నయా ఉదారవాదం, అంతకు మునుపు కాలం

Neoliberalism predates thatఅన్ని విమర్శలూ మత విమర్శతో ప్రారంభం కావాలని మార్క్స్‌ ఒక సందర్భంలో అన్నాడు. అదే మాదిరిగా ఆర్థికాంశాలకు సంబంధించి ప్రస్తుత కాలంలో విమర్శ జీడీపీతో మొదలు కావాలి. జీడీపీ అనే భావనతో సహా, దానికి సంబంధించిన గణాంకాలు మొత్తం బూటకమే. ఆ ప్రాతిపదిక దోపిడీ అనే ఒక లక్షణాన్ని గుర్తించదు. ఉదాహరణకు: మొఘల్‌ చక్రవర్తి, అతడి అధికార గణం పొందే ఆదాయాన్ని దేశానికి వాళ్లు అందించిన సేవలకు ప్రతిఫలం అని జీడీపీ అంటుంది. వాళ్లు పొందే మొత్తాన్ని దేశపు మొత్తం చేసిన ఉత్పత్తికి అదనంగా కలిపి జీడీపీని లెక్కిస్తుంది. నిజానికి అది దేశ ఉత్పత్తి నుండి ఆ మొఘల్‌ చక్రవర్తి, తదితరులు చేజిక్కించుకున్న భాగమే. కాని దానిని కూడా ఉత్పత్తిలో భాగం అని లెక్కించడం ద్వారా రెండింతలుగా చూపిస్తుంది. ఇది తప్పు. కాని నయా ఉదారవాద సమర్ధ కులు ఆ విధంగానే లెక్కించి ఆ కాలం చాలా గొప్పగా అభివృద్ధి చెందినట్టు చిత్రిస్తారు.అదే విధంగా నయా ఉదారవాద విధానాలకు పూర్వం ఉనికిలో ఉండిన (ప్రభుత్వ నియంత్రణలో ఆర్థిక వ్యవస్థ నడిచిన) కాలంలో కన్నా నయా ఉదారవాద కాలంలో జీడీపీ వృద్ధిరేటు చాలా ఎక్కువగా ఉందని, అంతకు పూర్వపు కాలంలోని 40 ఏండ్లలో భారత దేశ ఆర్థిక పురోగమనం చాలా మందకొడిగా సాగిందని చెప్తూ నయా ఉదారవాద విధానాల కాలం లోనే దేశాభివృద్ధి వేగం పుంజు కున్నట్టు చెప్పుకుంటారు.
ఒకానొక కాన్ఫరెన్సులో నేను, నా సహచరుడు సంయుక్తంగా సమర్పించిన పత్రాన్ని విమర్శిస్తూ ఐఎంఎఫ్‌ డైరక్టర్‌ ఇదే విధంగా నయా ఉదారవాద కాలంలోనే మన దేశ ఆర్థికాభివృద్ధి వేగంగా జరిగిందంటూ వ్యాఖ్యానించాడు. అయితే ఆ సందర్భంలో ఆయన జిడిపి గురించి ప్రస్తావించలేదు. 1960, 70 దశకాల్లో మన దేశంలో ఎక్కడ చూసినా ఎంతసేపూ అంబాసిడర్‌ కార్లు లేదా ఫియట్‌ కార్లు మాత్రమే కనిపించేవని, అదే నయా ఉదారవాద విధానాలు అమల్లోకి వచ్చాక చాలా స్టైలిష్‌గా ఉంటూ వేగంగా దూసుకుపోయే కార్లు కనిపిస్తున్నాయని అన్నారు. ఒక పేరున్న ఆర్థికవేత్త అయినప్పటికీ, ఆ ఐఎంఎఫ్‌ డైరక్టర్‌ సాంఘిక సంక్షేమం అంటే ఏమిటో అర్ధం చేసుకోలేక పోయాడని నాకర్ధమైంది.
అయితే జీడీపీ ప్రమాణాన్ని సమర్ధించే వాదనలను అంత తేలికగా తీసిపారేయకూడదు. ఉత్పత్తి అయిన సంపద ఏ విధంగా పంపిణీ అవుతోందన్న అంశాన్ని కాని, సాంఘిక సంక్షేమం ఎలా అమలౌతోందన్న అంశాన్ని కాని జీడీపీ సూచించదు. అందుచేత కేవలం జీడీపీనే కొలబద్దగా తీసుకుని నయా ఉదారవాద విధానాలు మెరుగైనవా లేక వాటికన్నా అంతకు మునుపు అమలు జరిగిన విధానాలే కాస్త నయమా అన్నది నిర్ధారించకూడదని నా అభిప్రాయం. నయా ఉదారవాద కాలంలో ఆదాయాల్లో అసమానతలు తగ్గకపోగా మరింత పెరిగాయని, దిగువ స్థాయి ప్రజల పరిస్థితులు మరింత దిగజారాయని మనకి ఇప్పటికే స్పష్టంగా తెలుసు. అందుచేత ఇక్కడ ప్రశ్న ఏమంటే నయా ఉదారవాద కాలంలో అత్యధిక ప్రజానీకం జీవన స్థితిగతులు అంతకు మునుపటి కాలంలో కన్నా మెరుగు పడ్డాయా లేక దిగజారాయా అన్నదే. నా అభిప్రాయం దిగజారాయనే. అంతేకాక, నయా ఉదారవాద కాలంలో జీడీపీ వృద్ధిరేటు నమోదైనదానిని కూడా అతిగా చేసి చూపించారు. చాలా మంది పరిశోధకులు సైతం ఈకాలంలో జీడీపీ వృద్ధిరేటును అతిగా అంచనాలు వేశారని, అందుచేత ఆర్థికవృద్ధి రేటును కూడా అతిగా అంచనా వేశారని వాదిస్తు న్నారు. కేంద్ర ప్రభుత్వానికి గతంలో ముఖ్య ఆర్థిక సలహాదారుడిగా పని చేసిన అరవింద్‌ సుబ్రమణియన్‌ వారిలో ఒకరు. 2011 -12 నుంచి 2016-17 మధ్య కాలంలో భారతవేశపు వృద్ధి రేటు ప్రతీయేటా కనీసం 2.5 శాతం అదనంగా లెక్కించారని ఆయన అన్నారు. 2011-12లోనే జీడీపీ అంచనాలకు కొత్త ప్రాతిపదికను ఉపయోగించడం మొదలు పెట్టారు. ఇప్పటిదాకా అదే ప్రాతిపదికను కొనసాగిస్తున్నారు. అందుచేత అంతకు ముందు కాలంతో పోల్చితే నయా ఉదారవాద కాలంలో జీడీపీ వృద్ధిరేటు వాస్తవానికి 1 శాతం లేదా 1.5 శాతానికి మించదు. మరోపక్క ఆదా యాలలో అసమానతలు నిస్సందేహంగా పెరిగిపోయాయి. అంటే సామాన్య ప్రజల ఆదాయాలలో పెరుగుదల ఏమీ లేదన్నట్టే. అందుచేత ఆ సామాన్య ప్రజల కోణం నుంచి చూసినప్పుడు నయా ఉదారవాద కాలం సాధించిన విజయం ఏమీ లేదు. పైగా పెరిగిన అసమానతలు దేశంలోని ప్రజాతంత్ర వ్యవస్థల్ని, సమానత్వ విలువల్ని దెబ్బతీశాయి.
అంతేకాదు. ప్రజల జీవన పరిస్థితులు దిగజారిపోయాయన్న విషయాన్ని ధృవపరిచే ప్రత్యక్ష ఆధారాలు మన దగ్గర ఉన్నాయి. 20వ శతాబ్దపు తొలి సంవత్సరాలలో (1900 తర్వాత) బ్రిటిష్‌ వారి పెత్తనంలో భారతదేశం ఉన్నప్పుడు తలసరి ఆహార ధాన్యాల లభ్యత 200 కిలోలు. మనకు స్వతంత్రం వచ్చేనాటికి అది కాస్తా 137 కిలోలకు పడిపోయింది. వలస పాలన కొనసాగిన ఆ 50 సంవత్సరాల కాలంలో ఏకంగా 31 శాతం పడిపోయింది! నయా ఉదారవాద పండితులు ప్రస్తుతం తూర్పారబడుతున్న కాలంలో (అంటే ప్రభుత్వ నియంత్రణతో ఆర్థిక వ్యవస్థ 1960 -1980 కాలం) ఇది 186.2 కిలోలకు పెరిగింది. ఇది తప్పకుండా గణనీయమైన పెరుగుదల. కాని 20వ శతాబ్దపు ప్రారంభ సంవత్సరాల నాటి స్థాయికి చేరలేదు. నయా ఉదారవాద విధానాలు అమలవడం తర్వాత 2008 వరకూ దీర్ఘకాలం పాటు తలసరి ఆహారధాన్యాల లభ్యత పడిపోతూ వచ్చింది. ఆ తర్వాత కొంతపెరిగి, 2019-20లో 183.14 కిలోలకు చేరింది. 1991 నాటి స్థాయిని 2020-21లో మాత్రమే దాటి 186.77 కిలోలకు చేరింది. 2021-22లో కాస్త పెరిగి 187.13 కిలోలకు చేరింది. ఆహారధాన్యాల లభ్యత అనేది అభివృద్ధిని మదింపు చేసే ఒక ముఖ్యమైన ప్రమాణం. ఆ ప్రమాణం రీత్యా చూస్తే ఎదుగూ బొదుగూ లేకుండా నయా ఉదారవాద కాలంలో స్తంభించి పోయింది. 2022-23లో కోవిడ్‌ సహాయం కింద తలా ఐదు కిలోలు అందించిన కారణంగా తలసరి ఆహార ధాన్యాల లభ్యత మరికాస్త పెరిగింది. అయితే దీనిని వృద్ధికి సంకేతంగా పరిగణిం చలేం. ఎందుకంటే ఉన్న ఆహార ధాన్యాల నిల్వలను కరగబెట్టి ప్రజలకు పంచారే తప్ప అదనపు ఉత్పత్తి ఏమీ సాధించలేదు.
ఇప్పటివరకూ మనం ఆహారధాన్యాల సగటు లభ్యత ఆధారంగానే చర్చించాం. అందులో ఏ యే తర గతులకు ఎంతెంత అందుతోంది అన్నది చూడాలి. ఒకపక్క ఆదాయాల్లో అసమానతలు పెరుగుతున్నప్పుడు అధి కాదాయ వర్గాల్లో ఆహారధాన్యాల లభ్యత, వినియోగం పెరుగుతుంది. అదే విధంగా అల్పాదాయ వర్గాల్లో ఆ లభ్యత, వినియోగం తగ్గుతాయి. ఫలితంగా అల్పాదాయ వర్గాల ప్రజలకు పౌష్టికాహారం అందకుండా పోతుంది. ఈ విష యాన్ని ధృవీకరించే ఆధారాలు ఉన్నాయి. 1970 దశకంలో అప్పటి ప్లానింగ్‌ కమిషన్‌ గ్రామీణ ప్రాంతాలలో 2200 క్యాలరీలు, పట్టణ ప్రాంతాలలో 2100 క్యాలరీలు శక్తిని ఇచ్చే ఆహారాన్ని ప్రతీ ఒక్క వయోజనులూ పొందగలిగి వుండాలని కనీస ప్రమాణాన్ని నిర్ణయించారు. అంతకు తక్కువ మోతాదులో పొందుతున్న వారంతా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నట్టే పరిగణించారు. 1973-74 లో గ్రామీణ ప్రాంతాలలో ఆ కనీస ప్రమాణం ప్రకారం ఆహారం పొందలేక పోతున్నవారు 56.4 శాతం ఉండేవారు. 1993-94 నాటికి వారు 58 శాతం అయ్యారు. అంటే నయా ఉదారవాద విధానాలు అమలు అవడానికి మునుపు గ్రామీణ పేదరికం స్థాయిలో పెద్దగా మార్పు లేదు. పేదరికం పెరగనూ లేదు, తగ్గనూ లేదు అని చెప్పవచ్చు.
దాని పూర్తి భిన్నంగా 1993-94 నుండి 2017-18 మధ్య కాలంలో కనీస స్థాయిలో పౌష్టికాహారాన్ని పొందలేకపోయినవారు గ్రామీణ ప్రాంతాల్లో 58 శాతం నుండి 80 శాతానికి పెరిగారు (2017-18 నేషనల్‌ శాంపిల్‌ సర్వే గణాంకాలను మోడీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ప్రజలకు అందుబాటులో లేకుండా చేసింది. అందు చేత ఉజ్జాయింపుగానే లెక్కించాల్సి వచ్చింది)! పేదరికం పరిస్థితి ఎంత దిగజారిందంటే ఆ గణాంకాల్ని ప్రభుత్వం తొక్కిపట్టడమే కాకుండా, పేదరికపు కొలమానాలనే మార్చివేసి కొత్త పద్ధతిలో శాంపిల్‌ సర్వే మొదలుపెట్టింది. దీనిని బట్టి నయా ఉదారవాద కాలంలో జీడీపీ ప్రమాణ సమర్ధకులు చెప్తున్న దానికి భిన్నంగా గ్రామీణ పేదరికం పెరిగిపోయిందని స్పష్టమౌతోంది. అయితే నయా ఉదారవాద సమర్ధకులు దీనికి జవాబుగా ఒక వాదనను ముందుకు తెస్తున్నారు. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువమంది తమ బిడ్డల్ని స్కూళ్లకి పంపుతున్నారని, ఆధునిక వైద్య సౌకర్యాలు పొంద గలుగుతున్నారని, సెల్‌ఫోన్లను అందరూ వాడగలుగుతున్నారని, గ్రామీణుల జీవనశైలి మారిపోయిందని, ఆహార ధాన్యాల కన్నా తక్కిన విషయాల మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారని, వారి అభిరుచులు మారిపోయాయని అంటూ, ఈ కారణాల వలన వారు తీసుకునే పౌష్టికాహారపు క్యాలరీల విలువ తగ్గిపోయిందని అంటున్నారు. దాన్నిబట్టి వారి పేదరికం పెరిగిపోయిందని నిర్ధారించకూడదంటున్నారు.
వాళ్లు ఇక్కడ విస్మరిస్తున్న అంశం ఒకటుంది. ప్రజలు వినియోగించే పలు రకాల సరుకుల్లో కొన్ని రకాల సరుకుల వినియోగాన్ని తగ్గించుకోవడం సాధ్యపడదు. మరికొన్ని సరుకుల వినియోగాన్ని తగ్గించుకోవడం వలన వారికి వెనువెంటనే ఇబ్బందులు రానప్పుడు అటువంటి సరుకుల వినియోగాన్ని వారు తగ్గించుకుంటారు. ఆహార ధాన్యాలు ఈరెండో కోవకు చెందుతాయి. వాటి వినియోగాన్ని తగ్గించుకుంటే వెనువెంటనే ఇబ్బందులు తలెత్తక పోవచ్చు కాని దీర్ఘకాలంలో నష్టం కలుగుతుంది. ఒక ఆపరేషన్‌ అవసరమైనప్పుడో, లేదా క్యాన్సర్‌ లాంటి రోగం సోకినప్పుడో చేయవలసిన ఖర్చు తగ్గించనూ లేరు, వాయిదా వేయనూలేరు. ఇటువంటి అనుకోని ఖర్చులు వస్తూనే వుంటాయి. అదే విధంగా సాంకేతిక పురోగతి కారణంగా కొన్ని కొత్తరకాల సరుకుల వినియోగం మొదలౌతుంది. కొన్ని పాత రకపు సరుకుల వినియోగం నిలిచిపోతుంది.
ప్రమాదకరమైన రోగం ప్రబలినప్పుడు ఒక వ్యక్తి తన గ్రామంలో ఉండే భూతవైద్యుడి మీద ఆధారపడలేడు. ఆధునిక వైద్యాన్ని ఆశ్రయించక తప్పదు. ఆ సందర్భంలో రోజువారీ ఆహారం మీద పెట్టే ఖర్చు తగ్గించుకోవడం అనివార్యం. అతడు ఆధునిక వైద్యం మీద ఖర్చు చేయగలుగుతున్నాడు గనుక అతని ఆర్థిక స్థితి మెరుగుపడిందని నిర్ధారించలేం కదా. పైగా ఆధునిక వైద్యపు ఖర్చులు విచ్చలవిడిగా పెరిగిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఇంగ్లాండ్‌ చక్రవర్తి 7వ హెన్రీ ఒక గాయం అల్సర్‌గా మారి సెప్టిక్‌ అయినందువలన మరణించాడు. అప్పటికి యాంటీ బయాటిక్స్‌ ఇంకా కనుగొనలేదు. ఇప్పుడు ఒక సామాన్యుడు ఆ యాంటీ బయాటిక్స్‌ను వాడగలుగు తున్నాడు. కాబట్టి ఈ సామాన్యుడు ఆనాటి 7వ హెన్రీ చక్రవర్తి కన్నా మెరుగ్గా జీవిస్తున్నాడని ఎవరైనా అనగలరా? తన జీవితంలో ఎప్పటికప్పుడు మారుతూ వుంటే పరిస్థితులను బట్టి తన వినిమయాన్ని మార్చుకోవడం అనివార్యం. అయితే, ఆ క్రమంలో ఆహారధాన్యాల వంటి కనీస అవసరాల వినిమయాన్ని సైతం తగ్గించుకోవలసిన పరిస్థితి ఉందా? లేదా? అన్నదానిని బట్టి అతడి జీవన స్థాయి మెరుగు పడిందో లేదో నిర్ధారించగలం. ఇలా నిర్ధారించే క్రమానికి ఆహారధాన్యాల లభ్యత అన్నది ఒక స్పష్టమైన ప్రమాణం. ఆ లభ్యత తగ్గుతోందీ అంటే సామాన్యుల జీవన ప్రమాణాలు మెరుగుపడడం లేదనే లెక్క.
నయా ఉదారవాద విధానాలకు పూర్వపు కాలంలో సామాన్యుల జీవన స్థితిగతులు ఎంతో కొంత మెరుగు పడ్డాయి. ఒకవైపు వారికి ఆహారధాన్యాల లభ్యతా పెరిగింది. మరోవైపు ఆధునిక సరుకులను వారు పొందగలగడం కూడా పెరిగింది. అయితే ఇదేమీ చాలా గొప్ప అభివృద్ధి అని చెప్పలేం. కాని, నయా ఉదారవాద కాలంలో మాత్రం పౌష్టికాహార లేమీ పెరిగిపోతోంది. జీవన పరిస్థితులూ దిగజారిపోతున్నాయి. జీడీపీ గణాంకాలను చూపిస్తూ ఈ మౌలిక సత్యాన్ని మరుగుపరచలేరు.
(స్వేచ్ఛానుసరణ)
ప్రభాత్‌ పట్నాయక్‌