నేడు నిటి ఆయోగ్‌ పాలకమండలి భేటీ

నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో నేడు (శనివారం) నిటి ఆయోగ్‌ తొమ్మిదో గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలకు చెందిన ఎనిమిది మంది ముఖ్యమంత్రులు దూరంగా ఉండను న్నారు. కేంద్ర బడ్జెట్‌లో వివక్ష చూపడం, రాష్ట్రాల హక్కులు కాలరాయడాన్ని నిరసిస్తూ ఆయా రాష్ట్రాల సీఎంలు ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా ఈ సమావేశానికి ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలకు చెందిన ఏడుగురు ముఖ్యమంత్రులు హాజరు కావడం లేదని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ తీరును తప్పుపడుతూ వారు ఈ నిర్ణయం తీసుకు న్నారు. అయితే హాజరు కాలేమని ప్రకటించిన వారిలో కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల ముఖ్య మంత్రులు ఏ.రేవంత్‌ రెడ్డి (తెలంగాణ), సిద్ద రామయ్య (కర్నాటక), సుఖ్వీందర్‌ సింగ్‌ సుఖ్‌ (హిమాచల్‌ప్రదేశ్‌) ఉన్నారు. అలాగే తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌, పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌, జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ కూడా నీటి ఆయోగ్‌ సమావేశానికి రావడం లేదని ప్రకటించారు. ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఢిల్లీ మద్యం స్కాం కేసులో తీహార్‌ జైల్‌లో ఉండటం వల్ల హాజరుకాలేరు. అలాగే పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిటి ఆయోగ్‌ సమావేశానికి హాజరుకారని వార్తాలు వచ్చాయి. ఆమె మాత్రం తాను నిటి ఆయోగ్‌ సమావేశానికి హాజరు అవుతానని, సమావేశంలోనే నిరసన తెలుపుతానని ప్రకటించారు.విక్షిత్‌ భారత్‌ ఏ2024 విజన్‌ని ముందుకు తీసుకెళ్లేందుకు నిటి ఆయోగ్‌ తొమ్మిదో పాలక మండలి సమావేశం శనివారం రాష్ట్రపతి భవన్‌లోని కల్చరల్‌ సెంటర్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరగనుంది. ‘ఈజ్‌ ఆఫ్‌ లివింగ్‌ పై దష్టి సారించి, భవిష్యత్తు అభివృద్ధిపై దృష్టి పెట్టండి’ అనే నినాదంతో ఈ సమావేశం జరగనుంది. విక్షిత్‌ భారత్‌ ఏ 2047లో విజన్‌ డాక్యుమెంట్‌ కోసం అప్రోచ్‌ పేపర్‌పై గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశం చర్చిస్తుంది. ఈ సమావేశం ‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య భాగస్వామ్య పాలన, సహకారాన్ని పెంపొందించడం. ప్రభుత్వ జోక్యాల మెకానిజమ్‌లను బలోపేతం చేయడం ద్వారా గ్రామీణ, పట్టణ జనాభా రెండింటికీ జీవన నాణ్యతను మెరుగుపరచడానికి ఉపయోగడుతుంది’ అని నిటి ఆయోగ్‌ పేర్కొంది. ఈ సమావేశంలో విక్షిత్‌ భారత్‌ ఏ2047 లక్ష్యాన్ని సాధించడంలో రాష్ట్రాల పాత్రపై వివరణాత్మక చర్చలు కూడా జరుగుతాయని తెలిపింది.దేశం జీడీపీ 5 ట్రిలియన్లు అమెరికన్‌ డాలర్లు దాటడం, 2047 నాటికి 30 ట్రిలియన్‌ అమెరికన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థను చేరుకోవాలనే ఆకాంక్షతో ప్రపంచంలోని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే మార్గంలో ఉంది. 2047 నాటికి ‘విక్షిత్‌ భారత్‌’ విజన్‌ను సాధించడానికి కేంద్ర, రాష్ట్రాల మధ్య సహకార విధానం అవసరం. 9వ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశం ఈ విజన్‌ కోసం రోడ్‌మ్యాప్‌ను రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కేంద్రం, రాష్ట్రాల మధ్య టీమ్‌వర్క్‌ను ‘టీమ్‌ ఇండియా’గా ప్రోత్సహిస్తుందని నిటి ఆయోగ్‌ పేర్కొంది.నిటి ఆయోగ్‌ పాలక మండలి 2023 డిసెంబర్‌ 27-29 మధ్య జరిగిన మూడో జాతీయ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల కాన్ఫరెన్స్‌ సిఫార్సులపై దష్టి సారిస్తుంది. ‘ఈజ్‌ ఆఫ్‌ లివింగ్‌’ అనే విస్తతమైన థీమ్‌ కింద, ప్రధాన కార్యదర్శుల మూడో జాతీయ సదస్సులో సిఫారసులు చేయబడ్డాయి.
నిటి ఆయోగ్‌ ఎజెండా
– తాగునీరు : యాక్సెస్‌, పరిమాణం, నాణ్యత
– విద్యుత్‌: నాణ్యత, సామర్థ్యం, విశ్వసనీయత
– ఆరోగ్యం: యాక్సెసిబిలిటీ, స్థోమత, సంరక్షణ నాణ్యత
– పాఠశాల విద్య : అందుబాటులో, నాణ్యత
– భూమి, ఆస్తి : యాక్సెసిబిలిటీ, డిజిటలైజేషన్‌, రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌
అలాగే సైబర్‌ సెక్యూరిటీ, వెనుకబడిన జిల్లాలు, బ్లాక్‌ల కార్యక్రమం, రాష్ట్రాల పాత్ర, పాలనలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్సీ (ఏఐ) గురించి చర్చించడానికి ప్రత్యేక సెషన్‌లు కూడా నిర్వహించామని నిటి ఆయోగ్‌ తెలిపింది. వీటిని ప్రధాన కార్యదర్శుల 3వ జాతీయ సదస్సులో కూడా చర్చించారు. నిటి ఆయోగ్‌కి ప్రధానమంత్రి చైర్‌పర్సన్‌గా ఉన్నారు.