‘ఎవరూ వినకుంటేనేం, నాకు నేను చెప్పుకుంటా.. ఎవరూ ఓదార్చకపోతేనేం నాకు నేను కుదుటపడతా. నన్నునేను ఓదార్చుకుంటా’ అనుకుంటూ ఆ గుడిలోకి ప్రవేశించింది స్మైలీ.. ‘అపరాధభావం నన్ను తొలచివేస్తోంది. పదేపదే అదే జ్ఞాపకం నన్ను వెంటాడుతోంది. నా ఆత్మక్షోభ తొలగించి మనసుకు ప్రశాంతత ఇవ్వు స్వామీ’ అని వేడుకుంటూ కోనేరు వైపు అడుగేస్తోంది. మైకులోనుంచి భక్తి పాటలు మంద్రస్థాయిలో వినవస్తున్నాయి. కోనేటిఒడ్డున వరుసగా కొబ్బరి చెట్లు, పెద్ద మారేడుచెట్టు ఆనీళ్ళలో తమముఖాలు చూసుకుంటున్నట్టుగా ఉంది. కొబ్బరి చెట్లమీద కోతులు గెలలకు వేళాడబడుతూ అటుఇటు గెంతుతున్నాయి. కోనేటి ఒడ్డున కూలబడింది.
ఆకాశమూ, కొబ్బరిచెట్లు, మారేడుచెట్టు, గూళ్ళకు చేరేందుకు అడపాదడపా ఎగురుతున్న పక్షులతోపాటు ఆ కోనేటిలో తన ముఖమూ కనబడతోంది.
నోరు విప్పబోయింది. ఇంతలో కొబ్బరిచెట్టు నుంచి కొబ్బరికాయ అమాంతం కోనేటినీళ్లలో దబ్బుమని పడి కొనేరు పెద్దశబ్దంతో చెల్లాచెదురయ్యింది. నీళ్లు సుడులుసుడులుగా మారగానే అప్పటివరకూ ఉన్న ప్రశాంతతతో పాటు ఆమె రూపమూ ఆ నీళ్ల చిందరవందరలో కొట్టుకుపోయింది. కోనేరు కకావికలం కావటంతో ‘V్‌ా్మ్మ… ఇది ఎప్పటికి కుదుటపడుతుందో నా మనసులా’ అని నిట్టూరుస్తూ అక్కడినుంచి లేచి ఇంటికి బయలుదేరింది.
‘ఈ డబ్బును చేర్చాల్సిన చోటుకు చేరిస్తే బాగు.. ఆ మనిషి కనపడితే బాగు. ఇంతకూ తనపేరేంటో, ఊరేంటో… కనపడితే గుర్తుపడతానా? రోజూ ఎంతమందిని చూస్తుంటాను? ఎందరిదగ్గరో చేతులు చాస్తుంటాను.. ఏ ముఖమని గుర్తుపెట్టుకుంటాను. పోనీ తనన్నా నన్ను గుర్తుపడితే బాగు’ జాకెట్టులో దాచుకున్న తొంభరు రూపాయలను తడుముకుంటూ నడుస్తోంది. అలా ఆలోచిస్తుండగానే తన గమ్యస్థానం వచ్చేసింది. స్మైలీతోపాటు, సోనీ, రాణీ, బేబీ, శమా, సుధా, ఇలా ఇరవై మందివరకు అమ్మాయిలు వరుసగా వస్తూ ఆరోజు తాము సంపాదించిన డబ్బును తమగురువు రంగూబాయికి అప్పగిస్తున్నారు. ఆమె వాటిని తీసుకుంటూ లెక్కపెట్టకుండానే బ్యాగులో వేసుకుంటోంది. స్మైలీ తన డబ్బును అందించగానే ‘తొంభయ్యో, వందో తగ్గినట్టున్నాయే’ అంది. స్మైలీకి గుండెల్లో రాయిపడ్డట్టయ్యింది. ఏం చెప్పాలో అర్థంకాక కంగారుపడుతూ ఏదో అనబోతుండగా ‘ఫర్వా నై.. కలెక్షన్ పెరుగుతుందిలే’ అని రంగూబాయి అనటంతో ఊపిరిపీల్చుకుంది.
వాళ్ళంతా అందంలో పోటీపడుతున్నారు కానీ, వాళ్లు అమ్మాయిల్లా మారిన అబ్బాయిలు. సిటీలో ట్రాన్స్‌జెండర్ల అడ్డా అది. మగశరీరాల్లో సతమతమవుతున్న వాళ్లను చేరదీసి ఆశ్రయమిచ్చింది ఆమె. వెకిలిమాటల, వేధింపుల సమాజం నుంచి రక్షిస్తూ తన కన్నపిల్లల్లా చూసుకుంటోంది. వాళ్ళ దేహయాతన తప్పించేందుకు వాళ్ల అభీష్టం మేరకు ట్రాన్స్‌జెండర్ ఆపరేషన్లను చేయించింది. ఇందుకు అవసరమైన లక్షల రూపాయలను తనే పెట్టుబడిగా పెట్టింది. నాలుగేళ్ళ క్రితం ఆమె శిబిరంలోకి చేరింది స్మైలీ ఉరఫ్ సమీర్. ముంబాయిలో ట్రాన్స్ జెండర్ ఆపరేషన్ వికటించటంతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యింది. దాదాపు నాలుగేళ్ళ పాటు అక్కడే ఉండి చికిత్స పొందింది. ఇటీవలే అనారోగ్యం నుంచి కోలుకొని సిటీకి వచ్చింది.
ఇక రోడ్డెక్కుతాను అనుకున్నాక ఒకరోజు ‘అమ్మా.. నేను నీకోక మాట చెప్పాలి’ అని తన బాధమూట విప్పబోతుండగా ‘వూం.. ఈ యవ్వారాలు తర్వాత.. ఈరోజు నువ్వు లైన్ మీదకు వెళ్లాలి. ఇప్పటికే నాలుగేళ్ళ దాకా నష్టపోయావు’ అంటూ మరొక ట్రాన్స్‌జెండర్ వైపు వెళ్ళింది. ‘అదికాదే’ అంటూ తోటి ట్రాన్స్‌జెండర్ మైనాకు చెబుదామని ప్రయత్నిస్తుంటే ‘ఇదంతా అమ్మచలువే, మనల్ని ముంబాయి పంపి ఆపరేషన్ చేయించింది. ఆమె పెట్టుబడి పెట్టకపోతే ఇంకా వెలివేతలకు గురౌతూనే ఉండేవాళ్ళం, ట్రాన్స్‌జెండర్‌గా మారకుండానే చీర జాకెట్టు ధరించి భయం భయంగా అడుక్కుంటుండేవాళ్లం’ అంది, ఆమె చెప్పాలనుకున్న దాన్ని వినిపించుకోకుండా.
ఆరోజు ఆసుపత్రిలో ఆపరేషన్ చేసిన డాక్టర్‌కు చెబుదామని ప్రయత్నించినపుడు ‘ష్.. నోరు తెరవద్దు. కొన్నిరోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే కుట్లు పిగిలే ప్రమాదం ఉంది’ అని నోరు మూయించింది. ఆ మరుసటిరోజు అక్కడ సేవలందించే నర్స్‌కు చెబుదామని నోరుతెరవగానే ‘ముఝే తెలుగు నహీ సంఝాతే, అయాం సారీ’ అంటూ అక్కడినుంచి వెళ్ళిపోయింది. ఆమె అలా ఆలోచిస్తుంటే ‘ఎరు.. డబ్బేమన్నా ఉందా’ అని అంతలో తన జాకెట్ వైపుచూస్తూ కన్నుగీటుతూ అడిగింది తోటి ట్రాన్స్ సుధా. తను అలా అనుమానంగా చూస్తూ అడుగుతుంటే మరోసారి కంగారు పడుతోంది. ‘తొంభరు, వంద ఏమన్నా దాచావా’ అంది. ఈసారి ఆమెకు వణుకు మొదలయ్యింది. చెమటలు పడుతుండటాన్ని గమనించి ‘అరేయార్.. అలా కంగారు పడతావేం. ఇందాక అమ్మ అన్నది విన్నాలే, అందుకే అలా జోక్ చేశా’ అంటూ అక్కడినుంచి వెళ్ళిపోయింది సుధ.
అప్పుడు గానీ ఆమెకు గుండెదడ తగ్గలేదు. ఏరోజుకారోజు వచ్చిన డబ్బంతా గురువుకు ముట్టజెప్పాలి. కానీ ఆరోజు సంపాదనలో తొంభరు రూపాయలు తీసి జాకెట్‌లో దాచుకుంది. ఆ విషయం బయటపడుతుందేమోనని భయపడుతోంది.
ఆఫీసుకు రెడీ అవుతున్నాడు నవీన్. గోడకు తగిలించిన ఫొటో చూడగానే.. గతంలో జరిగిన ఘటనగుర్తొచ్చింది. అప్పట్లో.. నవీన్ చదివిన చదువుకు ఉద్యోగం రాక, సంపాదనలేక అవస్థపడుతున్నాడు. అప్పుడే తన తల్లి అనారోగ్యానికి గురయ్యింది. ప్రైవేటు వైద్యం చేయించే స్థోమత లేకపోవటంతో ఆమెను గవర్నమెంటు ఆసుపత్రిలో చేర్చాడు. అక్కడ అన్నిరకాల మందులు లేకపోవటంతో డాక్టర్ కొన్ని టాబ్లెట్లను బయటనుంచి తెచ్చుకోమని రాశాడు. ‘రాసినవన్నీ ఒద్దు. రెండు రోజులకు తే చాలు’ అంది అతని తల్లి మంచంలో నీరసంగా మూలుగుతూ. ‘ఆ సరే’ అంటూ అతను అక్కడే నిలబడి ఉండటం చూసి.. పరిస్థితి అర్థం అయ్యింది ఆమెకు. కొడుకు దగ్గర చిల్లిగవ్వ కూడా లేదని గ్రహించి.. తన దగ్గర భద్రంగా దాచుకున్న వందనోటు తీసిచ్చింది.
‘నువ్వు బాధపడకు దీనికి ఎన్నొస్తే అన్నితే’ అంటూ అందించింది. ఆ నోటు తీసుకుంటున్నప్పుడు అతనికళ్ళల్లో నీళ్లుతిరిగాయి. తల్లికి కనీసం మందుబిళ్ళలు ఇప్పించలేని దుస్థితికి కుమిలిపోయాడు.
టాబ్లెట్లకోసం వెళ్తున్నప్పుడు ఒకట్రాన్స్ జెండర్ వెంటపడి డబ్బుకోసం వేధించాడు. తనదగ్గర చిల్లర లేదన్నా వినకుండా వత్తిడి చేస్తుండటంతో విసిగిపోయి పది తీసుకొని తొంభై ఇవ్వు అంటూ తన దగ్గరున్న వంద నోటిచ్చాడు. తను తొంభరు రూపాయలు వెనక్కు తెచ్చివ్వక పోవటంతో రెండుమూడు గంటలు అక్కడే ఎదురు చూశాడు. ఆతరువాత ఆసుపత్రికి వెళితే.. ‘ఇప్పటివరకు ఎక్కడికెళ్లావు బాబు, నీకోసం మీఅమ్మ కలవరించి కలవరించి ఎదురుచూసి చూసి కన్ను మూసిందయ్యా. కొంచెం ముందొచ్చినా చివరిక్షణాల్లో దగ్గర ఉండేవాడివి’ అని పక్కబెడ్ రోగులు, వాళ్ల బంధువులు అంటుంటే కుప్పకూలిపోతూ భోరున విలపించాడు. ఆ డబ్బుతో టాబ్లెట్లు కొని వేస్తే తల్లిరోగం తగ్గేదో కాదో, కానీ వెంటనే తిరిగి రాకపోవటం వల్ల తల్లిని కడసారి చూసుకునే భాగ్యం దక్కలేదని గుండెలవిసేలా రోధించాడు. అలా ఆలోచిస్తూ అతను ఈలోకంలోకి వచ్చాడు. తల్లి ఫొటోకు దండం పెట్టుకున్నాడు. ఈ పరిస్థితికి ఆ ట్రాన్స్ జెండరే కారణం అనుకుంటూ అతనికళ్లు ఎరుపెక్కాయి.
ఆ కూడలిలో నాలుగు రోడ్లున్నాయి. ట్రాఫిక్ సిగల్స్ ఒక్కోదారిలో ట్రాఫిక్‌ను ఆపుతూ కదిలిస్తూ క్రమబద్దీకరిస్తున్నాయి. స్మైలీ ఆరోజు కూడా అతన్ని వెతుకుతూ ‘ఈరోజు ఎలాగైనా అతను కనపడాలి’ అని అమ్మవారిని మనసులో మొక్కుతోంది. ఆరోజు రెండు బ్యాచ్‌లుగా విడిపోయి అడుక్కుంటుండటంతో తనూ మరొక ట్రాన్స్ వేరే సిగల్ వైపున్నారు. నవీన్ వెహికిల్ ఆగిఉన్న వైపు రెడ్‌సిగల్ కనుక అటువైపున్న వాళ్ళు అడుగుతున్నారు. తను ఉన్న వైపు గ్రీన్ సిగల్. కానీ మరో పదిసెకన్లలో రెడ్ సిగల్ పడబోతోంది. స్మైలీకి ఇంకా డబ్బు వసూలు కాలేదు. జాకెట్‌ను తడుముకుంటూ అటువైపు తమ వాళ్ళకు ఎలా వసూలవుతున్నాయో చూద్దామని తలతిప్పి ఆ సిగల్ వైపు చూసింది. వాళ్ళు రెండు వరుసలు దాటి మూడో వరుసలోకి ప్రవేశిస్తున్నారు.
అక్కడ ఆగి ఉన్న ట్రాఫిక్‌లో అతని ముఖాన్ని గుర్తుపట్టింది. ‘అన్నా’ అంటూ కేకేసింది. బండిమీద పెట్టిన హెల్మెట్‌ను నవీన్ అప్పుడే తలకు తగిలించుకుంటున్నాడు. ‘అన్నా’ అని చెయ్యెత్తి పిలుస్తూ అతనివైపు పరుగెత్తివస్తుండగా.. ఆమె ఉన్న వైపునుంచి ఒక టిప్పర్ రెడ్‌సిగల్ పడేలోగా వెళ్ళిపోవాలని స్పీడ్ పెంచి వస్తుంది. కళ్ళు మూసి తెరిచేలోగా రెడ్‌సిగల్ కు మారటంతో అతనిలో కంగారు ఎక్కువయ్యింది. పోలీసుల కంట పడతానేమోనన్న భయంతో మరింత స్పీడుపెంచాడు. అదే సమయంలో నవీన్ ఉన్న వైపు గ్రీన్ సిగల్ పడి వాహనాలు స్టార్ట్ కావటంతో అటుఇటు చూస్తూ ఆ కంగారులో స్మైలీని గుద్దేశాడు.
పెద్దగా అరుస్తూ కిందపడిపోయింది. ఆ కుదుపుకు జాకెట్లో దాచుకున్న నోట్లు బయటికొచ్చాయి. ‘తొంభరు రూపాయలున్నారు’ అని ఎవరో లెక్కపెడుతున్నారు. స్మైలీ తలపగిలి రక్తం వస్తోంది. దాన్ని ఆపుతూ కట్టుకట్టారు. స్మైలీ కొనఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. ఇంతలో మిగతావాళ్ళు పోగై ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్ళేందుకు ఆటోలో పడుకోబెట్టారు. ఆమె కళ్ళల్లో గతం ఆవరిస్తోంది.
ఆరోజే కొత్తగా రోడ్డెక్కాడు సమీర్. ఇంకా ట్రాన్స్‌జెండర్‌గా మారలేదు. మగ దుస్తుల్లోనే ఉన్నాడు. చప్పట్లు కొట్టటం కూడా సరిగా రావట్లేదు. కరోనాటైం కావటంతో లాక్‌డౌన్ సడలించిన ఆ కొద్దిసమయంలో తప్ప అడుక్కోవటానికి కుదరటం లేదు. అలా ఇబ్బంది పడుతున్నటైంలో ఒక యువకుడు అటువైపున్న మెడికల్ షాపువైపు నడిచి వస్తున్నాడు. సమీర్ అది గమనించి అతని వెంటపడుతూ చప్పట్లు కొడుతూ డబ్బు అడుగుతున్నాడు.. అతను ‘చిల్లర లేదు’ అంటున్నా వినిపించుకోవట్లేదు. ఎలాగైనా మొదటిసారి డబ్బు సాధించాలని గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. అలా చికాకు పరుస్తుండటంతో అతను ఆగి ‘ఇగో చిల్లర నోట్లులేవు. నాదగ్గర వంద ఉంది’ అంటూ తన చేతిలోని నోటును గాల్లో ఆడించాడు. ‘చిల్లర నేను తెచ్చిస్తా ఇవ్వండి’ అంటూ బతిమాలేసరికి అతను ఒకసెకను ఆలోచించి నిట్టూరుస్తూ ‘సరే పది తీసుకోని మిగతా తొంభరు రూపాయలు తెచ్చివ్వు’ అంటూ ఆ నోటును ఇవ్వగానే వేగంగా ఆ నోటును అందుకుంటూ అంతకంటే వేగంగా మూల మలుపులో ఉన్న సందులోకి పరుగు తీశాడు. సందులో కొంత దూరంలో తమకు తెలిసిన కిళ్ళీకొట్టు వద్దకు పరుగెత్తుతుండగా అక్కడ జనం గుమిగూడుతుండటం గమనించాడు. ‘కరోనా సమయంలో గుమిగూడుతుండటం ఏమిటి’ అనుకుంటూ అటు వెళ్ళాలనుకున్నా తనకు వందనోటు ఇచ్చిన ఆ యువకుడికి మిగతా తొంభరు రూపాయలు ఇచ్చేయాలని అనుకుని కిళ్ళీకొట్టు వద్దకు వెళ్ళాడు. కానీ అందులో షాపతను లేడు. అక్కడున్న ఇద్దరుముగ్గురిని ‘చిల్లర ఉందా’ అని అడిగింది. కానీ వాళ్లు లేవు అన్నారు. ఆ నోటును అందుకుంటే ఆ నోటు ద్వారా వైరస్ తమకు సోకుతుందని. లేదంటే చిల్లర ఇచ్చే సమయంలోనైనా చేతులు తాకి వైరస్ చేతులు మారుతుందని. అలా అడుగుతూ ఆ గుంపువద్దకు వెళ్ళి లోపలికి తొంగిచూశాడు. ఒక ట్రాన్స్‌జెండర్ కిందపడి ఉండటం గమనించాడు. ఆమెను ఎవరూ ముట్టుకోవటం లేదు, సమీర్ ఆమె దగ్గరకువెళ్ళి అక్కా అంటూ తట్టి లేపే యత్నం చేశాడు. పైకిలేపి పక్కనే ఉన్న ఆర్.ఎం.పి. వద్దకు తీసుకుపోగానే ఆర్.ఎం.పి. పరీక్షించి ఇంజెక్షన్ చేసి, ఒఆర్‌ఎస్ ప్యాకెట్ చింపి తాగించాడు. రెండు రకాల మందుబిళ్ళలు చేతికందించాడు. నీరసంగాఉంది. ఎండకు కళ్ళు తిరిగి పడిపోయింది. ఈ పూటకు రెస్టు తీసుకుంటే చాలు అన్నాడు. ఆ.. నా ఫీజ్ ఏమీవద్దు కానీ ఇంజెక్షన్‌కు, ఒఆర్‌ఎస్‌కు, టాబ్లెట్లకు ఇవ్వు చాలు… అనగానే తన దగ్గరున్న వందనోటును అందించాడు. ఆమె సాయంతో రంగూబాయి అడ్డాకు చేరాడు. ట్రాన్స్‌జెండర్‌గా మారాలనే ఆకాంక్షను వ్యక్తం చేస్తే ఆరునెలల తరువాత ముంబరు పంపి ఆపరేషన్ చేయించింది రంగుబాయి. కానీ ఆపరేషన్ వికటించటంతో నాలుగేళ్ళ పాటు అక్కడే మంచానికే పరిమితమై ఈమధ్యే పరిపూర్ణ స్త్రీ రూపం, వస్త్రధారణతో రోడ్డెక్కాడు. అప్పటినుంచి ఆమె కళ్ళు నవీన్ కోసం వెతుకుతూనే ఉన్నాయి. కళ్ళు బలవంతాన తెరిచే ప్రయత్నం చేస్తూ గతంనుంచి బయటకొస్తోంది స్మైలీ.
‘ఓస్.. తొంభరు రూపాయలకేనా ఇంత పశ్చాత్తాపం అనుకోకు. ముల్లు చిన్నదే, అది గుచ్చుకుంటే పెద్ద బాధ. అలాంటి ముళ్లు గుండెలో గుచ్చుకున్న బాధ నాది. చూడాల్సింది రూపాయల విలువను కాదు నమ్మకాన్ని నిలబెట్టుకోకపోవటం. మనం ఇచ్చిన మాట తప్పి, చేసిన వాగ్దానం మరిచి తేలిగ్గా తీసుకుంటే అది ఇతరులను కూడా నమ్మకుండా చేస్తుంది. మన ప్రవర్తనవల్ల ఆపద సమయంలో ఇతరులు సాయం పొందలేకపోతారు. అదీ నాబాధ.
ఎవరూ వినని, వినిపించుకోని మాట తనలో తాను చెప్పుకుంటోంది స్మైలీ. ఆసుపత్రి వచ్చినట్టుంది నడుస్తున్న ఆటో ఆగింది.
– కంచర్ల శ్రీనివాస్