వర్తమాన జీవితాల రూపచిత్రణ : ‘కొత్త కథలు – 5’

Portrayal of Contemporary Lives : 'New Stories - 5'గొల్లపూడి వారి కథ ‘ఆమె’ ఈ సంకలనంలోని కథలన్నింటికీ భిన్నంగా ఉంటుంది. కథలో ఒక వైచిత్రి, ఒక వైయుక్తికం, రసస్ఫూర్తి కలిగించే కవిత్వమయ వాక్యాలు – ”యౌవనం పొలిమేరల్లో తలవంచుకు నడుస్తున్న తారుణ్యమూర్తిగా, ఎర్రని తాంబూలచర్వణంలో తామసాన్ని కలిగించే పెద్ద ముత్తయిదువ లాగ…” అంటూ సాగతూ పాఠకుడిని ముందుకు లాక్కెళతాయి. ఉత్తరాది నుండి తెలుగు రాష్ట్రానికి బదిలీ అయి వచ్చిన తెలుగు జంట అనుభవం ఈ కథలోsatirical రీ గా దర్శనమవుతుంది. అద్దె ఇంట్లో ప్రతిరోజు కిటికీ దగ్గర కూర్చునే భర్త ప్రవర్తనలో భార్య మార్పును గమనిస్తుంది. ఫలితంగా భర్త మీద భార్యకు అనుమానం. అతను ఎవరో ‘ఆమెను’ ప్రతిరోజూ అదే సమయానికి చూస్తూ సమయం గడపడం, తమ దాంపత్యానికి దెబ్బ అనే సందేహం కలుగుతుంది. చివరికి ఆమె ఎవరో కాదు సంధ్య – సంధ్యాదేవి, సాయంకాలపు ప్రకతి కన్య అని తెలుసుకుంటుంది. Suspense విడిపోతుంది. ఇద్దరి మధ్య అనురాగం కొత్తకాంతులను పూయిస్తుంది.
కథల్లో ప్రధానంగా కథా వస్తువు మహిళల సమస్యలు, చెదిరిపోతున్న వైవాహిక సంబం ధాలు, కుటుంబ వ్యవస్థతో పాటు తరిగిపోతున్న మానవ సంబంధాల మధ్య ప్రేమ వ్యక్తమవు తోంది. అలాగే మానవీయ విలువల అవసరాన్ని నొక్కి చెపుతుంది. సమాజాన్ని మాత్రమే కాదు న్యాయ వ్యవస్థను, చట్టాలను కూడా తెలుసుకో వాల్సిన అవసరాన్ని రావులపాటి సీతారామరావు కథ చెపుతుంది. రాజా రామమోహనరావు, విహారి కథలు చదివితే కొత్తతరంలో భార్యాభర్తల మధ్య వుండే పరస్పర అవగాహన రాహిత్యం, వారి ప్రవర్తన కారణంగా సంబంధాలు ఏ విధంగా విడాకుల దాకా వెళ్తున్నాయి, వాటిని ఏ విధంగా పరిష్కారించుకోవాలి అన్న విషయాలు అభివ్యక్తమవుతాయి. యండమూరి కథ కొత్త ప్రశ్నను లేవనెత్తుతుంది. స్త్రీ, భర్త ఉండగా మరో పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది? మగాడు భార్య ఉండగానే రెండో పెళ్లి చేసుకుంటున్నాడు. అది సమస్య కానప్పుడు స్త్రీ భర్త వుండగానే మరో పెళ్లి చేసుకుంటే తప్పేమిటి? అన్న కూతురు ప్రశ్నకు తండ్రి ఇచ్చే సమాధానం ఆలోచింపచేస్తుంది. కథలోని ప్రశ్నను కథ ద్వారా చెప్పించడంలో కొత్తదనం వుంది. రామచంద్రమౌళి తన కథలో మొబైల్‌ఫోన్‌ చేతికందడంతో యువతరం పోర్నోలకు అలవాటు పడి ఏ విధంగా చెడిపోతున్నారు, ముఖ్యంగా యువతులకు సమస్యలు సష్టించే సాధనంగా తయారయ్యిం దని యువత జాగ్రత్త పడాలన్న సందేశం ఇస్తుంది. డాక్టర్ల వత్తిలోని ఉదాత్తత, ఔదార్యం, గొప్పదనాన్ని తెలుపుతూ కె.వి.కష్ణకుమారి కథ, స్త్రీ ధిక్కార స్వరం ఆవశ్యకతను పోల్కంపల్లి శాంతాదేవి కథ, ఆర్థికపరమైన విషయాలు కుటుంబ వ్యవస్థలోని భద్రతా వలయాలను ఛిద్రం చేసి మనుషులను ఎలా ఒంటరిగా చేస్తున్నాయో తెలిపే మణి వడ్లమాని కథ పాఠకులను ఉద్వేగానికి లోను చేస్తాయి. టెక్సాస్‌, అమెరికా నుండి వంగూరి చిట్టెన్‌ రాజు ‘అనుమానప్పిశాచి’ కథ సరదాగా సాగుతూ నవ్వించినా ఇన్సూరెన్స్‌ కంపెనీ వారి గోల, వారి ప్రశ్నల పరంపర విసుగెత్తించడంతో పాటు ఎంతగా పీడిస్తాయో, ‘అమెరికొలిజన్‌’, ‘అమెరికాంప్రెహెన్సివ్‌’ లాంటి పదాల కన్ఫ్యూషన్‌తో కస్టమర్లను ఏ విధంగా అయోమయానికి గురిచేస్తాయో తెలుపుతుంది. ఈ రకమైన సమస్యలు అమెరికాలోనే కాదు వివిధ కార్పొరేట్‌ లాంటి వ్యాపార సంస్థలు మన దేశంలో, తెలుగు రాష్ట్రాలలో కూడా మొదలైంది. ఒంటి బరువు తగ్గించుకునే ప్రహసనంలో కొత్త తరం యువత ఆహారపు అలవాట్లను మార్చు కోవడం వింతగా ఉంటుంది. సాంప్రదాయపు పద్ధతులు వదిలి విదేశీ ఫ్లోరా లైఫ్‌ ప్లాన్‌ అనుసరిస్తే బరువు కాకుండా బ్యాంకు బాలన్స్‌ మాత్రమే తగ్గడం, నీరసం వచ్చి ఆరోగ్యంపై దాని ప్రభావం పడటం నవత తిరునగరి కథ ద్వారా తెలియజేసి యువతరానికి సందేశం ఇస్తుంది. జలంధర కథలో తల్లి విమల పడిన, పడుతున్న కష్టాలు చూసి ఆమె కూతుళ్లు సానుభూతి చూపుతూ తల్లి అమాయకత్వానికి జాలిపడతారు. పెద్దల మాటలు వింటూ తన కనీస సౌఖ్యాన్ని కూడా లెక్కచేయక కుటుంబం, సంసారం అని తన వారి కోసం ఆమె చేస్తున్న త్యాగాలను విమర్శిస్తారు. సమాధానమివ్వలేని ఆమె బలహీనతను ఎత్తిచూపే ప్రయత్నం చేస్తారు. కూతుళ్లు తెలివిగలవాళ్ళు, చురుకైనవాళ్ళు, ఆధునికతను ఒంటబట్టిం చుకున్న వాళ్ళు, స్వతంత్ర భావాలు కలిగివున్నవాళ్ళు. చివరికి వారి అన్ని విశేషణాలు, ఆర్ధిక స్వాతంత్య్రం వారి వైవాహిక జీవితాలను భగం చేసి ఒంటరిగా చేయడంతో తల్లి సాంప్రదాయిక విలువలు ఏ విధంగా మానవ సంబంధాలను పటిష్టంగా వుంచుతాయో తెలిసి వచ్చి తల్లి గొప్పదనాన్ని, త్యాగాన్ని గుర్తించడంతో కథ ఆర్ద్రంగా సాగి మనసును కలిచివేస్తుంది. అలాగే భువన చంద్ర, తురగా జయశ్యామల, ముక్తేవి భారతి, శారదా అశోకవర్ధన్‌, తిరునగరి దేవకీదేవి, స్వాతి జంగా ఇంకా ఇతర కథకుల కథలు వైవిధ్యంగా వుండి చదివిస్తాయి. ఇందులోని కథలన్నీ వైవిధ్యంగా, వస్తు విస్తతితో ఉంటూ ప్రస్తుత సమాజాన్ని, వర్తమాన జీవితాలను చిత్రిక పడతాయి. వైవాహిక బంధాలలో పొడసూపుతున్న సమస్యలు, అవి విడాకుల వరకు పోవడం అనేది వర్తమానంలో వున్న ఒక సమస్య. ఈ సమస్యను కథకులు స్పష్టంగా చూపుతూ వాటి కారణాలను వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. యువతరం జీవితాన్ని అవగాహనలోకి తెచ్చకొని, ఒకరినొకరు అర్ధం జేసుకుంటూ ప్రేమగా, స్నేహంగా సాగిపోవాలనే సందేశం కూడా వ్యక్తమవుతోంది. ఈ సందర్భంలో, వైవాహిక జీవితంలో దంపతులు ఏ విధంగా మసులుకోవాలో, ఎలా స్నేహంగా, ప్రేమగా ఉండాలో గొల్లపూడి వారి కథ ‘ఆమె’ మార్గ దర్శకంగా ఉంటుంది. గొల్లపూడి వారి ”ఆమె” కు వందనాలు. కథకులకు అభినందనలు. నిడివి లోనూ చిన్నగా వుండి అనవసరపు కొనసాగిం పులు, పొడిగింపులు లేకుండా కథలన్నీ పాఠకు లను చదివిస్తూ ఎక్కడా విసుగెత్తించవు. కథల ఎన్నికలో సంకలనకర్తల శ్రమ, శ్రద్ధ స్పష్టంగా కనబడుతుంది. అందుకు వారిని ప్రశంసించక తప్పదు. గొల్లపూడి ఆత్మీయ స్పర్శను కిరణ్‌ప్రభ తమ వ్యాసం ద్వారా అందించారు. చక్కటి కథా సాహిత్యం వెలుగులోకి రావడానికి అన్ని విధాలుగా సహకరించిన కతి స్వీకర్త డా.ఆళ్ళ శ్రీనివాసరెడ్డి, ప్రతి యేటా విలక్ష ణమైన సాహిత్యాన్ని అందిస్తూ సాహితీ సేవ చేస్తున్న వంశీ ఆర్ట్‌ థియేటర్స్‌, వ్యవస్థాపకులు వంశీ రామరాజు అభినందనీయులు.
– డా. రూప్‌కుమార్‌ డబ్బీకార్‌
99088 40186