నేతి బీరకాయ చందమే..

– నిటి ఆయోగ్‌ లెక్కల్లో డొల్లతనం
– పలు రాష్ట్రాలలో తగ్గిన లింగ నిష్పత్తి
న్యూఢిల్లీ : బేటీ బచావ్‌…బేటీ పడావ్‌ అంటూ మోడీ ప్రభుత్వం ఎంతగా ప్రచారం చేస్తున్నప్పటికీ వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగానే ఉంది. అనేక రాష్ట్రాలలో బాలికల సంఖ్య బాలుర సంఖ్యతో పోలిస్తే తక్కువగా ఉంటోంది. కేంద్ర స్త్రీ, శిశు అభివృద్ధి (డబ్ల్యూసీడీ) మంత్రిత్వ శాఖ అందించిన సమాచారం ప్రకారమే కర్నాటక, ఢిల్లీ, పంజాబ్‌, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌, బీహార్‌, హర్యానా సహా 12కు పైగా రాష్ట్రాలలో 2021-22, 2022-23 మధ్య లింగ నిష్పత్తి తగ్గిపోయింది. అయితే దీనికి భిన్నంగా బేటీ బచావ్‌…బేటీ పడావ్‌ పథకం విజయవంతమైందని నిటి ఆయోగ్‌ నివేదిక చెబుతోంది. వాస్తవానికి దేశంలో ఒక్క లఢక్‌లో మాత్రమే బాలుర కంటే బాలికల సంఖ్య అధికంగా ఉంది. అక్కడ లింగ నిష్పత్తి 1,023గా నమోదైంది.
రాజస్థాన్‌, తెలంగాణ, అసోం, కేరళ, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలలో లింగ నిష్పత్తి మెరుగ్గా ఉందని నిటి ఆయోగ్‌ నివేదిక తెలిపింది. కర్నాటకలో 2020-21లో లింగ నిష్పత్తి 949 ఉండగా (వెయ్యి మంది బాలురకు 949 మంది బాలికలు) అది 2021-22లో 940కి పడిపోయింది. 2022- 23లో కొంత మెరుగుపడి 945కి చేరింది. రాజధాని ఢిల్లీలో 2020-21లో 927గా ఉన్న లింగ నిష్పత్తి 2021-22లో 924కు, 2022-23లో 916కు పడిపోయింది. పశ్చిమ బెంగాల్‌లో లింగ నిష్పత్తి 2020-21లో 949గా, 2021-22లో 943గా, 2022-23లో 932గా నమోదైంది. బీహార్‌లోనూ ఇదే పరిస్థితి. ఆయా సంవత్సరాలలో లింగ నిష్పత్తి 917, 915, 895గా నమోదైంది. ఇక చండీఘర్‌లో పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. 2020-21లో 935గా నమోదైన లింగ నిష్పత్తి ఆ తర్వాతి సంవత్సరంలో కొంత పెరిగి 941కి చేరింది. అయితే 2022-23లో 902కు పడిపోయింది.
హిమాచల్‌ ప్రదేశ్‌లో లింగ నిష్పత్తి 2020- 21లో 944 నుండి 2021-22లో 941కి, 2022- 23లో 932కు తగ్గింది. ఉత్తరప్రదేశ్‌, అసోం, కేరళ వంటి రాష్ట్రాలలో లింగ నిష్పత్తి కొంత మెరుగు పడింది. ఉత్తరప్రదేశ్‌లో ఆయా సంవత్సరాలలో లింగ నిష్పత్తి 940, 939, 944గా నమోదైంది. అంటే 2022-23లో కొంత మెరుగుపడిందన్న మాట. అసోంలో కూడా 2020-21లో 942 నుంచి 2021-22లో 944కు పెరిగింది. 2022-23లో మరింత పెరిగి 951కి చేరింది. రాజస్థాన్‌లో మూడు సంవత్సరాలలోనూ లింగ నిష్పత్తి 946గానే నమోదైంది.
నిధులు వాడని రాష్ట్రాలు
బేటీ బచావ్‌..బేటీ పడావ్‌ పథకం కింద కేటాయించిన నిధులను పలు రాష్ట్రాలు విని యోగించుకోలేదు. ఉదాహరణకు 2020-21లో హర్యానాకు రూ.249.83 లక్షలు కేటాయించగా రూ.142.26 లక్షలు మాత్రమే ఖర్చు చేసింది. 2021-22లో ఆ రాష్ట్రానికి వచ్చిన రూ.162.8 లక్షల్లో కేవలం రూ.27.09 లక్షలు మాత్రమే ఖర్చయ్యాయి. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రానికి 2020-21లో విడుదల చేసిన మొత్తం (రూ.577.95 లక్షలు) కంటే ఖర్చు చేసిందే (రూ.742.60 లక్షలు) ఎక్కువ. అయితే 2021-22లో కేటాయించిన రూ.1,499.45 లక్షల్లో కేవలం రూ.162.89 లక్షలు మాత్రమే ఖర్చయ్యాయి. ఈ సమాచారాన్ని విశ్లేషిస్తే పథకం కింద కేటాయించిన వనరులను సమర్ధవంతంగా వినియోగించడంపై పలు ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.