భూతలదాడులకు నెతన్యాహు సన్నాహాలు

Netanyahu prepares for demon attacks– ఇజ్రాయిల్‌కు నేడు బ్లింకెన్‌
– కైరోలో అరబ్‌ నేతలతో చర్చలు
టెల్‌ అవీవ్‌: ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు శనివారం గాజా సరిహద్దును సందర్శించి భూతల దాడులకు జరుగుతున్న సన్నాహాలను పరిశీలించా రు. గాజా దక్షిణ భాగాన్ని ఆక్రమించుకునేందుకు ఇజ్రాయెల్‌ సాగిస్తున్న వైమానిక దాడులు పదవ రోజుకు చేరుకున్నాయి. ఇజ్రాయిల్‌ దాడుల్లో శనివారం ఒక్క రోజే 320 మంది పాలస్తీనియన్లు మరణించారు. దీంతో ఈ వారం రోజుల్లో ఇజ్రాయిల్‌ దాష్టీకానికి బలైన పాలస్తీనియన్ల సంఖ్య 2,215కి చేరింది. కాగా హమాస్‌ ఇజ్రాయిల్‌పై జరిపిన ప్రతిఘటన దాడుల్లో 1300 మంది చనిపోయినట్లు ఇజ్రాయిల్‌ ఆర్మీ తెలిపింది. గాజాపౖౖె భూతల దాడులకు ఇజ్రాయిల్‌ను ఎగదోస్తున్న అమెరికా, ఇందుకు అడ్డుతగలొద్దని అరబ్‌ నేతలపై ఒత్తిడి తెస్తున్నది. అమెరికా విదేశాంగ మంత్రి అంటోని బ్లింకెన్‌ ఈ ఎజెండాతోనే అరబ్‌ దేశాల పర్యటనకు వచ్చారు. ఆదివారం ఈజిప్టు రాజధాని కైరోలో అరబ్‌ నేతలతో చర్చలు జరిపారు. సోమవారం ఇజ్రాయిల్‌ ప్రధాని నెతన్యాహుతో టెల్‌ అవీవ్‌లో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఇజ్రాయిల్‌ అనుసరించాల్సిన తదుపరి వ్యూహం గురించి నెతన్యాహుకు ఆయన డైరక్షన్‌ ఇవ్వనున్నారని సమాచారం. ఈజిప్టు అధ్యక్షుడు అబ్దుల్‌ ఫతా అల్‌ సిసితో కైరోను కలుసుకున్నారు. అంతకుముందు యునైటెడ్‌ ఎమిరేట్స్‌, బహ్రెయిన్‌, ఖతార్‌, జోర్డాన్‌ నేతలతో ఆయన చర్చలు జరిపారు. గాజాపై ఇజ్రాయిల్‌ భూతల దాడులకు మద్దతుగా నిలవాలని అరబ్‌ దేశాల నేతలపై ఒత్తిడి తెచ్చినట్లు తెలిసింది. గత వారం చైనా పై కూడా ఇదే విధమైన ఒత్తిడి తెచ్చేందుకు అమెరికా ప్రయత్నించింది. అయితే, చైనా అందుకు ససేమిరా అన్నది. స్వతంత్ర పాలస్తీనా ఏర్పాటుకు, శాంతియుత చర్చలకే తాము కట్టుబడి ఉన్నామని అమెరికాకు అది తేల్చి చెప్పింది. గాజాపై ఇజ్రాయిల్‌ దాడికి మద్దతుగా అమెరికా తన భారీ యుద్ధ నౌకలను ఇప్పటికే మధ్యధరా సముద్ర తూర్పు తీరానికి పంపింది. ఇటువంటి చర్యలు పరిస్థితిని మరింత దిగజార్చుతాయని అరబ్‌ నేతలు హెచ్చరించినట్లు తెలిసింది. అమెరికానే ఈ కథంతా నడిపిస్తోందని ఇరాన్‌, సిరియా, లెబనాన్‌ మండిపడుతున్నాయి. గాజాపై ఇజ్రాయిల్‌ దాడులు ఆపకపోతే అంతకు రెట్టించిన పరిహారాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుందని ఇరాన్‌ ఇప్పటికే హెచ్చరించింది.దాడులను ఆపి, చర్చల ద్వారా శాంతియుత పరిష్కారానికి కృషి చేయాలని ఇరాన్‌ కోరింది. పాలస్తీనీ యుల స్వతంత్ర దేశం ఏర్పాటు ఒక్కటే ఈ సమస్యకు పరిష్కారమని ప్రపంచ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఘర్షణలను మరింత రెచ్చగొట్టే చర్యలను ఆపాలని, అంతర్జాతీయ మానవ హక్కుల చట్టాలను గౌరవించాలని బ్లింకెన్‌కు సౌదీ అరేబియా రాజు తేల్చి చెప్పారు.
సామూహిక వలసలపై
బాంబు దాడి 70 మంది మృతి
ఆదివారం మధ్యాహ్నానికల్లా గాజాను ఖాళీ చేయాలని, లేని పక్షంలో తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఒక వైపు హుకుం జారీ చేస్తూ, మరో వైపు సామూహిక వలసలుపోతున్న గాజా వాసులపై ఇజ్రాయిల్‌ వైమానిక దాడులకు దిగింది.వాహనాల్లో దక్షిణ ప్రాంతానికి వెళ్తున్న వారిపై ఇజ్రాయిల్‌ జరిపిన బాంబు దాడిలో మహి ళలు, పిల్లలతో సహా 70 మంది చనిపోయి నట్లు ఎపి వార్తా సంస్థ తెలిపింది. దక్షిణ గాజాపై వైమానిక దాడులతో, ఇళ్లుఖాళీ చేసి ఈజిప్టుకు వలసపోతున్నవారు రఫా సరిహద్దులో విశ్రాంతి తీసుకుంటుంటే వారిపైనా దాడులు జరిగాయి.
గాజాకు సాయం అందజేసేందుకు ముందుకొచ్చిన చైనా
గాజాకు అత్యవసర సాయం అందజేస్తామని చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యీ తెలిపారు. అత్యవసర మానవతా సాయాన్ని ఐక్యరాజ్య సమితి ద్వారా గాజాకు అందిస్తామని వాంగ్‌ యీ తెలిపారు. పాలస్తీనా సమస్య శాంతి, న్యాయం, అంతర్జాతీయ చట్టం, మనస్సాక్షితో ముడిపడి ఉందని ఆయన అన్నారు. సమస్య పరిష్కారానికి ఐక్యరాజ్యసమితి ముందుకు రావాలని ఆయన కోరారు. రెస్క్యూ కమిటీ అత్యవసర సంప్రదింపులలో వాంగ్‌ యీ చురుకుగా పాల్గొంటున్నారు. ఇదిలావుండగా ఇజ్రాయిల్‌, హమాస్‌ మధ్య మధ్యవర్తిత్వం వహించేందుకు ప్రయత్నిస్తామని రష్యా ప్రకటించింది.పాలస్తీనియన్లను ఇజ్రాయిల్‌ ఊచకోత కోసే ప్రమాదం ఉందని ఐక్యరాజ్యసమితి ప్రత్యేక ప్రతినిధి ఫ్రాన్సిస్కా అల్బనీస్‌ శనివారం ఆందోళన వ్యక్తం చేశారు.
హమాస్‌ను తుడిచిపెట్టేస్తా
గాజాను నుంచి హమాస్‌ను పూర్తిగా తుడిచిపెట్టేస్తానని యూదు దురహంకారి, బెంజిమిన్‌ నెతన్యాహు హూంకరించారు. ఆదివారం టెల్‌ అవీవ్‌లో మంత్రివర్గ అత్యవసర సమావేశాన్ని ఆయన నిర్వహించా రు. గాజాలో హమాస్‌ను తుడిచిపెట్టేస్తామని ఆయన అన్నారు. భద్రత విషయంలో దేశమంతా ఒక్కటిగా ఉందనే సందేశాన్ని దేశీయంగా, వెలుపలా చాటాల్సిన అవసరం ఉందని ఇజ్రాయిలీయులను కోరారు. గాజా వాసులు తమ నివాసాలను ఖాళీ చేసి వెళ్లిపోవడానికి అదనంగా ఇచ్చిన మూడు గంటల గడువు ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటతో ముగిసింది.