హిందూత్వ భావజాలాన్ని జొప్పించేందుకే ఎన్‌ఈపీ

NEP is for inculcating Hindutva ideology– నూతన జాతీయ విద్యావిధానాన్ని రద్దు చేయాలి
– విద్యా రంగానికి కేంద్ర బడ్జెట్‌లో అరకొర నిధులు : ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ అధ్యక్షులు వీపీ సాను
– ప్రారంభమైన ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ప్లీనరీ సమావేశాలు
– సంఘం జెండావిష్కరణ ,అమరులకు జోహార్లు
– మోడీ జమానాలో విద్య కాషాయికరణ, కార్పొరేటీకరణ
నవతెలంగాణ-మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి
హిందూత్వ భావజాలాన్ని పిల్లల మెదల్లో జొప్పించేందుకే నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకొస్తున్నారని, కుట్రపూరితమైన ఎన్‌ఈపీని రద్దు చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ అధ్యక్షులు వీపీ సాను డిమాండ్‌ చేశారు. సంగారెడ్డి పట్టణంలోని సెయింట్‌ ఆంథోని డిగ్రీ కళాశాలలో భారత విద్యార్థి ఫెడరేషన్‌ రాష్ట్ర ఫ్లీనరీ సమావేశాలను ఆయన శనివారం ప్రారంభించారు. సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌ఎల్‌ మూర్తి అధ్యతన జరిగిన ప్రారంభ సభలో సాను మాట్లాడుతూ.. విద్యను వ్యాపారీకరణ, కాషాయీకరణ, కార్పొరేటీకరణ చేసేందుకే మోడీ నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకొస్తున్నారని విమర్శించారు. విద్యారంగంలో హిందూత్వ భావజాలాన్ని జొప్పించే జ్యోతిష్యం, వాస్తు పేరిట పాఠ్యాంశాలను తీసుకొస్తున్నారని విమర్శించారు. బడా బహుళజాతి కార్పొరేట్‌ కంపెనీలకు మేలు చేసేందుకు ఈ విద్యా విధానం ఉపయోగపడుతుందన్నారు. మోడీ పాలనలో కేంద్ర బడ్జెట్‌లో విద్యారంగానికి సరిపడా నిధులు కేటాయించడం లేదన్నారు. అవసరాలకు సరిపడా బడ్జెట్‌ కేటాయించకుండా ఎన్‌ఈపీని ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు.
రిజర్వేషన్లు పొందుతున్న సామాజిక తరగతులపై, స్వయం ప్రతిపత్తి గల సంస్థలపై, పరిశోధక విద్యార్థుల ఫెలోషిప్‌పై ఎన్‌ఈపీ రూపంలో పరోక్ష దాడి జరుగుతోందన్నారు. కాశ్మీర్‌ నుంచి కన్యాకుమారీ వరకు మతం పేరిట విద్వేషాల్ని రెచ్చగొట్టి రాజకీయంగా అధికారాన్ని పదిలం చేసుకుంటున్న బీజేపీ విధానాల పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నారు. మణిపూర్‌లో అల్లర్లకు బీజేపీ ఆజ్యం పోయడం వల్లే అమానమీయ సంఘటనలు జరిగాయన్నారు. ఒకే దేశం, ఒకే ఎన్నిక, ఒకే చట్టం పేరిట భారత దేశ భిన్నత్వాన్ని ధ్వంసం చేసేందుకు బీజేపీ పూనుకుంటోందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యారంగ సమస్యలపై ఎస్‌ఎఫ్‌ఐ మరింత సమరశీలంగా పోరాడేందుకు తెలంగాణ రాష్ట్ర ప్లీనరీ సమావేశాలు దోహదపడతాయని ఆకాంక్షించారు.
 తీవ్ర సంక్షోభంలో విద్యారంగం టి.నాగరాజు, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి
రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల ఫలితంగా ప్రభుత్వ విద్యారంగం తీవ్ర సంక్షోభంలోకి నెట్టబడిందని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు అన్నారు. ప్రభుత్వం పాఠశాల, ఉన్నత విద్యను గాలికి వదిలేసిందన్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో విద్యారంగానికి అమసరమైన నిధులు కేటాయించడం లేదన్నారు. పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌, ఫీజు రియింబర్స్‌మెంట్‌ తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ పాఠశాలలను మన ఊరు-మన బడి కింద చేపట్టిన పనులు నత్తనడకన సాగుతున్నాయని చెప్పారు. కేజీబీవీలో మౌలిక సదుపాయాల్లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. అద్దె భవనాల్లో సంక్షేమ హాస్టల్స్‌ నడపడంతో కనీసం స్నానాలు చేసేందుకు కూడా నీటి వసతి లేని దుస్థితి ఉందన్నారు.ఈ సమావేశాల్లో ఆహ్వాన సంఘం చైర్మెన్‌ విజయసాయిరెడ్డి, ఎస్‌ఎఫ్‌ఐ మాజీ నాయకులు గొల్లపల్లి జయరాజు, అతిమేల మాణిక్యం, కె.రాజయ్య, సాయిలు, ఆర్‌కె, అనిల్‌, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటికొండ రవి, ఆపీస్‌ బేరర్స్‌ శంకర్‌, సంతోష్‌, రజినీకాంత్‌, దాసరి ప్రశాంత్‌, అనిల్‌, అశోక్‌రెడ్డి, పూజ, మిశ్రీన్‌ సుల్తాన్‌, రాష్ట్ర నాయకులు పూజ, శంకర్‌, అరవింద్‌, సంతోష్‌, రమ్మ్య, సాక్షి, నల్లవల్లి రమేష్‌, ఎర్రోళ్ల మహేష్‌, సతీష్‌ పాల్గొన్నారు.
సంఘం జెండావిష్కరణ.. అమరులకు జోహార్లు
ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ప్లీనరీ సమావేశాల ప్రారంభం సంద ర్భంగా సంఘం జెండాను రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌ఎల్‌ మూర్తి ఎగురవేశారు.స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యం, సోషలిజం లక్ష్యా ల కోసం అంకితమై పనిచేసి ఉద్యమంలో అశువులుబాసిన అమరులను స్మరిస్తూ స్థూపానికి జోహార్లు అర్పించారు. సంఘం జాతీయ అధ్యక్షులు వీపీ సాను, రాష్ట్ర అధ్యక్ష, కార్య దర్శులు, ఆఫీస్‌ బేరర్స్‌, రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన ప్రతినిధులు జోహార్లు అర్పించారు. ఓ అమరులారా..! త్యాగధనులా రా..!! అంటూ పీఎన్‌ఎం కళాకారులు గీతాలాపన చేశారు.