జమ్మూకాశ్మీర్ : జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) శుక్రవారం జమ్మూకాశ్మీర్‌లోని రాజౌరి, రియాసి జిల్లాల్లోని ఏడు ప్రదేశాల్లో సోదాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఏడాది జూన్ 9వ తేదీన రియాసి జిల్లాలో పౌని ప్రాంతంలోని టెర్యాత్ గ్రామ సమీపంలో శివఖోరి దేవాలయం నుండి కత్రాకు వెళుతున్న బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో బస్సు లోయలో పడింది. ఈ ఘటనలో తొమ్మిది మంది చనిపోయారు. 41 మంది గాయాలపాలయ్యారు. చనిపోయిన వారిలో రాజస్థాన్‌కు చెందిన రెండేళ్ల చిన్నారి, ఉత్తరప్రదేశ్‌కు చెందిన 14 ఏళ్ల కుర్రాడు ఉన్నారు. ఇక ఈ ఘటనపై జూన్ 17వ తేదీన హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ ఈ కేసును ఎన్‌ఐకి అప్పగించింది. ఈ కేసుకు సంబంధించి శుక్రవారం ఎన్‌ఐఎ సోదాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాగా, రాజౌరి చెందిన హకామ్ ఖాన్ అనే వ్యక్తి బస్సుపై దాడి చేసేముందు ఉగ్రవాదులకు ఆహారం, ఆశ్రయం, వారికి అవసరమైన వస్తువులను అందించారు. దీంతో ఆ వ్యక్తిని అరెస్టు చేశారు.