– అర్ధసెంచరీతో కదం తొక్కిన తెలుగు తేజం
– ఇండియా 221/9
న్యూఢిల్లీ: తెలుగు తేజం, రెండో అంతర్జాతీయ టి20 ఆడుతున్న నితీశ్ కుమార్ రెడ్డి బ్యాటింగ్‌లో మెరిసాడు. అరుణ్‌జైట్లీ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో బుధవారం జరిగిన రెండో టి20లో నితీశ్ కుమార్ రెడ్డికి తోడు, రింకు సింగ్ అర్ధసెంచరీలతో రాణించారు. నితీశ్ కుమార్(74; 34బంతుల్లో 4ఫోర్లు, 7సిక్సర్లు), రింకు సింగ్(53; 29బంతుల్లో 5ఫోర్లు, 3 సిక్సర్లు) ధనా ధన్ బ్యాటింగ్‌తో చెలరేగారు. నితీశ్, రింకూలు టీ20ల్లో తొలి అర్ధ సెంచరీతో వారెవ్వా అనిపించారు. వీళ్ల దూకుడుకు నీరుగారిపోయిన బంగ్లా బౌలర్లు ఎక్కడ బంతులు వేయాలో తెలియక తలలు పట్టుకున్నారు. ఆకాశమే హద్దుగా చెలరేగిన ఈ జోడీ నాలుగో వికెట్‌కు 107 పరుగుల కలిపింది. ఈ జోడీని ముస్తాఫిజుర్ విడదీసినా.. హార్దిక్ పాండ్యా(32), రియాన్ పరాగ్(15)లు దుమ్మురేపారు. దాంతో, 19వ ఓవర్‌లో టీమిండియా స్కోర్ 200 దాటింది. నితీశ్, రింకూలు దొరికిన బంతిని దొరికినట్టు బౌండరీకి పంపి స్కోర్ బోర్డును పరుగెత్తించారు. ఆ తర్వాత వచ్చిన హార్దిక్ పాండ్యా(32; 19బంతుల్లో 2ఫోర్లు, 2సిక్సర్లు) ఆ విధ్వంసాన్ని తారాస్థాయికి తీసుకెళ్లాడు. దీంతో టి20 క్రికెట్‌లో బంగ్లాదేశ్‌పై టీమిండియా అత్యధిక స్కోర్‌ను నమోదు చేసింది. తొలుత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(8), సంజూ శాంసన్(10), అభిషేక్ శర్మ(15) బ్యాటింగ్‌లో రాణించలేకపోయారు. దీంతో టాస్ ఓడి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 9వికెట్ల నష్టానికి 221పరుగులు చేసింది. బంగ్లాదేశ్ బౌలర్లు రిషాద్ హొసైన్‌కు మూడు, తస్కిన్ అహ్మద్, తంజిమ్ హసన్, ముస్తాఫిజురకు రెండేసి వికెట్లు దక్కాయి.
స్కోర్‌బోర్డు…
ఇండియా ఇన్నింగ్స్: సంజు శాంసన్ (సి)శాంటో (బి)తస్కిన్ 10, అభిషేక్ శర్మ (బి)తంజిమ్ హసన్ 15, సూర్యకుమార్ యాదవ్ (సి)శాంటో (బి)ముస్తాఫిజుర్ 8, నితీశ్ రెడ్డి (సి)మెహిదీ హసన్ (బి)ముస్తాఫిజుర్ 74, రింకు సింగ్ (సి)జాకెర్ అలీ (బి)తస్కిన్ అహ్మద్ 53, హార్దిక్ పాండ్యా (సి)మెహిదీ హసన్ (బి)రిషాద్ 32, రియాన్ పరాగ్ (సి)మహ్మదుల్లా (బి)తంజిమ్ హసన్ 15, సుందర్ (నాటౌట్) 0, చక్రవర్తి (సి)పర్వేజ్ హొసైన్ (బి)రిషాద్ 0, ఆర్ష్‌దీప్ సింగ్ (సి)లింటన్ దాస్ (బి)రిషాద్ హొసైన్ 6, మయాంక్ యాదవ్ (నాటౌట్) 1, అదనం 7. (20 ఓవర్లలో 9వికెట్ల నష్టానికి) 221పరుగులు.
వికెట్ల పతనం: 1/17, 2/25, 3/41, 4/149, 5/185, 6/213, 7/214, 8/214, 9/220.
బౌలింగ్: మెహిదీ హసన్ 3-0-46-0, తస్కిన్ అహ్మద్ 4-0-16-2, తంజిమ్ హసన్ 4-0-50-2, ముస్తాఫిజుర్ 4-0-36-2, రిషాద్ హొసైన్ 4-0-55-3, మహ్మదుల్లా 1-0-15-0