సాంకేతిక‌త‌తో కొత్త ఆవిష్క‌ర‌ణ‌లు

New innovations with technologyమనం నిత్యం సమస్యల మధ్యలోనే బతుకుతుంటాం. అప్పటికప్పుడు వాటిని ఏదోలా దాటేస్తాం. కానీ శాశ్వత పరిష్కారానికి మాత్రం పెద్దగా ఆలోచించం. ఒక్కసారి మనసు పెట్టి గమనిస్తే… కచ్చితంగా శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం సాయంతో ఎన్నో సామాజిక ఆవిష్కరణలు చేపట్టొచ్చు. ఇదే నమ్మకంతో ముందడుగు వేస్తున్నారు డాక్టర్‌ ముద్రికా ఖండేల్‌వాల్‌. తన జ్ఞానాన్ని రైతుల కోసం ఉపయోగించాలని కూరగాయలు ఎక్కువకాలం నిల్వ ఉంచే సాంకేతికతో మొదలుపెట్టి… మహిళల వ్యక్తిగత ఆరోగ్యానికి ప్యాంటీ లైనర్‌, యాంటీ ఫంగల్‌ హైజీన్‌ ఉత్పత్తులు వంటివెన్నో రూపొందించిన ఆమె పరిచయం నేటి మానవిలో…
కేంబ్రిడ్జి యూనివర్సిటీలో చదువుకున్నారు. కోరుకుంటే అక్కడే ఉద్యోగం చేసి కోట్లు సంపాదించే అవకాశం ఉంది. కానీ ఆమె మాత్రం తన జ్ఞానాన్ని దేశం కోసం ఉపయోగపడాలనుకున్నారు. ఆ ఉద్దేశంతోనే బోధనా వృత్తిలోకి అడుగుపెట్టి… సామాజిక పరిశోధనలు చేస్తున్నారు. ఆ దిశగా ముందడుగు వేసి అద్భుత ఆవిష్కరణలెన్నో చేశారు. ఆ ప్రయత్నమే… ఐఐటీ హైదరాబాద్‌లో అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పనిచేస్తోన్న డాక్టర్‌ ముద్రికా ఖండేల్‌వాల్‌కు ‘ఇండియన్‌ నేషనల్‌ అకాడెమీ ఆఫ్‌ ఇంజినీరింగ్‌’ సంస్థ ఇచ్చే ‘యంగ్‌ ఇంజినీర్‌’ అవార్డు సైతం అందుకునేలా చేసింది.
అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా…
ముద్రిక తల్లిదండ్రులు ముఖేష్‌, సంగీత ఇద్దరూ వైద్యులు. ఇంటర్‌ తర్వాత ఆమె ఐఐటీ ముంబయిలో మెటలర్జికల్‌ ఇంజినీరింగ్‌, ఆపై అందులోనే ఎంటెక్‌ పూర్తి చేశారు. లండన్‌లోని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ చేశారు ముద్రిక. చదువయ్యాక అక్కడే మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చినా… తాను మాత్రం ఇండియాకే తిరిగి రావాలనుకున్నారు. అలా 2013లో భారతదేశానికి వచ్చి ఐఐటీ హైదరాబాద్‌లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా తన కెరీర్‌ ప్రారంభించారు. ఆరేండ్ల తర్వాత అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా పదోన్నతి పొందారు. మొదటి నుంచీ ముద్రికకు సైన్స్‌ అంటే మక్కువ. నానమ్మ, తాతయ్యల దగ్గర పెరిగిన ఆమెకు సామాజిక సమస్యలపై అవగాహన కూడా ఎక్కువే.
నిల్వ ఉండేలా…
రైతులు సరైన ధరలేక పండించిన పంట నేల పాలు అవుతుండటం చాలా సార్లు ఆమె గమనించారు. రైతన్నల నష్టాలను పూడ్చడానికి వీలుగా డిమాండ్‌ని బట్టి అమ్ముకునేందుకు వ్యవసాయ ఉత్పత్తులు నిల్వ చేసే సామర్థ్యాన్ని పెంచాలనుకున్నారు. ఇందుకోసం రైతులూ, మార్కెటింగ్‌ అధికారులూ, గోడౌన్‌ యజమానులతో మాట్లాడి… వాస్తవ పరిస్థితుల్ని తెలుసుకునే ప్రయత్నం చేశారు. వివిధ ప్రయోగాల అనంతరం బ్యాక్టీరియల్‌ సెల్యూలోజ్‌కి సిల్వర్‌ నానో పార్టికల్స్‌ కలపడం ద్వారా టొమాటో వంటి కూరగాయలని ముప్పైరోజుల పాటు తాజాగా భద్రపరిచే ప్యాకేజింగ్‌ విధానాన్ని కనుగొన్నారు.
మహిళల కోసం…
మనదేశంలో మహిళలకు నెలసరి పెద్ద సమస్య. సురక్షిత విధానాలను పాటించకపోవడం ద్వారా అధిక సంఖ్యలో స్త్రీలు అనారోగ్యాలకు గురవుతున్నారు. దానికి పరిష్కారం కోసం రుతు రోజుల్లో వాడేందుకు యాంటీఫంగల్‌, బ్యాక్టీరియల్‌ ప్యాంటీలైనర్స్‌ని తయారు చేశారు. యాంటీ ఫంగల్‌ ఔషధాలకు లొంగని జగమొండి ఫంగల్‌ ఇన్ఫెక్షన్ల చికిత్సకు సరికొత్త ఆయుర్వేద ఔషధాన్ని కనుగొన్నారు. ఆయుర్వేద శక్తి కలిగిన ఒరెగానో నూనెలోని థైమల్‌, థైమ్‌ నూనెలోని కార్వకరోల్‌, లవంగ నూనెలోని యూజెనాల్‌ రసాయనాలతో కూడిన ఆయుర్వేద ఔషధాన్ని తయారు చేశారు. ఇవే కాదు భూమిలో కలవని థర్మాకోల్‌ను రీసైకిల్‌ చేసేందుకు దాన్ని ఫ్యాబ్రిక్‌గా మార్చారు. ఈ వస్త్రాన్ని పరిశ్రమల్లో నూనె, గ్రీజు వంటివాటిని శుభ్రపరచడానికి ఉపయోగపడేలా చేశారు.
కొత్త ఆవిష్కరణలు
పరిశ్రమల్లో వ్యర్థపదార్థమైన ఫ్లైయాష్‌తో నీరు అంటని ఓ పదార్థాన్ని తయారు చేశారు ముద్రిక. భవిష్యత్తులో దీనిద్వారా దుమ్మూధూళి చేరని గోడలు, టైల్స్‌ వంటి ఆవిష్కరణలెన్నో రావడానికి ఇది మూలం కాబోతోందని చెబుతారామె.
ఈ పరిశోధనలకు అయ్యే ఖర్చుని బయోటెక్నాలజీ ఇండిస్టీ రీసెర్చి అసిస్టెంట్‌ కౌన్సెల్‌ సమకూర్చింది. ఈ ప్రయోగాలకే ముద్రిక 2016లో ‘ద గాంధియన్‌ యంగ్‌ టెక్నలాజికల్‌ ఇన్నోవేషన్‌’ అవార్డును అందుకున్నారు. అలాగే అదే ఏడాది ఇండియన్‌ నేషనల్‌ యంగ్‌ అకాడెమీ ఆఫ్‌ సైన్సెస్‌ ఫెలోగా ఎంపికయ్యారు. ముద్రిక తన స్నేహితుడు కదమ్‌ అగర్వాల్‌ను పెండ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు కూతురు ప్రిషా ఉంది.