– బీజేపీతో జట్టు కట్టి బీహార్‌లో ప్రభుత్వ ఏర్పాటు
– కమల దళానికి రెండు ఉప ముఖ్యమంత్రి పదవులు
– నితీష్ వైఖరిపై మండిపడిన కాంగ్రెస్, ఆర్డేడీ
పాట్నా : బీహార్‌లో గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న రాజకీయ హైడ్రామాకు తెర పడింది. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రతిపక్ష ఇండియా కూటమికి గుడ్‌బై చెప్పిన ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీష్ కుమార్ మరోసారి ఎన్డీఏ గూటికి చేరారు. 18 నెలల క్రితం ఏ బీజేపీతో తెగతెంపులు చేసుకొన్నారో ఇప్పుడు అదే పార్టీతో చేతులు కలిపి తొమ్మిదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. సంవత్సరంన్నర క్రితం లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వం లోని ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలతో కలిసి మహా ఘట్‌బంధన్‌ను ఏర్పాటు చేసి, రాష్ట్ర పగ్గాలు చేపట్టిన నితీష్ తాజాగా ఆ మైత్రీబంధానికి స్వస్తి చెప్పారు. అవకాశం కోసం ఎదురు చూస్తున్న కమలదళం ఆయనకు మద్దతు అందించింది. అందుకు ప్రతిగా రెండు ఉప ముఖ్యమంత్రి పదవులు పొందింది.
ఆదివారం ఉదయం నుంచి బీహార్‌లో రాజకీయ పరిణామాలు వేగంగా జరిగిపోయాయి. ఉదయం జేడీయూ శాసనసభాపక్ష సమావేశం అనంతరం నితీష్ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్‌ను కలిసి రాజీనామా లేఖను అందజేశారు. ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలని కోరారు. తనకు మద్దతు ఇస్తూ ఎమ్మెల్యేలు ఇచ్చిన లేఖలను గవర్నరుకు అందజేశారు. సాయంత్రానికి మళ్లీ రాజ్‌భవన్‌లో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. బీజేపీ నేతలు సామ్రాట్ చౌదరి, విజరు సిన్హా ఉప ముఖమంత్రులుగా ప్రమాణం చేశారు. నితీష్ క్యాబినెట్‌లో బీజేపీకి చెందిన ముగ్గురు, జేడీయూకు చెందిన ముగ్గురు, జితన్‌రామ్ మంఝీ నేతృత్వంలోని హిందుస్థానీ ఆవామ్ మోర్చా నుండి ఒకరు, ఒక స్వతంత్ర ఎమ్మెల్యే మంత్రులుగా చేరారు. వారి చేత గవర్నర్ ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, స్థానిక బీజేపీ నేతలు, లోక్ జనశక్తి పార్టీ (రాం విలాస్) అధ్యక్షుడు చిరాక్ పాశ్వాన్ హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని ఆర్జేడీ బహిష్కరించగా కాంగ్రెస్ గైర్హాజరు అయింది.
ఉదయం గవర్నర్‌కు రాజీనామా లేఖను అందజేయడానికి ముందు నితీష్ విలేకరులతో మాట్లాడుతూ మహా కూటమిలోనూ, ఇండియా కూటమిలోనూ తనకు సౌకర్యంగా లేదని వ్యాఖ్యానించారు. అందుకే బీజేపీతో జట్టు కట్టానని చెప్పారు. ప్రమాణ స్వీకారం అనంతరం నితీష్, బీజేపీకి చెందిన ఉప ముఖ్యమంత్రులు మాట్లాడుతూ తామంతా కలిసే ఉంటామని తెలిపారు. కాగా నూతన ప్రభుత్వానికి ప్రధాని నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు. ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు నిబద్ధతతో సేవలు అందిస్తుందన్న నమ్మకం తనకు ఉన్నదని తెలిపారు.