కొత్తబాల్యం!

కొత్తబాల్యం!తమ మట్టి యుద్ధంలో పరాయిదయ్యేక
వాళ్ళు తేనెటీగల్లా చెదిరిపోయి పాల బుగ్గలపై కన్నీటి లేఖలు రాాస్తూ
కాందిశీకుల్లా రోజులు వెళ్ళమారుస్తున్నారు
బాలిస్టిక్‌ మిస్సైల్స్‌ పడ్డట్టు బాల్యం తునాతునకలయ్యేక
కాలానికి ఎదురీదే చిట్టి చేతులు
ఎక్కడ మొలిస్తే అక్కడ కొత్త బాల్యం కోట కట్టుకొంటున్నాయి
రోజూ తొలిపొద్దులా పూసే ఆ పసినవ్వుల్ని మాత్రం
ఏ మరణాయుధం ఓడించలేకపోతుంది
జాత్యహంకారం ముందు, కత్తివాటుకు ఎదురు మొలిచిన పచ్చదనంలా
కల్మషం లేని బాల్యం చెదరని చిరునవ్వుతో
అధినేతల గుండెల్లో మర ఫిరంగులు పేలుస్తుంది
యుద్ధంలో దేనికీ కర్తలు కాని, ఏ క్రియ లేని
‘ఖర్మ’ మాత్రమే వాళ్ళు అనుభవిస్తున్నారు!
ఎదురు దెబ్బలెన్ని తిన్నా ఎప్పటికప్పుడు
కొత్త బాల్యానికి నవ్వులు పోసుకొంటూ
బతికించుకుంటోన్న ఆ పసి మనసులకు
ఆకలంటేనే తప్ప అణుబాంబన్నా భయం లేదు!
(ప్రపంచ బాలల దినోత్సవం)
– భీమవరపు పురుషోత్తమ్‌, 9949800253