– ఉద్యోగుల సమస్య పరిష్కారం కోసం….
– ఆగస్టు 10 నుంచి సమ్మె : ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.నరసింహ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) పథకంలో పని చేస్తున్న కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 10 నుంచి సమ్మె చేయనున్నట్టు ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.నరసింహ తెలిపారు. బుధవారం హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లోని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యాలయంలో ఎన్ హెచ్‌ఎం స్కీం కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల యూనియన్ రాష్ట్ర జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమా రాజేష్ కన్నా అధ్యక్షత వహించారు. ఈ సందర్బంగా నరసింహ మాట్లాడుతూ ఎన్‌హెచ్‌ఎంలో పని చేస్తున్న మెడికల్ ఆఫీసర్లు, స్టాఫ్ నర్సులు, ఫార్మాసిస్టులు తదితర కేడర్ల సర్వీసులను క్రమబద్ధీకరించాలనీ, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. వారి పట్ల ప్రభుత్వం కాంట్రాక్టు నిబంధనలను సరిగా పాటించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో యూనియన్ నాయకులు ఎస్.రేవతి, సునీత తదితరులు పాల్గొన్నారు.