చేపల ఆహార ప్యాకింగ్‌లో కొత్త పద్దతులు

– తెలంగాణ ఫిషరీస్‌ ఫెడరేషన్‌ చైర్మెన్‌ పిట్టల రవీందర్‌
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
చేపల ఆహారం ప్యాకింగ్‌ అనుసరించాల్సిన కొత్త పద్దతులపై అధ్యయనం చేయనున్నట్టు తెలంగాణ రాష్ట్ర ఫిషరీస్‌ ఫెడరేషన్‌ చైర్మెన్‌ పిట్టల రవీందర్‌ చెప్పారు. శుక్రవారం సనత్‌నగర్‌లోని ఇండియన్‌ ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్యాకేజింగ్‌ కేంద్ర కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. ముఖ్యమైన నగరాల్లో ప్రారంభించనున్న ఫిష్‌ ఫుడ్‌ సెంటర్లలో చేపల ఆహార ఉత్పత్తులను శాస్త్రీయంగా, ఆరోగ్య సూత్రాలను పాటిస్తూ ప్యాకేజింగ్‌ నిర్వహించేందుకు ఇండియన్‌ ఇన్సిట్యూట్‌ ఆఫ్‌ ప్యాకేజింగ్‌ డిప్యూటీ డైరెక్టర్‌, బ్రాంచి ప్రధానాధికారి డాక్టర్‌ ఎన్‌. నటరాజ్‌తో చర్చించినట్టు తెలిపారు. ఫెడరేషన్‌ నిర్వహిస్తున్న ఫిష్‌ క్యాంటీన్లలో తయారు చేస్తున్న ఫిష్‌ బిర్యానీ, ప్రాన్స్‌ బిర్యానీ, చేపల పులుసు, చేపల ఫ్రై, రొయ్యల పులుసు, ఫిష్‌ కర్రీ తదితర ఆహార పదార్థాలను సరైన పద్ధతిలో, శాస్త్రీయ విధానంలో ప్యాకేజింగ్‌ నిర్వహించి వినియోదారులకు అందించేందుకు కృషి చేస్తామన్నారు.
మత్స్యకారులకు ‘హెల్ప్‌లైన్‌’ : పిట్టల రవీందర్‌
జూలై 10న మత్స్యకారులకు హెల్ప్‌లైన్‌ ప్రారంభించనున్నట్టు ఫిషరీస్‌ ఫెడరేషన్‌ చైర్మెన్‌ పిట్టల రవీందర్‌ వెల్లడించారు. రాష్ట్రంలోని మత్స్య సహకార సంఘాలు, సభ్యులు, సహకార సంఘాలు, మార్కెటింగ్‌ సోసైటీలు, రిజర్వాయర్లలో లైసెన్సులు కలిగిన ఉన్న మత్స్యకారులు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.