– గీతంలో ఘనంగా జాతీయ గణిత దినోత్సవం
– శ్రీనివాస రామానుజన్ కు ఘన నివాళి
నవ తెలంగాణ – పటాన్ చెరు
ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోగలిగే ఏకైక భాష గణితం అని, గణితం లేని ప్రదేశం లేదా జీవితం లేదని, అంతా గణితమయం అని ఎన్ఐటీ వరంగల్ గణిత శాస్త్ర ఆచార్యుడు ప్రొఫెసర్ వై.ఎన్.రెడ్డి అన్నారు. గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ లోని గణిత శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం జాతీయ గణిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రముఖ గణిత శాస్త్రజ్జుడు శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. వాస్తవానికి ఈనెల 22న ఈ కార్యక్రమాన్ని జరుపుకోవాలి, కానీ వరుస సెలవుల వల్ల రెండు రోజుల ముందే నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ వై.ఎన్.రెడ్డి ‘గణితం: నేర్చుకునే భాష’ అనే అంశంపై ఉపన్యసించారు. విశ్వజనులందరిలోకీ భారతీయులకి గణిత శాస్త్రంపై పట్టు అపారమని, దీనిని యువత గుర్తెరిగి, ఆ రంగంలో రాణించేందుకు యత్నించాలని పిలుపునిచ్చారు. గణితంపై పట్టు సాధిస్తే, ఎంతటి చిక్కు సమస్యనైనా సులువుగా పరిష్కరించవచ్చని, అందుకే భారతీయులు అత్యున్నత స్థానాలలో రాణిస్తున్నట్టు చెప్పారు. కేంద్రం ప్రభుత్వం ‘శకుంతల’ పథకం కింద గణితంలో బంగారు పతకం సాధించిన విద్యార్థినులకు నేరుగా పీహెచ్ డీ ప్రవేశాలు కల్పించడమే గాక, గౌరవ ఉపకార వేతనాన్ని కూడా అందజేసి, ప్రోత్సహిస్తున్నట్టు డాక్టర్ రెడ్డి తెలిపారు.గౌరవ అతిథిగా పాల్గొన్న ఐఐటీ హైదరాబాద్ గణితాచార్యుడు డాక్టర్ రాజేష్ కన్నా, ‘ఎలా లెక్కించాలి?’ అనే అంశంపై మనోహరమైన ఉపన్యాసంతో విద్యార్థులను ఆకట్టుకున్నారు. ప్రతి దానికీ పునాది గణితంపై ఆధారపడి ఉందని, అందువల్ల గణిత నేపథ్యం ఉన్నవారికి అపార ఉపాధి అవకాశాలున్నట్టు ఆయన చెప్పారు.గీతం సైన్స్ డీన్ ప్రొఫెసర్ కొల్లూరు శ్రీకృష్ణ వర్చువల్ గా కీలకోపన్యాసం చేస్తూ, యువతను గణితం వైపు ప్రేరేపించడంతో పాటు ఆయా సమస్యలను పరిష్కరించే నైపుణ్యాలను వారిలో పెంపొందించాలని సూచించారు.తొలుత, స్కూల్ ఆఫ్ సైన్స్ ఇన్ ఛార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ మోతహర్ రెజా అతిథులను స్వాగతిస్తూ, దైనందిన జీవితంలో గణిత శాస్త్రానికి ఉన్న ప్రాముఖ్యతను వివరించారు. బోర్డ్ ఆఫ్ స్టడీస్ సహాధ్యక్షుడు ప్రొఫెసర్ కె.మారుతీప్రసాద్ వందన సమర్పణ చేశారు. అధ్యాపకులు, విద్యార్థి సమన్వయకర్తలు డాక్టర్ డి.మల్లికార్జునరెడ్డి, డాక్టర్ కృష్ణ కుమ్మరి, నందిత, షాజియా ఈ కార్యక్రమ నిర్వహణలో కీలక భూమిక పోషించారు.ఈ వేడుకలో క్విజ్, మ్యాథమెడికల్ మోడల్-పీపీటీ ప్రజెంటేషన్ వంటి పలు ఆకర్షణీయమైన పోటీలను నిర్వహించి, విజేతలకు నగదు పురస్కారాలు, బహుమతులు, ప్రశంసా పత్రాలను అందజేశారు.రుద్రారంలోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాల, మల్కాపూర్ లోని అక్షయ జూనియర్ కళాశాల విద్యార్థులు తమ ప్రతిభను కనబరచి కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించారు.