– పాత నోటిఫికేషన్ రద్దు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
గ్రూప్-1 నోటిఫికేషన్‌ను టీఎస్‌పీఎస్సీ రద్దు చేసింది. ఈ మేరకు సోమవారం వెబ్ నోటీసును విడుదల చేసింది. 503 పోస్టులతో గతంలో ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేస్తున్నట్టు అందులో పేర్కొంది. 2022లో ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేసిన గంటల వ్యవధిలోనే టీఎస్‌పీఎస్సీ మొత్తం 563 ఉద్యోగాల భర్తీకి కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆమేరకు ఫిబ్రవరి 23 నుంచి మార్చి 14వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. మే/జూన్‌లో ప్రిలిమినరీ పరీక్ష, సెప్టెంబర్/అక్టోబర్‌లో మెయిన్ పరీక్ష నిర్వహించనున్నారు.
2022 ఏప్రిల్‌లో 503 పోస్టులతో గ్రూప్-1 నోటిఫికేషన్ వెలువడింది. అదే ఏడాది అక్టోబరు 16న ప్రిలిమినరీ పరీక్ష జరిగింది. ప్రశ్నపత్రాల లీకేజీ కారణంగా ఈ పరీక్షను టీఎస్‌పీఎస్సీ రద్దు చేసింది. 2023 జూన్ 11న రెండోసారి పరీక్షను నిర్వహించింది. దాదాపు 2 లక్షల 33 వేల మంది ఆ పరీక్షను రాశారు. అయితే ఈ పరీక్ష నిర్వహణలోనూ లోపాలున్నాయనీ, అభ్యర్థుల బయోమెట్రిక్ తీసుకోలేదనీ, ప్రిలిమినరీ పరీక్ష రోజున ఇచ్చిన హాజరు సంఖ్యకు, తుది కీ సమయంలో ఇచ్చిన హాజరు సంఖ్యకు పొంతన లేదని పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ అంశంపై న్యాయస్థానం విచారణ జరిపింది. అనంతరం పరీక్ష రద్దు చేసి మరోసారి నిర్వహించాలని తీర్పు ఇచ్చింది. దీనిని డివిజన్ బెంచ్ కూడా సరైనదేనని స్పష్టం చేసింది. దీంతో టీఎస్‌పీఎస్సీ న్యాయ నిపుణులతో చర్చించి సుప్రీంకోర్టులో అప్పీలు పిటిషన్ వేసింది. ఈలోపు రాష్ట్రంలో ఎన్నికలు జరిగి ప్రభుత్వం మారింది. దీంతో టీఎస్‌పీఎస్సీ ప్రక్షాళనపై కొత్త సర్కార్ దృష్టి సారించింది. ఈ క్రమంలోనే కమిషన్ చైర్మెన్, సభ్యులు రాజీనామా చేశారు. దానికి గవర్నర్ ఆమోదముద్ర వేశారు. టీఎస్‌పీఎస్సీ సభ్యులను నియమించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసి నియామకం చేపట్టింది. కొత్త చైర్మెన్‌గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డితో పాటు సభ్యులను ప్రభుత్వం నియమించింది.
ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టులో గతంలో వేసిన పిటిషన్‌ను టీఎస్‌పీఎస్సీ వెనక్కి తీసుకుంది. గతంలో 503 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా, తాజాగా మరో 60 పోస్టులకు ఆమోదం తెలిపింది. దీంతో మొత్తం పోస్టుల సంఖ్య 563కి చేరింది. వీలైనంత త్వరగా ఈ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలని టీఎస్‌పీఎస్సీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గత నోటిఫికేషన్‌లో రెండోసారి నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష సైతం రద్దైన తరుణంలో నిరుద్యోగ అభ్యర్థులు మూడోసారి పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 18 రకాల పోస్టులను భర్తీ చేయనున్నారు.
పోస్టుల వివరాలు
‘ డిప్యూటీ కలెక్టర్ (సివిల్ సర్వీసెస్, ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్) – 45 ఖాళీలు
‘ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ క్యాటగిరీ-2 (పోలీస్ సర్వీస్) – 115
‘ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ (కమర్షియల్ ట్యాక్స్ సర్వీస్ ) -48
‘ రీజినల్ ట్రాన్స్ పోర్ట్ ఆఫీసర్ (ట్రాన్స్ పోర్ట్ సర్వీస్) – 04
‘ డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్ (పంచాయత్ సర్వీసెస్) – 07
‘ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ (రిజిస్ట్రేషన్ సర్వీసెస్) – 06
‘ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ (మెన్ )(జైల్స్ సర్వీస్) – 05
‘ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ (లేబర్ సర్వీస్) – 08
‘ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ (ఎక్సైజ్ సర్వీస్) – 30
‘ మున్సిపల్ కమిషనర్ – గ్రేడ్ 2 (మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్) – 41
‘ డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ షెడ్యూల్డ్ క్యాస్ట్ డెవలప్ మెంట్ ఆఫీసర్ -03
‘ డిస్ట్రిక్ట్ బ్యాక్‌వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ ఆఫీసర్ ఇన్‌క్లూడింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ (డిస్ట్రిక్ట్ బ్యాక్‌వర్డ్ క్లాసెస్ డెవలప్ మెంట్ ఆఫీసర్) (బ్యాక్ వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ సర్వీస్ – 05
‘ డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ (ట్రైబల్ వెల్ఫేర్ సర్వీస్) – 02
‘ డిస్ట్రిక్ట్ ఎంప్లారు మెంట్ ఆఫీసర్ (ఎంప్లారు మెంట్ సర్వీస్) – 05
‘ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఇన్‌క్లూడింగ్ లే సెక్రెటరీ అండ్ ట్రెజరర్ గ్రేడ్ 2 (మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ ) – 20
‘ అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌండ్స్ ఆఫీసర్, అసిస్టెంట్ లెక్చరర్ ఇన్ ది ట్రైనింగ్ కాలేజ్ అండ్ స్కూల్ ( ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ సర్వీస్ – 38
‘ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ (స్టేట్ ఆడిట్ సర్వీస్) – 41
‘ మండల్ పరిషత్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ సర్వీస్) – 140