నెతన్యాహు ‘తక్షణమే దిగిపోవాలి’

Netanyahu 'must step down immediately'– వేలాది నిరసనకారుల డిమాండ్‌
ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు రాజీనామా చేయాలని, గాజాలో ఇప్పటికీ హమాస్‌ చేతిలో ఉన్న బందీలను తిరిగి తీసుకురావాలని ఇజ్రాయెల్‌ రాజధాని టెల్‌ అవీవ్‌లో పదివేల మంది నిరసనకారులు డిమాండ్‌ చేశారు. ఇజ్రాయెల్‌ హమాస్‌పై యుద్ధం ప్రకటించినప్పటి నుండి దాదాపు ఆరు నెలల కాలంలో శనివారం సాయంత్రం టెల్‌ అవీవ్‌ డెమోక్రసీ స్క్వేర్‌లో సుమారు 100,000 మంది ప్రజలు నిరసన ప్రదర్శన చేశారని నిర్వాహకులు పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌ జెండాలను మోస్తూ, ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ, ప్రదర్శనకారులు ముందస్తు ఎన్నికలకు డిమాండ్‌ చేశారు. హమాస్‌ తో ఒప్పందం కుదుర్చుకుని 100 మందికి పైగా బంధీలుగావున్న ఇజ్రాయెలీలను విడిపించాలని కోరారు.నెతన్యాహు తన తీవ్రవాద సంకీర్ణ భాగస్వాములను సంతోషపెట్టడానికి ఉద్దేశపూర్వకంగా హమాస్‌తో ఒప్పందం చేసుకోకుండా తప్పించుకుంటున్నాడని గాజాలో బందీగా వున్న వ్యక్తి తండ్రి ఐనవ్‌ జంగౌకర్‌ నిరసన ప్రదర్శనకు ముందు జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టైమ్స్‌ ఆఫ్‌ ఇజ్రాయెల్‌ ప్రకారం, ”నెతన్యాహు ఈ ఒప్పందాన్ని ఉద్దేశపూర్వకంగా జరగకుండా చేస్తున్నాడు. అతను మాకు, గాజాలోని మా ప్రియమైనవారికి మధ్య అడ్డంకిగా ఉన్నాడు” అని జాన్‌గౌకర్‌ అన్నాడు. ”బందీలకు ఎన్నికలదాకా వేచి ఉండటానికి సమయం లేదు. ఒప్పందానికి ఉన్న అడ్డంకులను ఇప్పుడే తొలగించాలి. అలాగే నెతన్యాహు వెంటనే ప్రధాని పదవినుంచి వైదొలగాలి” అని ఆయన డిమాండ్‌ చేశారు.
టెల్‌ అవీవ్‌లో పెద్దఎత్తున నిరసన ప్రదర్శన జరగటంతో ఈజిప్టు, ఖతార్‌ల మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ చర్చల కోసం ఇజ్రాయెల్‌, హమాస్‌ ప్రతినిధులు ఆదివారం కైరోకు వెళ్లడానికి సిద్ధమయ్యారు. నవంబర్‌ చివరలో తాత్కాలిక కాల్పుల విరమణ కారణంగా ఇజ్రాయెల్‌ జైళ్లలో ఉన్న 240 మంది పాలస్తీనా ఖైదీల కోసం 105 మంది బందీలను హమాస్‌ విడుదల చేసింది. హమాస్‌ ప్రతిపాదించిన బందీల దశలవారీ విడుదలను అంగీకరించడానికి ఇజ్రాయెల్‌ నిరాకరించింది. మిలిటెంట్లు అంతకంటే తక్కువ దేనినీ అంగీకరించడానికి నిరాకరించారు. ఆ తరువాత వరుసగా చర్చలు విఫలమయ్యాయి. గాజా నుండి పూర్తిగా ఇజ్రాయెల్‌ ఉపసంహరించుకోవాలని హమాస్‌, అలాగే హమాస్‌పై ఇజ్రాయెల్‌ ”పూర్తిగా విజయం” సాధించే వరకు ఇజ్రాయెల్‌ పోరాడుతూనే ఉంటుందని, యుద్ధం ముగిసిన తర్వాత యూదు రాజ్యం గాజాపై ”పూర్తి భద్రతా నియంత్రణను” నిర్వహిస్తుందని నెతన్యాహు పట్టుబడుతున్నారు.
అనేక అవినీతి కుంభకోణాలు, వివాదాస్పద న్యాయ సంస్కరణల ప్యాకేజీపై రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ దాదాపు ప్రతి వారం పదివేల మంది ప్రజలు నిరసన ప్రదర్శనలు చేసిన నేపథ్యంలో అక్టోబరులో యుద్ధం ప్రారంభం కావడానికి ముందు ఇజ్రాయెల్‌ ప్రధాన మంత్రి ప్రజాదరణ కోల్పోయాడు. యుద్ధం కారణంగా ఈ సంవత్సరం ప్రారంభం వరకు నిరసన ప్రదర్శనలు ఆగిపోయాయి. అయితే గత నెల నుండి నిరసన ప్రదర్శనల స్థాయి పెరిగింది.