– తొలిసారి పార్లమెంటుకు వెళ్లేదెవరో?
– అభ్యర్థులు కాదు.. పార్టీలకే ప్రాధాన్యత
– రసవత్తరంగా ప్రచారం
నవతెలంగాణ- మిర్యాలగూడ
వచ్చే నెలలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో నల్లగొండ, భువనగిరి స్థానాల్లో తొలిసారి పార్లమెంట్‌లో అడుగు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు.. భువనగిరిలో బీజేపీ అభ్యర్థికి మాత్రమే గతంలో బీఆర్‌ఎస్ తరపున పోటీ చేసి గెలిచిన అనుభవం ఉంది. అయితే, ఎన్నికల్లో అభ్యర్థులను ప్రామాణికంగా తీసుకోకుండా పార్టీలే ప్రాధాన్యతగా ఓటర్లు ఓటు వేసే అవకాశం ఎక్కువగా ఉంది. అన్ని పార్టీలు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించగా.. ప్రచారం రసవత్తరంగా సాగుతోంది. గురువారం నుంచి ఈనెల 25 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు.
తండ్రి చాటున తనయుడు రఘువీర్ రెడ్డి
ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి తనయుడు కుందూరు రఘువీర్ రెడ్డి నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున తొలిసారి పోటీ చేస్తున్నారు. 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మిర్యాలగూడ నుంచి అసెంబ్లీ టికెట్ ఆశించారు. 2023లో దాదాపు అసెంబ్లీ టికెట్ ఖరారు చేసుకున్నప్పటికీ పలు సర్వేల నివేదిక ఆధారంగా అధిష్టానం సూచన మేరకు వెనక్కి తగ్గారు. ఆ సమయంలో అధిష్టానం హామీతోనే ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఇద్దరు మంత్రులతో పాటు నలుగురు ఎమ్మెల్యేలు ఉండటం.. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ బలంగా ఉండటం.. తండ్రికి ఉన్న అనుచరుల బలంతోపాటు రఘువీర్ రెడ్డి కొంత కాలంగా చేపడుతున్న పలు సేవా కార్యక్రమాల ప్రభావంతో గెలుపు ఖాయమనే ధీమాలో ఉన్నారు.
సోదరుడి ప్రోద్బలంతో బరిలో కంచర్ల కృష్ణారెడ్డి
నల్లగొండ పార్లమెంటు స్థానానికి బీఆర్‌ఎస్ తరఫున కంచర్ల కృష్ణారెడ్డి తొలిసారిగా లోక్‌సభకు పోటీ చేస్తున్నారు. కృష్ణారెడ్డి మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సోదరుడు. న్యాయవాద వృత్తిలో నుంచి రాజకీయాల్లోకి వచ్చి తొలిసారి లోక్‌సభ బరిలో నిలబడ్డారు. పార్లమెంట్ నియోజకవర్గంలో ఇప్పటికే కేసీఆర్, కేటీఆర్ పర్యటనలు చేయగా, జిల్లాకు చెందిన మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి విస్తృత ప్రచారం చేస్తున్నారు. గతంలో పార్టీ క్యాడర్ బలంగా ఉండటం.. ప్రస్తుతం కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత వస్తుందని.. ఇదే తన విజయానికి దోహదం చేస్తుందని భావిస్తున్నారు.
మాజీ ఎమ్మెల్యేగా అనుభవంతో పార్లమెంటుకు..
బీజేపీ తరఫున నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గంలో పోటీ చేస్తున్న శానంపూడి సైదిరెడ్డి రాజకీయాలకు కొత్త కాకపోయినప్పటికీ లోక్‌సభ ఎన్నికల్లో తొలిసారిగా పోటీ చేస్తున్నారు. గతంలో బీఆర్‌ఎస్ తరఫున హుజూర్‌నగర్ ఎమ్మెల్యేగా పనిచేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి ఇటీవల బీజేపీలో చేరారు. వెంటనే ఆ పార్టీ తరఫున టికెట్ పొంది తలబడుతున్నారు. దేశంలో మోడీ చరిష్మా పని చేస్తుందని, తనకు విజయావకాశాలు ఉన్నాయన్న ధీమాలో ఉన్నారు. అయితే, ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ప్రభుత్వ భూములు కబ్జా చేశారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి.
పోరాటాల గడ్డపై కమ్యూనిస్టుల నజర్
పోరాటాల గడ్డగా పేరొందిన భువనగిరి పార్లమెంటు నియోజ కవర్గంపై కమ్యూనిస్టుల ప్రాబల్యం ఎక్కువే. నిత్యం పేద ప్రజల కోసం పోరాటాలు సాగిస్తున్న కమ్యూనిస్టు పార్టీలు ఈసారి గెలిచి పార్లమెంటులో అడుగు పెట్టాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగా ప్రజల మధ్య ఉంటూ పని చేస్తున్న పేదల నాయకుడు ఎండీ.జహంగీర్ సీపీఐ(ఎం) అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఆయన తొలిసారిగా పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఆయన చేసిన పోరాటాలను ప్రజలకు వివరిస్తూ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలోని నల్లగొండ, భువనగిరి, వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లోని జనగామ, ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండటం.. ఆయా ప్రాంతాల్లో పార్టీ ప్రజా ఉద్యమాలు బలంగా చేయడంతో తమకు కలిసొస్తుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ప్రధానంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలు, ఇతర పార్టీలపై ఉన్న అసంతృప్తి, తాము చేస్తున్న ప్రజా ఉద్యమాలతో ప్రజలు పట్టం కడతారని ధీమాలో ఉన్నారు.
కాంగ్రెస్‌లో పదవుల అనుభవం..
కాంగ్రెస్ పార్టీలో పలు ఉన్నత పదవులు చామల కిరణ్ కుమార్ రెడ్డి అనుభవించారు. కానీ చట్టసభలకు ఇప్పటివరకు పోటీ చేయలేదు. మొదటిసారిగా భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో అత్యధికంగా తమ పార్టీ ఎమ్మెల్యేలు ఉండటం, రాష్ట్రంలో పార్టీ అధికారం ఉండటంతో పాటు ప్రస్తుతం పార్టీ క్యాడర్ బలంగా ఉండటం కలిసొస్తుందంటున్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇన్‌చార్జిగా విస్తృత పర్యటన చేస్తుండటంతో తన గెలుపు ఖాయమని చెబుతున్నారు.
బీసీ నినాదంతో పోటీ
భువనగిరిలో బీఆర్ ఎస్ తరఫున పోటీ చేస్తున్న క్యామ మల్లేష్ తొలిసారిగా పార్లమెంట్ బరిలో నిలిచారు. గతంలో కాంగ్రెస్ తరపున ఇబ్రహీంపట్నం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ దక్కకపోవడంతో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఇప్పుడు బీఆర్‌ఎస్ తరఫున భువనగిరి పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తున్నారు. ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో బీసీలు అత్యధికంగా ఉండటంతో తనకు కలిసి వస్తుందన్న భావనలో ఉన్నారు. లోక్‌సభ పరిధిలోని అతిపెద్ద అసెంబ్లీ నియోజకవర్గమైన ఇబ్రహీంపట్నంలో తనకున్న పరిచయాలు, గతంలో బీఆర్‌ఎస్ బలంగా ఉండటం, ప్రస్తుతం కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత తనకు కలిసి వస్తుందని ధీమాలో ఉన్నారు. అదేవిధంగా బీజేపీ తరపున బూర నర్సయ్యగౌడ్ పోటీలో ఉన్నారు. ఆయన గతంలో బీఆర్‌ఎస్ తరపున పోటీ చేసి గెలిచారు. ఈసారి బీజేపీ తరపున పోటీ చేస్తున్నారు.