– అందని డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు
– కరుణించని ‘గృహలక్ష్మి’
– ఎర్రజెండా నీడలో పోరుబాటపట్టిన నిరుపేదలు
– ‘ఇందిరమ్మ ఇండ్ల’ గ్యారంటీపైనే గంపెడాశలు
– ఆర్‌అండ్‌బీలో విలీనం చేసిన గృహనిర్మాణ శాఖ పునరుద్ధరణకు ప్రభుత్వం అడుగులు
– ‘రాజీవ్‌స్వగృహ’ అమ్మకానికీ ఆలోచనలు
– చిగురిస్తున్న పేదల ఆశలు
ఇన్నాళ్లూ డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల కోసం ఎదురుచూసిన పేదలను చివరకు ‘గృహలక్ష్మి’ కూడా కరుణించలేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సర్కారు ప్రకటించిన ‘ఇందిరమ్మ ఇండ్ల’ గ్యారంటీ పథకానికి కసరత్తు ప్రారంభించడంతో మళ్లీ పేదల సొంతింటి కలలు చిగురిస్తున్నాయి. గతంలో ఆర్‌అండ్‌బీలో విలీనం చేసిన గృహనిర్మాణ సంస్థను పునరుద్ధరించడంతోపాటు మిగిలిపోయిన రాజీవ్ స్వగృహాలనూ అమ్మే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. మరోవైపు గూడు కోసం పోరుబాట పట్టిన పేదలు సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకున్నారు. వీరిని ఖాళీ చేయించేందుకు గతంలో పోలీసులు లాఠీలు ఝలిపించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కేసులు నమోదు చేశారు. బెదిరించారు. అయినా పేదలు వెనుకడుగు వేయలేదు. ఇప్పటికీ అక్కడే ఉంటున్నారు. పట్టణ శివారులోని సర్కారు స్థలాల్లో వేలాదిగా జనం గుడిసెలు వేసుకుని తాత్కాలిక నివాసం ఏర్పరుచుకుంటున్న నేపథ్యంలో గోస పడుతున్న పేదల గూడుపై ప్రత్యేక కథనం..
నవతెలంగాణ – కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
రాష్ట్ర వ్యాప్తంగా గత సర్కారు సుమారు 2లక్షల డబుల్‌బెడ్‌రూమ్ ఇండ్లు మంజూరు చేస్తే అందులో 30శాతం కూడా పూర్తి చేయలేదు. పూర్తి చేసిన ఇండ్లలో సగం కూడా పంపిణీ చేయలేదు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే ఇండ్లు లేని పేదలు సుమారు 2లక్షల మందికిపైగానే ఉన్నారనేది ఓ అంచనా. దీంతో కట్టిన ఇండ్లు పంచక, కొత్తగా ఇండ్ల నిర్మాణమూ చేపట్టక ఏండ్లుగా విసిగిపోయిన పేదలు సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఎర్రజెండా చేతబూని పోరుబాట పట్టారు. జగిత్యాల, కోరుట్ల, రామగుండం నియోజకవర్గ కేంద్రాల్లోని ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకున్నారు. పోలీసు, రెవెన్యూ అధికారులు సహా స్థానిక ప్రజాప్రతినిధులు దాడులకు దిగినా వెనుకడుగు వేయకుండా తమ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. జగిత్యాల జిల్లా కేంద్రానికి టీనగర్, రాజారాం గుట్ట సమీపంలో సుమారు 6వేల మందికిపైగా పేదలు గుడిసెలు వేసుకుంటూ అక్కడే గడుపుతున్నారు. ప్రస్తుతం కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ సర్కారు వీరికి ఇందిరమ్మ ఇండ్ల గ్యారంటీ అందజేస్తుందని గంపెడాశతో వేచి చూస్తున్నారు.
గృహనిర్మాణ శాఖ పునరుద్ధరణకు అడుగులు
ఈనెల 12న గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్‌రెడ్డి గృహనిర్మాణ సంస్థ, రాజీవ్‌స్వగృహ, గృహనిర్మాణ మండలి అధికారులతో సమావేశమైన విషయం తెలిసిందే. ఇందులో ప్రధానంగా రోడ్లు భవనాల శాఖలో విలీనమైన గృహనిర్మాణ శాఖను పునరద్ధరించేందుకు ఆలోచనలు చేసినట్టు సమాచారం. 1983-87 మధ్య కాలంలోనే సదరు శాఖలో నియమితులైన సిబ్బంది ఉమ్మడి జిల్లా పరిధిలో సుమారు 50 నుంచి 60 మంది ఉండేవారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ శాఖ ఆధ్వర్యంలో వేలాది ఇందిరమ్మ ఇండ్లను నిర్మించిన చరిత్ర ఉంది. అయితే అందులో అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నాయని తరువాత అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్ సర్కారు సదరు శాఖను ఎత్తేసి రోడ్లు భవనాల శాఖలో విలీనం చేసింది. సిబ్బందిని ఇతర శాఖల్లోకి బదిలీ చేయగా.. అందులో సగం మంది వరకు ఉద్యోగ విమరణ అయినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో మళ్లీ ఆ శాఖను పునరుద్ధరించి ‘ఇందిరమ్మ ఇండ్ల’ నిర్మాణానికి అడుగులు వేసే ఆలోచనలో కాంగ్రెస్ సర్కారు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి మూడు, నాలుగు నమూనాలు సిద్ధం చేయాలని మంత్రి పొంగులేటి అధికారులను ఆదేశించడంతో మళ్లీ పేదల సొంతింటి ఆశలు చిగురిస్తున్నాయి.
అసంపూర్తిగా ‘డబుల్’ ఇండ్లు..
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చేపట్టిన డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లలో 4438 గృహాలు అసంపూర్తిగా ఉన్నట్టు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. అసలు టెండర్ తీసుకోవడానికి ముందుకురాని ఇండ్లు 16వేల వరకు ఉన్నాయి. మొత్తంగా ఉమ్మడి జిల్లాలో 23,944 డబుల్‌బెడ్‌రూమ్ ఇండ్లను మంజూరు చేసిన బీఆర్‌ఎస్ సర్కారు అందులో 3929 మాత్రమే పూర్తి చేసింది. అందులో కొన్నింటిని లబ్దిదారులకు పంపిణీ చేసింది.
4438 ఇండ్లు పునాదులు, స్లాబులు, గోడల నిర్మాణ దశలో నిలిచిపోయాయి. ఈ పథకం జాప్యానికి ప్రధానంగా కాంట్రాక్టర్లకు బిల్లులు సకాలంలో చెల్లించకపోవడమేనన్న విమర్శలున్నాయి. చాలాచోట్ల కాంట్రాక్టర్లు బిల్లులు రాక నిర్మాణం మధ్యలోనే వదిలిపెట్టారు. మరికొన్ని చోట్ల మార్కెట్‌లో పెరిగిన నిర్మాణ సామాగ్రి ధరల కారణంగా ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ ఏమాత్రమూ సరిపోకపోవడంతో అదనపు భారం మోయాల్సి వస్తుందని కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. దీంతో నిర్మాణం పూర్తయిన ఇండ్లు, పునాదులు, స్లాబుల స్థాయిలో నిరూపయోగంగా మారిన డబుల్‌బెడ్ రూమ్ ఇండ్లు దిష్టిబొమ్మల్లా తయారయ్యాయి.
‘గృహలక్ష్మి’ అటకెక్కినట్టే..
గత ప్రభుత్వం చివరలో ప్రవేశపెట్టిన ‘గృహలక్ష్మి’ పథకం అటకెక్కినట్టేనని చెప్పొచ్చు. సొంత స్థలం కలిగి ఇల్లు నిర్మించుకునే వారికి దశలవారీగా రూ.3లక్షలు చెల్లిస్తామని చెప్పింది. అది కూడా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే రెన్నెళ్ల ముందు ప్రారంభించిన ఈ పథకానికి ఉమ్మడి జిల్లాలో పేదలు లక్షా 8వేల మందికిపై దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో అర్హులుగా గుర్తించిన వారిలో 35825 మందికి ఈ పథకం మంజూరు చేయనున్నట్టు ఆయా జిల్లాల అధికార యాంత్రాంగం ప్రకటించింది. రాష్ట్రంలో మారిన ప్రభుత్వం గత సర్కారు పథకాన్ని కొనసాగించే అవకాశమేలేదు. దీంతో గృహలక్ష్మికి దరఖాస్తు చేసుకున్నవారు, అర్హులుగా ప్రకటించినవారి ఆశలు అడియాశలే అయ్యాయి.