– ఆర్‌ఎఫ్‌ఐడీ టెక్నాలజీతో ఫీజు వసూలు
– అమలుకు చాలా సమయం పట్టే అవకాశం..!
టోల్ ట్యాక్స్ చెల్లింపు విధానంలో కేంద్రం ఓ కొత్త విధానాన్ని తీసుకురాబోతుంది. టోల్ చార్జీలను ఆటోమేటిక్‌గా వసూలు చేసుకునే విధంగా రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (ఆర్‌ఎఫ్‌ఐడీ) టెక్నాలజీ రాబోతుంది. కారులో, ఇతర వాహనంలో ఉండే జీపీఎస్ పరికరం ద్వారా ప్రయాణ మార్గాన్ని గుర్తించి ఫీజును వసూలు చేస్తారు. కాకపోతే ఈ విధానం అమలుకు సమయం ఎక్కువ తీసుకునే అవకాశం ఉంది.
నవతెలంగాణ-ఎల్‌బీనగర్
జాతీయ రహదారిపై వెళ్తున్నప్పుడు మధ్యలో టోల్‌గేట్స్ వద్ద టోల్ ట్యాక్స్ చెల్లించడం ప్రస్తుతం తప్పనిసరి. ప్రస్తుతం ఫాస్టాగ్స్ ద్వారా చెల్లింపులు జరుగుతున్నాయి. అయితే, పండుగలు, ప్రత్యేక రోజుల సమయాల్లో టోల్ ప్లాజాల వద్ద వాహనాల రద్దీ పెరుగుతోంది. తాజాగా ఫాస్ట్‌ట్యాగ్ విధానానికి కేంద్ర ప్రభుత్వం బైబై చెప్పబోతోంది. ఈ మేరకు కొత్తగా జీపీఎస్ విధానాన్ని తీసుకురాబోతోంది. టోల్ వసూళ్లకు గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం (జీఎస్)ను అమలు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇటీవల కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కూడా జీపీఎస్ విధానాన్ని ప్రకటించారు. దాని ప్రకారం అన్ని టోల్ ప్లాజాలు, టోల్ కలెక్షన్ బూతులను తొలగించి జీపీఎస్ ఆధారిత వ్యవస్థను అమలు చేస్తారని తెలిసింది. సాధారణంగా జాతీయ రహదారులపై ప్రయాణం చేస్తున్నప్పుడు టోల్ ప్లాజాలు ఉంటాయి. కార్లు, జీపులు, లారీలు, బస్సులు, ఇతర పెద్ద వాహనాలు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. టోల్ ప్లాజాల వద్ద టోల్ చెల్లించడానికి వాహనాలు బారులు తీరి ఉంటాయి. అందరూ డబ్బులు చెల్లించి ముందుకు వెళ్లాలంటే చాలా సమయం పడుతుంది. అందుకు ప్రభుత్వం 2017లో ఫాస్ట్‌ట్యాగ్ విధానాన్ని తీసుకొచ్చింది. దీని ద్వారా చాలా సులభంగా టోల్ చెల్లించి ప్రయాణికులు ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు ఫాస్ట్‌ట్యాగ్ విధానాన్ని కూడా ప్రభుత్వం రద్దు చేయాలనుకుంటోంది.
ఆర్‌ఎఫ్‌ఐడీ టెక్నాలజీతో కొత్త విధానం
రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (ఆర్‌ఎఫ్‌ఐడీ) టెక్నాలజీతో పనిచేసే కొత్త విధానం ద్వారా టోల్ చార్జీలను ఆటోమేటిక్‌గా వసూలు చేసే విధానాన్ని రూపొందిస్తున్నారు. త్రీ జీ కనెక్టివిటీతో మైక్రో కంట్రోల్ ద్వారా ఈ సాంకేతికతను అమలు చేయాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. కారులో ఉండే జీపీఎస్ పరికరం ద్వారా వాహనం మార్గాన్ని ఎన్‌హెచ్‌ఏ, రెగ్యులేటరీ ఏజెన్సీ పరిశీలిస్తుంది. వాహనం ఏ రోడ్ల మీదుగా వెళ్తోంది.. ఎన్ని టోల్ గేట్ల మీదుగా ప్రయాణం సాగిస్తుందని అది గుర్తిస్తుంది. జీపీఎస్ ఆధారిత సిస్టమ్ బహుశా హైవేల వెంట అమర్చే కెమెరాల ద్వారా ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నిషన్ సిస్టమ్‌ను ఉపయోగిస్తుందని తెలుస్తోంది. దాని ఆధారంగా వాహన యజమాని నుంచి ఫీజు వసూలు చేస్తారు. అయితే, ఆ నగదు నేరుగా బ్యాంకు ఖాతా నుంచి తీసుకుంటారని సమాచారం. ఈ పద్ధతిలో అన్ని వాహనాలకు జీపీఎస్ తప్పనిసరిగా ఉండాలి. ఈ కొత్త పద్ధతిని అమలు చేయడం అంత సులువు కాదని తెలుస్తోంది. ప్రతి కారు సాంకేతికతను కలిగి ఉండటానికి కొంత సమయం పడుతుందని పలువురు నిపుణులు చెబుతున్నారు.