దాదాపు రెండు సంవత్సరాల పాటు రెండు మూడు వేవ్‌లుగా సాగిన కరోనా పాండెమిక్ మన దేశంలోనే కాక వివిధ దేశాల వైద్య వ్యవస్థలలోని లోపాలను ఒక్కొక్కటిగా బట్టబయలు చేసింది. ఐతే ఈ లోపాలనుండి నేర్చుకున్న అనుభవ పాఠాలు మనను మరింత వినమ్రంగా చేసి మన ఆలోచనలో రావాల్సిన మార్పును ఆహ్వానించేదిగా ఉందా లేదా అన్నదే ప్రస్తుతం ప్రధానమైన అంశం. ఎందుకంటే కొన్ని దేశాలు కరోనా పాండెమిక్ అనుభవం నుంచి నూతన పాఠాలు నేర్చుకుని తమ లోపాలను అధిగమించే దిశగా అడుగులు వేస్తుంటే, కొన్ని దేశాలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాన ఏ పాఠాన్నీ నేర్చుకోక అంతకుముందులాగే కొనసాగుతున్నాయి. రాజకీయ సన్నద్ధత కొరవడి, ఆరోగ్య సంబంధిత సంస్థాగత జడత్వంతో కునారిల్లుతున్నాయి. దానికి తోడు పౌరుల్లోని జ్ఞాన- విజ్ఞాన వ్యతిరేకత, మిస్ ఇన్‌ఫర్మేషన్, సామాజిక హెచ్చుతగ్గులు, పబ్లిక్ హెల్త్‌ని దారుణంగా దెబ్బతీస్తున్నాయని ప్రపంచ వ్యాప్తంగా యూనిసెఫ్, డబ్ల్యూ.హెచ్.ఒ వంటి సంస్థలు ఘోషిస్తున్నాయి. లాన్‌సెట్, బి.ఎం.జె వంటి ప్రతిష్టాత్మకమైన జర్నల్స్‌లో ఆర్టికల్స్ కూడా హెచ్చరించాయి.
కరోనా సమయంలో రాజకీయ అతివాదాలు, పబ్లిక్ హెల్త్ అధికారుల అసంబద్ధ ప్రకటనలూ, వాక్సిన్ల ట్రయల్స్‌లో, వాటి అనుమతుల్లో వచ్చిన చిక్కులు, హెల్త్ కేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లోని అసంసిద్ధత, తగనంతగా లేని మాన్ పవర్, వివిధ వ్యవస్థల మధ్య సమన్వయలోపం వంటివి అమెరికా, రష్యా, బ్రెజిల్, ఇండియా వంటి దేశాలను అతలాకుతలం చేశాయి. కానీ మరలా వీటన్నింటినీ పునః సమీక్షించుకుని మన హెల్త్ సిస్టంను బాగుచేసే దిశగా అడుగులు వేస్తున్నామా లేదా అనేదే ఇపుడు ప్రధాన ప్రశ్న. ఒకసారి తప్పు చేయడం తప్పు కాదు. కానీ చేసిన తప్పునే మళ్ళీ మళ్ళీ చేయడం, గాఢ నిద్రను అనవసరంగా నటించడం భవిష్యతరాలను చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి నెడుతుంది.
ముఖ్యంగా మన దేశంలో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొని ఉంది. ఒకపక్కన అభివద్ధి చెందిన దేశాల్లో గుండె జబ్బులు, కాన్సర్ వంటి నాన్ కమ్యూనికబుల్ డిసీజ్‌లు పెరుగుతుంటే, మరోపక్కన లో అండ్ మిడిల్ ఇన్‌కమ్ దేశాల్లో అంటువ్యాధులు పెరుగుతున్నాయి. ఐతే మన దేశంలో ఒకవైపు నాన్ కమ్యూనికబుల్ జబ్బులు, మరోవైపు అంటువ్యాధులు రెండూ పెరగడం అనేది గతంలో ఎన్నడూ లేని ఒక విచిత్రమైన స్థితిని కల్పించింది. దీనివలననే మెడికల్ సిస్టం మీద విపరీతమైన భారం పెరిగింది. కొన్ని దేశాల్లో గుండె జబ్బులు, డయాబెటిస్, కాన్సర్ వంటివి డెంగ్యూ, టైఫాయిడ్ వంటి అంటువ్యాధులను రీప్లేస్ చేశాయి. అలాంటిది మనదేశంలో జరగలేదు. అవీ పెరుగుతున్నాయి. ఇవీ పెరుగుతున్నాయి. అంటే కమ్యూనికబుల్, నాన్ కమ్యూనికబుల్ జబ్బులు రెండూ దాడి చేస్తున్నాయి. ఇటువంటి పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి మనదేశం ఎంతవరకు సిద్ధంగా ఉందనేదే ఇపుడు అడగవలసిన ప్రశ్న. ఇక్కడ మరో సమస్య ఏంటంటే జీవన పరిస్థితులు మెరుగుపడుతున్నాయన్నది నిజంగా నిజమే ఐతే ఈనాటికీ మనదేశంలో మరణాలకి గల కారణాలలో ఇన్ఫెక్షన్లు ఎందుకు ముందువరుసలో ఉన్నాయి?
చాలామటుకు పీడియాట్రిక్, జనరల్ మెడిసిన్ ఔట్ పేషెంట్, ఇన్‌పేషెంట్ విభాగాలు సీజనల్ అంటువ్యాధుల పేషెంట్‌లతో కిక్కిరిసిపోతున్నాయి. డెంగీ, మలేరియా, టైఫాయిడ్, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌ల వంటివి వస్తే ఈనాటికీ మరణాలు జరుగుతూనే ఉన్నాయంటే, వీటి నివారణ చర్యలను చేపట్టడంలో విఫలమవడమే ప్రధాన కారణమని తెలుసుకోవాలి. మరో కొత్త ధోరణి ఏంటంటే… నాన్ కమ్యూనికబుల్ జబ్బుల మీద జరుగుతున్నంత చర్చ కమ్యూనికబుల్ జబ్బులు మీద జరుగడంలేదు. నాన్ కమ్యూనికబుల్ జబ్బులు ప్రధానమైన ఆరోగ్య సమస్య అనడంలో ఎలాంటి ఇబ్బందీ లేదు. కానీ నేటికీ ఇన్ఫెక్షన్ల బారిన పడి మనుషులు చనిపోవడం అన్నది మనం దీర్ఘకాలిక ప్రణాళికలు వేసుకుని ఇంప్లిమెంట్ చేయడంలో విఫలమౌతున్నామనడానికి నిదర్శనం. అంతేకాకుండా ప్రైమరీ హెల్త్ కేర్ సిస్టం దారుణమైన నిర్లక్ష్యానికి గురికావడం మన ప్రధాన లోపం.
మన వైద్య వ్యవస్థ మూడంచెలుగా ఉంటుంది. ప్రైమరీ కేర్, సెకండరీ కేర్, టెర్షియరీ కేర్ అని. మనకు వచ్చే జబ్బుల స్పెక్ట్రమ్‌ని ఒకసారి చూసుకున్నా, డెబ్భై శాతం జబ్బులు ప్రైమరీ కేర్ వ్యవస్థలో నయమయ్యేవే. ఒక పదిహేను నుండి ఇరవై శాతం సెకండరీ కేర్ అవసరమైనవైతే మరో పదినుండి పదిహేను శాతం జబ్బులకు టెర్షియరీ కేర్ అవసరమౌతుంది. టెర్షియరీ కేర్ కోసం ప్రైవేటు ఆసుపత్రులు ఉన్నాయి. అవి రోజురోజుకీ విస్తరిస్తున్నాయి. ఐతే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్‌లో టెర్టిరీ కేర్ అవసరమైన జబ్బులకు చికిత్స అందించడంలో ప్రైవేటు ఆసుపత్రులు దాదాపు విజయం సాధించాయి. ఖర్చు నియంత్రణల విషయమై చాలా సమస్యలు నేటికీ ఉన్నా.. అవి ఉత్తమమైన వైద్య సదుపాయాలను అందిస్తున్నాయనడంలో సందేహం లేదు. ఐతే ఈ మధ్య వచ్చిన కార్పోరేటైజేషన్‌లో భాగంగా చిన్న చిన్న క్లినిక్ లూ, నర్సింగ్ హోంలు వంటి సెకండరీ వైద్య వ్యవస్థలు నిర్లక్ష్యానికి గురవడంతో చిన్న చిన్న ఆపరేషన్లకు సైతం పెద్ద కార్పోరేట్ ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించడం పెరిగింది. చివరికి ప్రభుత్వ ఆధీనంలో ఉండే ప్రైమరీ కేర్ సెంటర్లలో కొద్దిరోజులపాటి ఔట్ పేషెంట్ కేర్‌తో తగ్గిపోయే ఇన్ఫెక్షన్లు వంటివాటికి కూడా టెర్షియరీ కేర్ సెంటర్స్‌కి పరుగులు తీసే దుస్థితి నెలకొని ఉంది. అంటే సెకండరీ కేర్ తో పాటు ప్రైమరీకేర్ పై దారుణమైన నిర్లక్ష్యమే ఈ పరిస్థితికి దారితీసింది. దీనివలన డిసీజ్ బర్డెన్ అంతా టెర్షియరీ కేర్ సెంటర్స్‌పై పడటం, ఇది ప్రైవేటు వైద్యాన్ని మరింత కాస్ట్లీ వ్యవహారంగా చేయడానికే దోహదపడింది. ఆరోగ్యశ్రీ వంటి పథకాల వలన పేదవారికి టెర్షియరీ కేర్ సెంటర్స్‌లలో కొంత ఊరట లభించినా.. మధ్యతరగతి వారికి సకాలంలో సరైన చికిత్స అందడం అన్నది తలకు మించిన ఖర్చుతో కూడిన వ్యవహారంగా మారి, వారి జీవన ప్రమాణాలను పూర్తిగా ఛిన్నాభిన్నం చేస్తుంది. ప్రైమరీ, సెకండరీ వైద్య వ్యవస్థలలో నూటికి డెబ్భై శాతం జబ్బులకు సులభంగా, తక్కువ ఖర్చుతో, తక్కువ వైద్య సహాయం, సరైన ప్రివెంటివ్ మెజర్స్‌తో కూడిన చికిత్స దొరుకుతుంది. కానీ అవే జబ్బులు నిర్లక్ష్యానికి గురికావడంతో ప్రజా ఆరోగ్యానికి సంబంధించిన అన్ని సూచికలూ దారుణంగా పతనం చెందుతాయి. ఐతే ఇక్కడ మనం గమనించవలసినది మెజారిటీ ప్రజలకు వచ్చే మెజారిటీ జబ్బులకు సంబంధించిన విషయాలపై చర్చ జరగకుండా, నిధుల కేటాయింపులు జరగకుండా చాలా తక్కువ మందికి వచ్చే టెర్షియరీ కేర్‌కి సంబంధించిన జబ్బులపై మాత్రమే చర్చలు జరగడం, నిధులు వాటికే కేటాయించడం చూస్తున్నాం. ప్రైవేటు ఆసుపత్రులు, వాటిల్లో జరిగే చికిత్సలు, దానికి సంబంధించిన ఖర్చులు వీటిపైనే దాదాపు మన తెలంగాణా పౌరసమాజం తీవ్రమైన చర్చలు చేస్తుండటం కనిపిస్తుంది. ఉదాహరణకు స్త్రీలలో ఐరన్ డెఫిషియన్సీ అనేది చాలా తీవ్రంగా చాలా ఎక్కువగా వ్యాప్తి చెందిన సమస్య. దానిని నివారించేందుకు తగిన ఎవేర్‌నెస్‌గానీ, దానిపై చర్చగానీ దాదాపుగా లేకపోవడం గమనించవచ్చు. ప్రభుత్వ ఫోకస్ కానీ సివిల్ సొసైటీ ఫోకస్ గానీ ఈ మెజారిటీ ప్రజల్లో ఉండే జబ్బులపైకి మరల్చవలసిన అవసరం ఉంది. ‘1000- డేస్ విండో పీరియడ్’ అనే అంశం కింద గర్భిణీ స్త్రీ గర్భం దాల్చిన సమయం నుండి బిడ్డ పుట్టిన రెండవ పుట్టినరోజు వరకు గల వేయి రోజుల పాటు తల్లీబిడ్డల సంరక్షణను, పోషణనూ, న్యూట్రీషన్‌నూ ప్రభుత్వాలు పకడ్బందీగా చేయగలిగితే గర్భిణీ స్త్రీలలో ఇన్ఫెక్షన్లను రక్తహీనతను సరిచేస్తూ, పుట్టిన బిడ్డకు ఇన్ఫెక్షన్లు సోకకుండా కావలసిన వాక్సిన్లను సకాలంలో అందించగలిగితే… ప్రధానమైన పబ్లిక్ హెల్త్ ఇండికేటర్స్ ఐన మాతాశిశు మరణాలను సమర్థవంతంగా అరికట్టవచ్చు. అంతేకాకుండా పుట్టిన బిడ్డ, భవిష్యత్తులో శారీరకంగా మానసికంగా ఆరోగ్యవంతమైనదిగా, సరైన మెదడు అభివద్ధి జరిగి, తరచూ ఇన్ఫెక్షన్ల బారిన పడని తరంగా ముందుకు వచ్చే అవకాశముంది. దీనిమీద కావలసినంత ప్రచారం గానీ, అవగాహనగానీ మనకు ఎక్కడా కనబడదు.
అలాగే అడాలసెంట్ గర్ల్‌చైల్డ్ హెల్త్ విషయంగానీ, జనరల్ లైఫ్‌స్టైల్‌లో మార్పులవలన వస్తున్న కొత్త జబ్బుల విషయంగానీ ప్రజా సామాన్యంలో అవగాహన పెంచడానికి చర్యలు తీసుకోవాలి. దీనికి సంబంధించిన పాలసీలను విధివిధానాలను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేసుకుని పౌరసమాజాన్ని జాగత పరిచి ఇందులో పాల్గొనేలా చేయాలి. ఫుడ్ సెక్యూరిటీ వచ్చాక కావలసినంత కెలోరీలు లభించి ఆకలి బాధలు తగ్గినాగానీ మైక్రోన్యూట్రియంట్స్ డెఫిషియన్సీని అడ్రస్ చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి ఫుడ్ సెక్యూరిటీ తోపాటు న్యూట్రిషనల్ సెక్యూరిటీ కూడా ప్రధానాంశంగా కావాలి. ఐతే ఇది సాధించాలంటే సేఫ్ డ్రింకింగ్ వాటర్ (రక్షిత మంచినీటి వ్యవస్థలు) సైంటిఫిక్ ఆధారాలతో పనిచేయవలసి ఉంటుంది. ఫుడ్, వాటర్, న్యూట్రిషనల్ సెక్యూరిటీ కనుక సాధించగలిగితే జనసామాన్యులను ఇబ్బంది పెట్టే చాలా జబ్బులను అసలు రాకుండానే అరికట్టగలుగుతాం. వివిధ ఆరోగ్య సంస్థలు చెబుతున్నట్టు ఎఫ్.ఎన్.హెచ్. వాష్ గోల్స్ ని సాధించవలసి ఉంది. ఫుడ్, న్యూట్రిషన్, హెల్త్, వాటర్, ఎయిర్, శానిటేషన్, హైజీన్… ఈ అన్ని విభాగాల్లో అభివద్ధి, పారదర్శకత పెరిగి ఆరోగ్యకరంగా మారినప్పుడు, సామాజికంగా చాలా మటుకు ఆరోగ్య సూచికలు క్వాలిటేటివ్‌గా మారతాయి. ఈరోజుకీ ఆహారం, నీటి కంటామినేషన్ వలన మనకు రోగాలు వస్తున్నాయి. ఆహారం, నీటి ద్వారా వచ్చే వ్యాధులతో ప్రతీ సంవత్సరం ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఈ మధ్య కాలంలో హోటల్స్ పై జరిగిన ఆకస్మిక తనిఖీల్లో ప్రమాదకరమైన ధోరణులు బయటపడ్డాయి. ఏ మాత్రం ఆరోగ్యానికి మేలుచేయని కంటామినేటెడ్ ఆహారంతో వేల కోట్ల బిజినెస్ విచ్చలవిడిగా జరుగుతున్నా, కంటితుడుపు చర్యలే కనపడుతున్నాయి. పూర్తిగా ప్రజారోగ్యాన్నే ప్రశ్నార్థకంగా మార్చి, ఆహారం తిన్న పాపానికి అకారణంగా మరణించే ఇలాంటి అమానవీయ ఘటనలపై పూర్తి స్థాయి నియంత్రణ ఈరోజుకీ తీసుకోలేక పోవడం, కారకులకు ఎలాంటి శిక్షలూ లేకపోవడం దేనిని సూచిస్తుందో గమనించండి. ప్రభుత్వం సరఫరా చేసే నల్లా నీళ్ళు తాగి చిన్నారులు విషజ్వరాల బారిన పడుతున్నారంటే పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో చూడండి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను ఈనాటికీ పటిష్టపరిచే దాఖలాలు లేకపోవడంతో చిన్న వర్షం పడితేనే అతిసారా వంటి విషజ్వరాలు, దోమకాటు వలన ప్రబలే డెంగ్యూ, మలేరియా వంటి ప్రాణాంతక జబ్బులు ముసురుకుంటున్నాయంటే మన ప్రజా వైద్య వ్యవస్థలో నీరు, సానిటేషన్ల పాత్ర ఎంత వుందో, అవి ఎంత నిర్లక్ష్యానికి గురయ్యాయో తెలుస్తుంది. ఇండిస్టియల్ వేస్టేజ్ ట్రీట్మెంట్‌లో లోపాల వలన హెవీ మెటల్స్, అగ్రికల్చరల్ రన్ ఆఫ్ వలన పెస్టిసైడ్స్ వంటివి తాగే నీళ్ళలో కలుస్తున్నా ఎక్కడా వీటిపై మోతాదులను లెక్కించి ప్రజలముందు పారదర్శకంగా ఆ సమాచారాన్ని ఇవ్వడం లేదు. దీంతో నిజంగా మనం నీళ్ళే తాగుతున్నామా లేక విషమే తాగుతున్నామా తెలియని స్థితి. వీటిపై ఎక్కడా చర్చే లేకుండా టెర్షియరీ కేర్ సెంటర్లలో అద్భుతంగా ఆరోగ్యం లభిస్తుందని గొప్పలు చెప్పుకోవడం వలన ఏమిటి ప్రయోజనం? కనీసం ఎలక్షన్లలో ప్రజల ప్రాథామ్యాలు ఈనాటికీ కులం మతం వంటి భావోద్వేగాలే తప్ప తమకూ తమ ముందు తరాల వారి ఆరోగ్యకర జీవితాన్ని ప్రశ్నార్థకంగా మారే అనారోగ్య ధోరణులను నిర్ద్వంద్వంగా ప్రశ్నించలేకపోవడం మన తుప్పు పట్టిన రాజకీయ చైతన్యాన్ని సూచిస్తుంది. అభివద్ధి చెందిన దేశాల్లో చాలా సీరియస్‌గా తీసుకునే ఇలాంటి అంశాలు మన దగ్గర చాలా తేలికైన అంశాలుగా, అంతగా పట్టించుకోవలసిన అవసరం లేని అంశాలుగా మారడంతో రాజకీయ వ్యవస్థలు కూడా చూసీ చూడనట్టు కాలం వెళ్ళ దీస్తున్నాయి. అభివద్ధి చెందిన దేశాల్లో ప్రజారోగ్యాన్ని భంగపరిచే అంశాలను చాలా సీరియస్ నేరాలుగా పరిగణిస్తారు. ఫుడ్ అడల్టరేషన్ చేసి, ఋజువైతే శిక్షలు కఠినంగా ఉంటాయి. చట్టాలు పకడ్బందీగా ఉంటాయి. వాటితో పోల్చుకుంటే మనం చాలా వెనకబడి ఉంటామని చెప్పక తప్పదు.
మారుతున్న జీవన పరిస్థితులు కొత్త రకాలైన జబ్బులను కలిగిస్తున్న తరుణంలో అవగాహన పెంచే దిశగా ప్రభుత్వమూ, పౌరసమాజాలూ కషి చేయాలి. వాయు కాలుష్యం, వాతావరణ మార్పులు రాబోయే కాలంలో తీవ్రమైన సమస్యలుగా మారబోతున్నాయి. న్యూలీ ఎమర్జింగ్ వైరసెస్ రూపంలో భవిష్యత్తులో మరిన్ని పాండెమిక్‌లు రాబోతున్నాయి.
పొగతాగడం, మద్యం సేవించడంతో పాటు ఇపుడు కొత్తగా డ్రగ్స్ బారిన పడటం వంటివి ప్రజారోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేయబోతున్నాయి. వీటన్నింటినీ ఎదుర్కోవడానికి మన ప్రభుత్వాల సన్నద్ధత ఏంటో తెలియదు. యాభై శాతం భారతీయులు శారీరక శ్రమలేక గుండెజబ్బుల బారిన పడుతున్నారని డబ్ల్యుహెచ్‌ఒ హెచ్చరిస్తుంది. ప్రభుత్వాలు మార్నింగ్ వాక్ పైన రెగ్యులర్ ఎక్సర్‌సైజులపైన ఎలాంటి గైడ్‌లైన్స్‌ని విడుదల చేయడం లేదు. ప్రభుత్వం ఎందుకు చేయాలి అనే అనుమానం రావొచ్చు. మనం గుర్తించుకోవలసినది ప్రజారోగ్యం ప్రభుత్వ బాధ్యతే. డాక్టర్లు, ప్రైవేటు వ్యక్తులు అవగాహన కల్పించడం వేరు. ప్రభుత్వమే పూనుకుని అవగాహన కల్పించడం వేరు. గతంలో ఎయిడ్స్‌పై, క్షయవ్యాధి చికిత్స ‘డాట్స్’ పై ప్రభుత్వాలు చూపిన చొరవ చాలా మంచి ఫలితాలను ఇచ్చింది. ఇపుడు ప్రభుత్వాలే అవగాహనను కల్పించే బాధ్యతను తప్పక తీసుకోవాలి. ఫిజికల్ ఫిట్నెస్ వ్యాయామం వంటి వాటిపై ఎలాంటి అవగాహననూ కలిగించడం లేదు. స్కూలు కర్రికులంలో ఫిజికల్ ఎడ్యుకేషన్‌కి పీరియడ్ కానీ, ఫిజికల్ ఎడ్యుకేషన్ మీద ఫైనల్ ప్రాక్టికల్ ఎక్జాం కానీ పెట్టడం లేదు. ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఒక సబ్జెక్టుగా, థియరీ ప్రాక్టికల్ లాగా పరీక్షల్లో భాగం ఐతే రాబోయే భావి భారత పౌరులు బలంగా వుంటారనడంలో ఎలాంటి అనుమానమూ లేదు. ర్యాంకుల పందెంలో పరుగులిడుతున్న పాఠశాలలకు ఫిజికల్ ఎడ్యుకేషన్‌తో ఎలాంటి సంబంధమూ లేదు. అసలు చాలా స్కూళ్ళకు ఆటలు లేవు. ఆడుకునే గ్రౌండూ లేదు. చైనా, జపాన్ దేశాల్లోలాగా మన ప్రభుత్వం కూడా ఫిజికల్ ఎడ్యుకేషన్‌కి ప్రాధాన్యతనిస్తే ఆరోగ్యవంతమైన చురుకైన బలిష్టమైన తరం తయారవుతుంది. లేకపోతే భవిష్యత్తులో మరిన్ని జబ్బులు పెరిగేదే ఉంటుంది తప్ప తరగేదేమీ ఉండదు. అలాగే పిల్లల్లో పరిశుభ్రత కి సంబంధించిన అవగాహన పెంచడం ద్వారా ఎన్నో అంటువ్యాధులు అరికట్టవచ్చు. ఇలాంటివి స్కూలు కర్రికులంలో భాగం కావాలి.
జిల్లా వైద్యారోగ్య శాఖలు సైతం వైద్యం మీద చూపిన శ్రద్ధ ఆరోగ్యం మీద చూపడం లేదేమో అనిపిస్తుంది. ఆరోగ్యంగా ఉండేందుకు కావలసిన అంశాలకంటే అనారోగ్యం కలిగాక తీసుకోవలసిన చికిత్సలు, మందులపైనే దష్టి పెడుతున్నారు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్, ఆరోగ్యమే మహాభాగ్యము వంటి స్లోగన్‌లు గోడల మీది రాతలుగా మాత్రమే మిగిలిపోతున్నాయి తప్ప వీటినే తమ తుది లక్ష్యాలుగా చేసుకుని సాగడం లేదు. రోగం వచ్చిన తర్వాత చికిత్సకంటే రోగం రాకముందే ఆరోగ్యంగా ఉండటానికి చేయవలసిన పనులు గురించి ఆలోచించాలి. పబ్లిక్ హెల్త్ కి సంబంధించిన సూచీలని నెలవారిగా రిలీజ్ చేసి పబ్లిక్ డొమైన్‌లో చర్చకు పెట్టాలి. ఇన్‌ఫాంట్ మోర్టాలిటీ రేట్, మెటర్నల్ మోర్టాలిటీ రేట్, అండర్ 5 మోర్టాలిటీ రేట్, వాక్సినేషన్ కవరేజ్, న్యూట్రిషనల్ స్టేటస్, ఎయిర్ క్వాలిటీ అండ్ వాటర్ క్వాలిటీ, డేటా ఆఫ్ స్మోకింగ్, ఆల్కహాల్ ఎడిక్షన్, ఫిజికల్ యాక్టివిటీ డైట్… వంటి ఎన్నో సూచికలను జిల్లాలవారీగా ప్రతినెలా విడుదల చేయాలి. అప్పుడే వీటిపై చర్చ జరుగుతుంది. అవగాహన పెరుగుతుంది. ఇవే ఎలక్షన్ల మ్యానిఫెస్టోలుగా మారినరోజు ఈ అన్ని ఇండికేటర్స్ గుణాత్మకంగా అభివద్ధి చెందుతాయి. పబ్లిక్ హెల్త్ కీ, పాఠశాల విద్యకీ ఎలా అవినాభావ సంబంధం ఉందో గమనించి దీనిని అలక్ష్యం చేయకూడదు.
‘థింక్ గ్లోబల్లీ అండ్ యాక్ట్ లోకల్లీ’ అనేది మెడికల్ సిస్టంకి సరిగ్గా సరిపోతుంది. ఇక్కడ మన తెలంగాణాలో మార్పు తేవడం ద్వారా ప్రపంచాన్ని భయపెడుతున్న ఎన్నో గ్లోబల్ సమస్యలను పరిష్కరించుకోవచ్చు. అంతేకాకుండా ప్రపంచంతో నిరంతరం అనుసంధానం చేసుకోవడంవలన మార్పులను ఎప్పటికప్పుడు బేరీజు చేసుకోవచ్చు. చిన్న రాష్ట్రం కనుక కొత్తగా ఆలోచించే అధికార యంత్రాంగం పూనుకుంటే చాలా త్వరితగతిన అభివద్ధి చెంది దేశానికే రోల్ మోడల్‌గా మారొచ్చు. చికిత్సలకూ మందులకూ కేటాయిస్తున్న నిధులకంటే అసలు ఆనారోగ్యమే కలుగని వాతావరణాన్ని సష్టించుకోడానికి, నివారణ చర్యలకు బడ్జెట్ కేటాయింపులు పెంచాలి. సూపర్ స్పెషాలిటీ రోగాలకు సంబంధించిన చికిత్సకు బడ్జెట్ కేటాయింపులు ఎలా ఉన్నా పబ్లిక్ హెల్త్‌కి, కీలకమైన ప్రైమరీ హెల్త్ కేర్‌ని నిర్లక్ష్యం చేయకుండా మరింత పటిష్టపరుచుకునే దిశగా నిధులు కేటాయింపులుండాలి. డాక్టర్లు, సిస్టర్ల కొరతనూ ఒకవైపు తీరుస్తూ మరోవైపు పేషెంట్ డాటాను క్రిప్టోగ్రాఫిక్ టెక్నిక్ ద్వారా భద్రపరిచి పేషెంట్‌కీ, డాక్టర్‌కీ ఫార్మసిస్టుకి అందరికీ అందుబాటులో ఉంచగలిగే బ్లాక్ చైన్ టెక్నాలజీ వంటి డాటా సెంట్రలైజేషన్ పద్ధతులను రాష్ట్రంలో తేగలగాలి. హెల్త్ అవేర్నెస్‌లో డాక్టర్లను కూడా భాగస్వామ్యం చేయాలి. ప్రతి సంవత్సరం డాక్టర్ల రోజును పురస్కరించుకుని హెల్త్ ఇన్‌డిసీస్ (సూచీ)ని పునః సమీక్షించుకోవడం ద్వారా మన పురోగతిని అంచనా వేసే వ్యవస్థలు ఏర్పడాలి. ముఖ్యంగా ప్రజారోగ్యానికి సంబంధించిన చర్చను కీలకమైన ప్రివెన్షన్ వైపు తిప్పగలిగితే త్వరితగతిన మార్పు వస్తుంది. ప్రజారోగ్యం ఒక్క డాక్టర్ల పనో పౌరసమాజం పనో కాదు. ప్రభుత్వాలు, విద్యారంగం, సానిటేషన్ విభాగం, పోలీసు వ్యవస్థ, పౌరసరఫరాలు, కాలుష్య నివారణ వంటి ఎన్నో వ్యవస్థల మూకుమ్మడి కషి. దానితో పాటు పాలనలో పూర్తి పారదర్శకతతోనే సాధ్యమౌతుంది. మన రాష్ట్రం ఈ వైపుగా అడుగులు వెయ్యడం తక్షణ కర్తవ్యం.
– విరించి విరివింటి
9948616191
జాతీయ వైద్యుల దినోత్సవం
తల్లిదండ్రులు ఒకేసారి జన్మనిస్తారు
వైద్యులు జీవితాంతం ఆరోగ్యాన్నిస్తూ ఉంటారు.
మందులు ఆరోగ్యాన్ని ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు
వైద్యుడు కచ్చితంగా భరోసాతో ఊపిరిపోస్తాడు
సాటి మనిషిని ఆరోగ్యవంతుడిని చేయడమే
భగవంతుడిగా రూపాంతరం వైద్యునికే అది సాధ్యం
– తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి,
8008 577 834