సంసారం అంటే వట్టి ముచ్చట కాదు. ‘ఉప్పుతో తొమ్మిది పప్పుతో పది’ సమకూర్చుకోవాలి. ఇయ్యాల రేపు రెడీమేడ్‌గ అన్నీ దొరుకుతున్నయి గానీ ఒక కుటుంబం గడవాలంటే ఎనుకట అన్ని ఇచ్చంత్రాలు అన్నట్టు. సంసారి అంటె అన్ని సగ బెట్టుకోవాలె. అందుకే తిరుగాలె అంటరు. ‘సంసారి తిరిగి చెడిపోతడు సన్యాసి తిరుగక చెడిపోతడు’ అని. పొక్తగ సంసారం చేసుకునేటోనికి ఎటుపడితే జాతరలు, లగ్గాలు, సుట్టాల మార్గం ఎక్కువ తిరుగరాదు. ఎందుకంటే ఇంటి ముందట చార్రె బాయి కాడ గొడ్డు గోద ఉంటయి. అయితే సన్యాసికి ఏం లేదు. అతనకు తిరగడమే ఆనందం. అదే జీవితం. కొందరు తిరుగతరు. మల్ల ఎవల పనులు వాల్లు చేసుకుంటరు. అసొంటోల్లను ‘వానికి అవ్వ కావాలె బువ్వ కావాలె’ అంటరు. ఇసొంటోల్లె ఎక్కడన్న పని చేస్తె ఉషారుగుంటరు. వాల్లు ‘ఉప్పు ఏసి పొత్తు కూడుతరు’. ఉడికే కూరల ఇంత ఉప్పురవ్వ తెచ్చి వేసి ఇది ఇద్దరిది అంటరట. అమాయకంగ వుంటే ఈ కాలంల ఎవలు బతుకరు. అందుకే వీల్లను ‘ఏ మందల కట్టితే ఏంది మా దొడ్లె ఈనాలె’ అనేటోల్లు అంటరట. అంటే ఇక్కడ కట్టితే ప్రెగెసీ వాల్ల వాల్ల దూడకు వస్తే అన్నట్టు. ఈనుడు అంటే డెలివరి అవుడు మాత్రం వీల్ల దొడ్డిలో అయితే సంతోషం అన్నట్టు. ఇలాంటి వాల్లు ఊర్లల్ల అక్కడక్కడ వుంటరు. వీల్లు అప్పుడప్పుడు ‘అందితే జుట్టు లేకుంటే కాళ్లు’ అన్నట్టు వ్యవహరిస్తరు. అందితే జుట్టు పట్టుకుని నిలదీస్తరు. లేదు తప్పు చేస్తే కాళ్లు పట్టుకుని క్షమాపణ కోరుతరు. లేదంటే ‘అందని ద్రాక్ష పుల్లగ’ అన్నట్టు కూడా వ్యవహరిస్తరు. ఏదైనా సాధ్యం కాకపోతే అది మంచిది కాదు, మనకు అవసరం లేదు అన్నట్టు వ్యవహరిస్తరు.
– అన్నవరం దేవేందర్, 9440763479