నవతెలంగాణ-వైరాటౌన్
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) జూన్ 4న ప్రకటించిన మెడికల్ ఫలితాలలో ఆలిండియా ర్యాంకులు సాధించి వైరా ప్రాంతానికి న్యూ లిటిల్ ఫ్లవర్ విద్యార్థులు తలమానికంగా నిలిచారు. ఆలిండియా ర్యాంకులు సాధించిన విద్యార్థులు ఎక్కిరాల కీర్తి-2061, గుడిపూడి ఉదయ భాస్కర్-4364, ఉండ్రు అజరు బాబు -21270 లను వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ మాట్లాడుతూ వైరా నియోజకవర్గానికి, వైరా ప్రాంత విద్యార్థులకు న్యూ లిటిల్ ఫ్లవర్ విద్యాసంస్థ ఒక ఆణిముత్యం అని, మొదటి బ్యాచ్ విద్యార్థులను ఐఐటీ, ఎన్‌ఐటీ లాంటి ప్రతిష్టాత్మక జాతీయ స్థాయి విద్యా సంస్థల్లోకి విద్యార్థులను పంపటమే కాకుండా, నేటి నీట్ పరీక్ష ఫలితాలలో ముగ్గురు విద్యార్థులు మెడిసిన్‌లో సీట్లు సంపాదించటం చాల గర్వకారణమని అన్నారు. మెడికల్ సీట్లు సాధించిన విద్యార్థులను శాలువాతో సన్మానించారు. కరస్పాండెంట్ డాక్టర్ పి.భూమేష్ రావు మాట్లాడుతూ కళాశాల మొదటి బ్యాచ్ విద్యార్థులు కళాశాల విద్యతోపాటు నీట్ పరీక్షకు క్రమశిక్షణగా ప్రిపరేషన్ పూర్తి చేసి మెడికల్ విజేతలుగా నిలిపి ముగ్గురిని డాక్టర్స్‌గా తయారు చేయడం వైరా చరిత్రలోనే సువర్ణ అక్షరాలతో లిఖించదగినటువంటి ఫలితాలు సాధించిన ఏకైక విద్యాసంస్థ న్యూ లిటిల్ ఫ్లవర్ అని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్స్ డాక్టర్ కాపా మురళీకృష్ణ, కుర్ర సుమన్, లగడపాటి ప్రభాకర్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.