సరికొత్త ఆలోచనలు, ప్రణాళికలు

– డిజిటల్‌ హెల్త్‌ దిశగా అడుగులు
– వైద్యారోగ్య శాఖకు పట్టం
– ఆరోగ్యంపై స్పెషల్‌ ఫోకస్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 48 గంటల్లో రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పరిమితిని రెండింతలు పెంచింది. సరికొత్త ఆలోచనలు, ప్రణాళికలతో డిజిటల్‌ హెల్త్‌ దిశగా అడుగులు వేస్తున్నారు. ఆరోగ్యంపై స్పెషల్‌ ఫోకస్‌ పెడుతూ వైద్యారోగ్యశాఖకు పట్టం కడుతున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రాజీవ్‌ ఆరోగ్యశ్రీపై 2013 నుంచి 2023 వరకు నెలకు సగటున రూ.52 కోట్లు ఖర్చు చేస్తే, 2023 డిసెంబర్‌ నుంచి ప్రతి నెలా సగటున రూ.76 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం వ్యయం చేస్తున్నది. దాని పరిధిలో 1,375 వైద్య చికిత్సల ధరలను సుమారు 20 శాతం వరకూ పెంచింది. కొత్తగా 163 రకాల చికిత్సలను దీని పరిధిలోకి తీసుకొచ్చింది. దీంతో మొత్తం ఆరోగ్యశ్రీ చికిత్సల సంఖ్య 1835కి పెరిగింది. న్యూక్లియర్‌ మెడిసిన్‌, ఇంటర్‌వెన్షనల్‌ రేడియాలజి వంటివి ఇందులో ఉన్నాయి. పెరిగిన ధరలు, కొత్తగా అందుబాటులోకి వచ్చిన చికిత్సల కోసం అదనంగా రూ.487.29 కోట్లను ఆరోగ్యశ్రీ కోసం కేటాయించింది.
వైద్యారోగ్యశాఖలో 7,750 పోస్టులను భర్తీ చేసి, మరో 6,494 పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతుంది. మరో 607 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు, 1,690 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ (స్పెషలిస్ట్‌) పోస్టులు, 308 ఫార్మసిస్ట్‌ (ఆయుష్‌) పోస్టుల భర్తీకి త్వరలోనే ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ నోటిఫికేషన్లు ఇవ్వనున్నది. జూనియర్‌ డాక్టర్లకు సంబంధించిన స్టైఫండ్‌ చెల్లింపులు, పెండింగ్‌లో ఉన్న సమస్యలన్నింటికీ పరిష్కరించింది. ఎనిమిది నెలల్లో 8 మెడికల్‌ కాలేజీలను అనుమతి, ఒక్కో కాలేజీలో 50 సీట్ల చొప్పున మొత్తం 400 ఎంబీబీఎస్‌ సీట్లు విద్యార్థులకు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ఎంబీబీఎస్‌ సీట్ల సంఖ్య 3,690 నుంచి 4,090కి పెరిగింది. వికారాబాద్‌ జిల్లాలోని కొడంగల్‌లో 50 ఎంబీబీఎస్‌ సీట్లతో మెడికల్‌ కాలేజీ, 50 సీట్ల కెపాసిటీతో ఫిజియోథెరపీ కాలేజీ, 30 సీట్ల కెపాసిటీతో పారామెడికల్‌ కాలేజీల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. 2025-26లో ఈ కాలేజీల్లో విద్యార్థులకు అడ్మిషన్లు ఇచ్చేందుకు, ఆరోగ్యశాఖ అధికారులు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు.కొడంగల్‌లో 50 బెడ్ల హాస్పిటల్‌ను, 220 బెడ్ల హాస్పిటల్‌గా అప్‌గ్రేడ్‌ చేసింది. మంచిర్యాలలో 600 బెడ్ల సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌, ఉస్మానియా, గాంధీ, కాకతీయ మెడికల్‌ కాలేజీ విద్యార్థుల కోసం కొత్త హాస్టల్‌ భవనాలను ప్రభుత్వం మంజూరు చేసింది. హాస్టల్‌ భవనాల నిర్మాణం కోసం రూ.204.85 కోట్లను ప్రజా ప్రభుత్వం కేటాయించింది. ఏడాది కాలంలోనే 16 నర్సింగ్‌ కాలేజీలను, 28 పారామెడికల్‌ కాలేజీలను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఒక్కో నర్సింగ్‌ కాలేజీలో 60 బీఎస్సీ సీట్ల చొప్పున మొత్తం 960 సీట్లు ఈ అకడమిక్‌ ఇయర్‌ నుంచే విద్యార్థులకు అందుబాటులోకి వచ్చాయి. ఒక్కో పారామెడికల్‌ కాలేజీలో 60 సీట్ల చొప్పున, 28 కాలేజీల్లో ఏడాదికి 1,680 మంది విద్యార్థులు పారామెడికల్‌ కోర్సులను అభ్యసించబోతున్నారు. రూ.2 వేల కోట్లతో ఉస్మానియా నూతన ఆసుపత్రికి గోషామహల్‌లో సుమారు 32 ఎకరాల విస్తీర్ణంలో కొత్త ఉస్మానియా దవాఖాన నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నూతన ఆసుపత్రి కోసం పోలీస్‌ శాఖ నుంచి ఆరోగ్యశాఖకు భూబదలాయింపు ప్రక్రియ పూర్తయింది. అత్యాధునిక వసతులు, ఆపరేషన్‌ థియేటర్లతో పాటు కొత్త ఆసుపత్రిలో 28 వైద్య విభాగాల సేవలు అందనున్నాయి.
రాష్ట్రంలో కొత్తగా 16 డయాలసిస్‌ సెంటర్లను మంజూరు చేసింది. ఇప్పటికే అందుబాటులో ఉన్న 20 డయాలసిస్‌ సెంటర్లలో అదనంగా 89 డయాలసిస్‌ మిషన్లను పేషెంట్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. డయాలసిస్‌ పేషెంట్లకు అవసరమైన సర్జరీలు చేయడానికి, సుమారు రూ.33 కోట్లతో వాస్క్యులర్‌ సెంటర్లను ప్రభుత్వం మంజూరు చేసింది. హైదరాబాద్‌లోని నిమ్స్‌, గాంధీ, ఉస్మానియా, వరంగల్‌లోని ఎంజీఎం, ఖమ్మం గవర్నమెంట్‌ జనరల్‌ హాస్పిటల్‌, మహబూబ్‌నగర్‌ గవర్నమెంట్‌ జనరల్‌ హాస్పిటల్‌, ఆదిలాబాద్‌ రిమ్స్‌ హాస్పిటల్‌లో వాస్క్యులర్‌ సెంటర్ల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైంది. రూ.లక్షల ఖరీదైన ఐవీఎఫ్‌ సేవలను ఉచితంగా అందజేయాలని నిర్ణయించింది. గాంధీ హాస్పిటల్‌లో ఐవీఎఫ్‌ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. పేట్లబుర్జు దవాఖాన, సుల్తాన్‌బజార్‌ మెటర్నిటీ హాస్పిటల్‌, వరంగల్‌ ఎంజీఎంలోనూ ఐవీఎఫ్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రోడ్డు ప్రమాదాల్లో, ఇతర ఎమర్జన్సీ సమయంలో బాధితుల ప్రాణాలు కాపాడుకునేలా రాష్ట్ర, జాతీయ రహదారులపై ప్రతి 30 కిలోమీటర్లకు ఒకటి చొప్పున 74 ట్రామా కేర్‌ సెంటర్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సుమారు రూ.వెయ్యి కోట్లతో రెండు సంవత్సరాల్లో ట్రామా కేర్‌ సెంటర్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. అన్ని ప్రభుత్వ టీచింగ్‌ హాస్పిటళ్లలో ఆర్గాన్‌ రిట్రైవల్‌ సెంటర్లను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దశలవారీగా అన్ని టీచింగ్‌ హాస్పిటళ్లలో ఆర్గాన్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ సేవలను విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. రూ.30 కోట్లతో 222 నూతన అంబులెన్సులను ప్రభుత్వం అందించనుంది. 136 నూతన 108 అంబులెన్సుల్లో గిరిజన ప్రాంతాలకు 45కు కేటాయించనున్నారు. మిగిలినవి సేవలు అందని మండలాలు, జాతీయ, రాష్ట్ర రహదారుల ప్రాంతాలకు కేటాయించినట్టు ఉన్నతాధికారులు తెలిపారు.