న్యూస్‌క్లిక్‌ పారదర్శకం

NewsClick is transparent– అమెరికన్‌ సంస్థ డబ్ల్యూఎంహెచ్‌ స్పష్టం
న్యూఢిల్లీ : న్యూస్‌క్లిక్‌లో పెట్టుబడులు, లావాదేవీల న్నీ చట్టబద్ధంగా, పారదర్శకంగా ఉన్నాయని అమెరికన్‌ సంస్థ వరల్డ్‌వైడ్‌ మీడియా హౌల్డింగ్స్‌ (డబ్ల్యూఎంహెచ్‌) పేర్కొంది. డబ్ల్యూఎంహెచ్‌ని పీపుల్స్‌ సపోర్ట్‌ ఫౌండేషన్‌ నియంత్రిస్తుంది. పీపుల్‌-సెంట్రిక్‌ జర్నలిజాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో న్యూస్‌క్లిక్‌లో పెట్టుబడులు పెట్టినట్లు డబ్ల్యూఎంహెచ్‌ మేనేజర్‌, అమెరికన్‌ లాయర్‌ జాసన్‌ ఫెచర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. న్యూస్‌క్లిక్‌ జర్నలిజం శైలిపై ఆసక్తి కనబరిచిన తర్వాత 2017లో పెట్టుబడి ప్రక్రియ ప్రారంభమైందని ఫెచర్‌ వివరించారు. న్యూస్‌క్లిక్‌ ఎడిటర్‌ ప్రబీర్‌ పుర్కాయస్తా ‘ఆలోచనలు’తో ఏకీభవిస్తున్నామనీ, ఆయనతో చర్చించామని అన్నారు. ఒక సంవత్సరం పాటు సంప్రదింపులు, నియంత్రణ ప్రక్రియ తరువాత, పెట్టుబడిదారులు చివరకు అంగీకరించారని అన్నారు. న్యూస్‌క్లిక్‌కు మీడియా పనిపై ఎలాంటి సలహా ఇవ్వలేదని పేర్కొన్నారు. 2021లో ఈడీ, డీఆర్‌ఐ, ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల దర్యాప్తు విభాగం న్యూస్‌క్లిక్‌ పై దాడులు నిర్వహించాయనీ, ఈ ఏజెన్సీలు కోరిన విధంగా డబ్ల్యూఎంహెచ్‌ పెట్టుబడి సమాచారాన్ని అందించిందని తెలిపారు. డబ్ల్యూఎంహెచ్‌ ఏ రాజకీయ పార్టీ, ప్రభుత్వం, వారి ప్రతినిధుల నుంచి ఎటువంటి డబ్బును స్వీకరించలేదని తెలిపారు. ఇప్పుడు ‘న్యూయార్క్‌ టైమ్స్‌’ ప్రచురించిన తప్పుడు కథనం ఆధారంగా అమాయకులను అరెస్టు చేశారని విమర్శించారు. భారతదేశ చట్టం ప్రకారం దేశంలో విదేశీ పెట్టుబడులు పెట్టడం సురక్షితమేనా? అనే ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నమవుతోందని పేర్కొన్నారు.