– ఐసీజే ను కోరిన దక్షిణాఫ్రికా
జొహానెస్‌బర్గ్: గాజాలో పాలస్తీనీయులను ఊచకోత కోస్తున్న ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహును యుద్ధ నేరస్తుడిగా ప్రకటించాలని అంతర్జాతీయ నేర విచారణ న్యాయస్థానం (ఐసీజే)ను దక్షిణాఫ్రికా కోరింది. యూదు దురహంకార సైన్యం గాజాపై దురాక్రమణ పూరిత దాడులు 84వ రోజు (డిసెంబరు29)కు చేరిన వేళ దక్షిణాఫ్రికాలోని రమాఫొసా ప్రభుత్వం అంతర్జాతీయ నేర విచారణ కోర్టులో ఈ మేరకు ఒక పిటిషన్ దాఖలు చేసింది. నెతన్యాహును ప్రాసిక్యూట్ చేయడంతో బాటు, గాజాపై ఇజ్రాయిల్ దాడులను తక్షణమే నిలుపు చేసేలా ఆదేశించాలనికోరింది. ఇజ్రాయిల్ హంతక దాడులు ఊచకోత స్వభావాన్ని కలిగి ఉన్నాయని , పాలస్తీనాలో చాలా ప్రాంతాన్ని నాశనం చేశాయని, ఇజాయ్రిల్ దళాలు జాతి నిర్మూలనే లక్ష్యంగా గాజాలో రక్తపుటేరులు పారిస్తున్నాయని, దీని వల్ల అక్కడి పాలస్తీనీయులు భౌతికంగా, మానసికంగా అనుభవిస్తున్న క్షోభ వర్ణనాతీతమని ఆ పిటిషన్‌లో దక్షిణాఫ్రికా పేర్కొంది. అంతేకాదు, పాలస్తీనీయులను తమ ఇండ్ల నుంచి బలవంతంగా గెంటివేయడం, సామూహికంగా నివాస ప్రాంతాలపై దాడులు, ఇండ్లను నేలమట్టం చేయడం వంటి దాష్టీకాలు నిత్యకృత్యంగా మారిపోయాయి. ఆహారం, మందులు, గూడు, పరిశుభ్రత, పారిశుధ్యం ఇలా అనేక సమస్యల మధ్య అక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పిటిషన్‌లో తెలిపింది. పాలస్తీనా ప్రజల జీవితానలు నాశనం చేసే హక్కు ఇజ్రాయిల్‌కు ఎవరిచ్చారని ప్రశ్నించింది. పాలస్తీనీయులు గాజా గడ్డపై జన్మించకుండా చేసేందుకు ఆసుపత్రులపైనా దాడులకు తెగబడిందని విమర్శించింది. అక్టోబరు 7 నుంచి ఇప్పటివరకు 22 వేల మంది దాకా పాలస్తీనీయులు చనిపోయారు. మరో 7,780 మంది జాడ తెలియడం లేదు. బహుశా వీరంతా భవన శిథిలాల కింద సమాధి అయిపోయి వుండొచ్చని భావిస్తున్నారు. ఈ ఫాసిస్టు దాడుల వల్ల 19 లక్షల మంది అంటే గాజా జనాభాలో 85 శాతం మంది బాంబు దాడుల్లో ఇండ్లు కోల్పోయి వీధిన పడ్డారు. గాజాలో పాలస్తీనా కుటుంబాల్లో మరణాల రేటు పెరిగిపోయిందని డబ్ల్యుసిఎన్‌ఎస్‌ఎఫ్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ హంతక దాడుల్లో కొన్ని కుటుంబాల్లో గాయపడిన ఒక బాబు లేదా పాప మాత్రమే మిగిలి మిగతా వారంత చనిపోయిన పరిస్థితి ఉంది. మృతుల్లో పిల్లలు, మహిళలు ఎక్కువగా ఉంటున్నారు. ఏ ప్రాంతమూ సురక్షితం కాదు. అని ఆ పిటిషన్‌లో పేర్కొంది. హేగ్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు రాజకీయాలకు, పక్ష పాతానికి అతీతమైనదేమీ కాదని పలు సందర్భాల్లో రుజువైంది. ఉక్రెయిన్, రష్యా యుద్ధంలో పశ్చిమ దేశాల ప్రభావంతో పుతిన్‌ను యుద్ధ నేరస్తుడిగా ఏకపక్షంగా ప్రకటించిన ఐసిజె, గాజాలో ఇన్ని రోజులుగా, ఇంత భయానకంగా పాలస్తీనీయులను ఊచకోత కోస్తున్న నెతన్యాహు విషయంలో గమ్మున ఉండడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. దక్షిణాఫ్రికా ప్రభుత్వ అభ్యర్థనపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.
ఎర్ర సముద్రంలో మరో నౌకపై దాడి
ఎర్ర సముద్రంలో మరోక వాణిజ్య నౌకపై దాడి జరిగింది. సింగపూర్ నుంచి ఈజిప్టులోని పోర్ట్ సూయెజ్‌కు బయలుదేరిన హాంగ్‌జౌ అనే వాణిజ్య నౌక ఆదివారం ఉదయం 6:30 గంటలకు బాబ్ అల్-మాండెబ్ జలసంధి దాటి దక్షిణ ఎర్ర సముద్రంలోకి ప్రవేశించిన సమయంలో ఈ దాడి జరిగింది. దాడికి గురువుతున్న సమయంలో యెమెన్‌లోని హోడైదాకు నైరుతి దిశలో ఈ వాణిజ్య నౌక ఉందని అమెరికా సెంట్రల్ కమాండ్ సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించింది. ఈ దాడిలో నౌక పెద్దగా నష్టానికి గురికాలేదని తెలిపింది. అయితే నౌకపై దాడి చేయడానికి ప్రయత్నించి హౌతీ ఫైటర్స్‌కు చెందిన నాలుగు చిన్న పడవల్లో మూడు పడవలను సముద్రంలో ముంచివేశామని అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది.