంగంలో నెహ్రూ పోషించిన పాత్ర చాలా కీలకమైనది. ”ముస్లిం పాకిస్తాన్‌”కు ప్రతిగా ”హిందూ రాష్ట్ర” నినాదాన్ని మతోన్మాదులు ఈ ఎన్నికలలో ముందుకు తెచ్చారు. దానిని సవాలుగా తీసుకున్న నెహ్రూ జాతీయోద్యమ స్ఫూర్తికి అనుగుణంగా భారతదేశం లౌకిక రాజ్యంగా ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రజలు హిందూ రాష్ట్రను కోరుతున్నారా, లేక లౌకిక భారతాన్ని కోరు తున్నారా తేల్చి చెప్పాలని ఆ ఎన్నికలను దాదాపు ఒక రిఫరెండం మాదిరిగా మార్చారు.
ఆ ఎన్నికలలో దాదాపు 40వే కిలోమీటర్ల మేరకు నెహ్రూ ప్రయాణించారు. సభల్లో నెహ్రూ సుమారు 3 కోట్ల50 లక్షల మందిని ఉద్దేశించి ప్రత్యక్షంగా ప్రసం గించారు. అప్పటి జనాభాలో అది దాదాపు పదో వంతు. హిందూ రాష్ట్ర నినా దాన్ని సమర్ధించిన జనసంఘం, హిందూ మహాసభ, రామరాజ్య పరిషత్‌ కూటమి మొత్తానికి ఆ ఎన్నికల్లో కేవలం పదే పది సీట్లు దక్కాయి. అప్పటి లోక్‌ సభ బలం 489. మతోన్మాద కూటమికి కేవలం ఆరు శాతం ఓట్లు మాత్రమే దక్కాయి.
ఎన్నికల్లో ప్రజలను నెహ్రూ కోరిన తీర్పు చాలా ప్రధానమైనది. దేశ రాజ్యాంగ స్ఫూర్తిని, మౌలిక సూత్రాలను కాపాడుకోవడమా లేక విద్వేష రాజకీయాలకు దేశాన్ని బలి చేయడమా అన్న ప్రశ్నకు ప్రజలు స్పష్టంగా ఇచ్చిన తీర్పు లౌకిక భారతదేశానికి బలమైన పునాది వేసింది. మతోన్మాదానికి, మత విశ్వాసాలకు సంబంధం లేదని, మత విశ్వాసాలు ప్రాచీనమైనవైతే, మతోన్మాదం ఆధునిక రాజ కీయ పెడధోరణి అని నెహ్రూ స్పష్టం చేశారు. జాతీయోద్యమాన్ని దెబ్బ తీయ డానికి సామ్రాజ్యవాద శక్తులు మతోన్మాదాన్ని ప్రోత్సహిస్తాయని, ఆ మద్దతు అందనినాడు మతోన్మాద శక్తులు పేకమేడల్లా కూలిపోతాయని చెప్పారు. నేడు కూడా మతోన్మాద శక్తులు ప్రపంచంలో వివిధ దేశాల్లో బలంగా ముందుకు రావడం వెనుక కార్పొరేట్‌ శక్తుల ప్రోద్బలం ఉందన్నది స్పష్టంగానే మనందరికీ కనిపిస్తోంది.
ప్రభుత్వ కార్యకలాపాల్లో, ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు వంటి సందర్భాల్లో మతపరమైన తంతులు ఏవీ ఉండరాదని నెహ్రూ ప్రక టించారు. తాను ఆచ రణలో పాటించారు. వ్యక్తిగత మత విశ్వాసాలను రాజకీయాలలోకి రానివ్వలేదు. ఆ తర్వాత కాలంలో మత విశ్వాసాలను రాజకీయ లబ్ధి కోసం వాడుకోవాలనే దుగ్ధ కాంగ్రెస్‌ పార్టీతో సహా బూర్జువా పార్టీలన్నింటిలోనూ క్రమంగా పెరుగుతూ వచ్చి ంది. ఈ అవకాశవాదమే మతోన్మాద శక్తులకు ఊతమిస్తోంది. భారతదేశ లౌకిక, ప్రజాస్వామ్య పునాదులను, రాజ్యాంగ మౌలిక విలువలను కాపాడుకోవడానికి నేడు కృషి చేస్తున్నవారదంరికీ నెహ్రూ నిర్వహించిన పాత్ర స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. అందుకే అది మతోన్మాద శక్తులకు కన్నెర్రగా కూడా ఉంటుంది.
ఎం.వి.ఎస్‌ శర్మ