– సర్వే పేరుతో కాలేజ్ స్టాఫ్‌తో ఓటర్ల వివరాల సేకరణ
– అడ్డుకున్న స్థానికులు
నవతెలంగాణ-బోడుప్పల్
ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు నాయకులు నయా పంథా ఎంచు కున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల సర్వే పేరుతో ఓ కాలేజ్ సిబ్బందిని ఇంటింటికీ తిప్పి ఓటర్ల వివరాలు సేకరించి అదే అదునుగా ఫోన్ నెంబర్లు తీసుకున్నారు. దాంతో నేరుగా ఓటర్లకు డబ్బులు పంచే కార్యక్రమానికి తెరదీసినట్టు సమాచారం.
శనివారం హైదరాబాద్ బోడుప్పల్ కార్పొరేషన్ 8వ డివిజన్ పరిధిలోని ద్వారకానగర్‌లో ఓ కళాశాలకు సంబంధించిన ఐడీ కార్డులను మెడలో వేసుకుని కొందరు ఎన్నికల సర్వే పేరిట ఇంటింటికీ తిరిగి ఓటర్ల వివరాలు సేకరించారు. వారిని కాలనీవాసులు అడ్డుకుని ”మీరెవరు మా వివరాలు తెలుసుకోవడానికి” అంటూ ఎదురు తిరగడంతో సమాధానం చెప్పలేకపోయారు. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఏంతో సిబ్బంది ప్రలోభాలకు పాల్పడుతున్నట్టు సమాచారం.
మంత్రి మల్లారెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలి..
ఎన్నికల్లో ప్రలోభాలకు గురిచెయ్యొద్దన్న ఎన్నికల సంఘం నిబంధనలను ఉల్లంఘించిన మంత్రి మల్లారెడ్డిని పోటీకి అనర్హుడిగా ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ జిల్లా చైర్మెన్ వంగేటి ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. మల్లారెడ్డి కాలేజ్ సిబ్బంది, విద్యార్థులతో ఎన్నికల ప్రచారం చేయించడమే కాకుండా ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.