రాజమండ్రిలో నయా షెడ్యూల్‌

రాజమండ్రిలో నయా షెడ్యూల్‌కంచర్ల ఉపేంద్ర, అపర్ణాదేవి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘1920 భీమునిపట్నం’. నరసింహ నంది దర్శకత్వంలో ఎస్‌.ఎస్‌. ఎల్‌.ఎస్‌.క్రియేషన్స్‌ పతాకంపై కంచర్ల అచ్యుతరావు నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం రాజమండ్రి పరిసరాల్లో జరుపు కుంటోంది. ఇటీవలే రామోజీ ఫిలింసిటీలో షూటింగ్‌ని ప్రాంభించుకుని, అక్కడే పది రోజులపాటు చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్ర యూనిట్‌ రాజమండ్రి పరిసరాల్లో హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత కంచర్ల అచ్యుతరావు మాట్లాడుతూ, ‘రాజమండ్రిలో పది రోజుల పాటు హీరో, హీరోయిన్ల పై గోదావరి నేపథ్యంలో సన్నివేశాలను తీస్తాం. ఈ చిత్రంలోని సీతారాం, సుజాత పాత్రల మధ్య నడిచే ప్రేమకధను దర్శకుడు అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. కథానుసారం సంగీతం, ఫోటోగ్రఫీ చిత్రానికి ప్రాణంగా నిలుస్తాయి. మా చిత్రానికి ఇళయరాజా సంగీతాన్ని అందిస్తుండటం ఓ హైలైట్‌. రాజమండ్రి తర్వాత విశాఖపట్నం, అరకు, ఊటీలలో కూడా చిత్రీకరణ జరుపుతాం’ అని చెప్పారు. ‘భారత స్వాతంత్య్ర పోరాట నేపథ్యంలో చక్కటి భావోద్యేగాల మధ్య నడిచే కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. పాత్రలన్నీ సహజసిద్ధంగా ఉంటాయి. నిజ జీవితంలో జరిగిన కొన్ని ఘటనలను ప్రేరణగా తీసుకుని ఈ సినిమా చేస్తున్నాం. అప్పటి బ్రిటీష్‌ ప్రభుత్వ పోలీస్‌ అధికారి పాత్రలో హీరో కంచర్ల ఉపేంద్ర నటిస్తుండగా, స్వాతంత్ర సమరయోధుడి కుమార్తె పాత్రలో హీరోయిన్‌ అపర్ణా దేవి కనిపిస్తారు’ అని దర్శకుడు నరసింహ నంది అన్నారు.