ఎల్‌ఐసీ నుంచి కొత్త పెన్షన్‌ ప్లాన్‌

ఎల్‌ఐసీ నుంచి కొత్త పెన్షన్‌ ప్లాన్‌– జీవన్‌దార-2 ఆవిష్కరణ
– కనీస పెన్షన్‌ రూ.12వేలు పాలసీపై రుణం
హైదరాబాద్‌ : ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) కొత్త పెన్షన్‌ ప్లాన్‌ను విడుదల చేసింది. జీవన్‌ ధారా-2 పేరుతో ముంబయిలో దీన్ని ఎల్‌ఐసీ ఛైర్‌పర్సన్‌ సిద్దార్థ మహంతి ఆవిష్కరించారు. ఈ కొత్త పాలసీ సోమవారం నుంచి అందుబాటులోకి వచ్చింది. ఇది వ్యక్తిగత, పొదుపు, డిఫర్ట్‌ యాన్యుటీ, నాన్‌ లింక్ట్‌ ప్లాన్‌ అని ఎల్‌ఐసీ తెలిపింది. 20 ఏళ్లు దాటిన వారు ఈ ప్లాన్‌కు అర్హులు. అదే విధంగా ఎంచుకునే యాన్యుటీ ఆప్షన్‌ను బట్టి గరిష్ఠ వయస్సు 80, 70, 65 ఏళ్లుగా ఉంది. పెన్షన్‌ (యాన్యుటీ) హామీని నెలకు, మూడు నెలలు, ఆరు నెలలు, వార్షిక పద్దతిని ఎంచుకోవచ్చు. వయసు పెరిగినకొద్దీ అధిక యాన్యుటీ రేట్లు అందుకోవచ్చు. పాలసీదారులు రెగ్యులర్‌, సింగిల్‌ ప్రీమియంలను ఎంచుకోవడానికి వీలుంది. సింగిల్‌ లైఫ్‌ యాన్యుటీ, జాయింట్‌ లైఫ్‌ యాన్యుటీలుంటాయి. రెగ్యులర్‌ ప్రీమియంలో వాయిదా వ్యవధి ఐదేళ్ల నుంచి 15 ఏళ్ల లోపు ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ ప్లాన్‌లో పాలసీదారుడు చనిపోతే వచ్చే ఆ మొత్తాన్ని ఒకేసారి లేదా వాయిదాల్లో నామినీలు తీసుకోవచ్చు. పాలసీదారుడు మరణిస్తే ప్రీమియం మొత్తానికి 105 శాతం సొమ్మును నామినీకి చెల్లిస్తుంది. ఆప్షన్‌ 2-10 ఎంచుకున్న వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. జాయింట్‌ లైఫ్‌ ఎంచుకుంటే డిఫర్‌మెంట్‌ పీరియడ్‌లో ఒక వ్యక్తికి ఏదైనా జరిగితే జీవించి ఉన్న వ్యక్తికి యాన్యుటీ కొనసాగుతుంది. ఆ వ్యక్తి కూడా మరణించినప్పుడు నామినీకి ఆ మొత్తం చెల్లిస్తారు. జీవన్‌ ధారా-2లో నెలకు కనీస పెన్షన్‌ రూ.1000 నుంచి ప్రారంభమవుతుంది. ఏడాదికి రూ.12 వేలు చొప్పున లభిస్తుంది. సింగిల్‌ ప్రీమియం అయితే కనీసం రూ.లక్ష చెల్లించాల్సి ఉంటుంది. అదే రెగ్యులర్‌ ప్రీమియం అయితే ఏడాదికి కనీస మొత్తం రూ.11 వేలు చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. గరిష్ఠ ప్రీమియంపై ఎలాంటి పరిమితులు విధించలేదు. జాయింట్‌ లైఫ్‌ యాన్యుటీ కొనుగోలు పాలసీ భాగస్వామిగా కుటుంబ సభ్యులను ఎవరినైనా ఎంచుకోవచ్చు. పాలసీపై రుణ సదుపాయం లభిస్తుంది. ఈ పాలసీని ఆన్‌లైన్‌, ఏజెంట్ల వద్ద కొనుగోలు చేయవచ్చని ఎల్‌ఐసీ వెల్లడించింది.