ఈఆర్సీ నూతన చైర్మెన్‌ బాధ్యతల స్వీకరణ

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (టీజీఈఆర్సీ) నూతన చైర్మెన్‌గా నియమితులైన జస్టిస్‌ దేవరాజు నాగార్జున్‌ బుధవారం బాధ్యతలు స్వీక రించారు. వెంగళరావునగర్‌లోని విద్యుత్‌ నియంత్రణ్‌ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. తెలంగాణ రాష్ట్ర ఉత్తర, దక్షిణ ప్రాంతాల విద్యుత్‌ పంపిణీ సంస్థల సీఎమ్‌డీలు వరుణ్‌రెడ్డి, ముషారఫ్‌ ఫారూఖీ, ట్రాన్స్‌కో జేఎమ్‌డీ శ్రీనివాసరావు, జెన్‌కో డైరెక్టర్లు, పలు ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన్ని అభినందించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా వనపర్తికి చెందిన జస్టిస్‌ దేవరాజు నాగార్జున్‌ మద్రాస్‌ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసి, అక్కడే రిటైర్డ్‌ అయ్యారు. అంతకుముందు ఆయన గుల్బర్గాలోని ఎస్‌ఎస్‌ఎల్‌ కళాశాలలో న్యాయశాస్త్ర విద్యను అభ్యసించారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్‌ఎల్‌ఎం చేశారు. 1986లో న్యాయవాదిగా బార్‌ కౌన్సిల్‌లో పేరు నమోదు చేసుకున్నారు. 1991 మే 1వ తేదీ జూనియర్‌ సివిల్‌ జడ్జిగా ఎంపికయ్యారు. 2022 అక్టోబర్‌ 18న హైకోర్టు జడ్జిగా పదోన్నతి పొందారు. అనంతరం 2023 ఏప్రిల్‌ 6 మద్రాస్‌ హైకోర్టుకు బదిలీ అయ్యి, అక్కడే పదవీ విరమణ చేశారు.