”మీరు టీచర్‌గా ఏదైతే అనుభూతి చెందారో (ఫీలయ్యారో) అదే పద్ధతిలో వ్యక్తం చేయగలిగినప్పుడు మాత్రమే మీలో సజీవత (లైవ్లీనెస్) తొణికిసలాడుతూ ఉంటుంది. గాఢమైన అనుభూతే గాఢమైన అభివ్యక్తీకరణకు తోడ్పడుతుంది. చదువు జ్ఞానంగా మారే రహస్యమిదే. మన మాటలకు – మన పనికి ఆ సజీవతే ప్రాణప్రదం.”. (పేజీ – 12)
మన పిల్లలు ఎలా ఎదగాలి? సంతోషంగా ఎదగాలి. ఆరోగ్యంగా ఎదగాలి. సహజంగా ఎదగాలి. సమగ్రంగా ఎదగాలి. అందుకు వ్యవస్థలు, ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలి. ప్రతి జాతికి బాల్యమే అందమైన ఉషోదయం. సత్యం – శివం – సుందరమైనది పిల్లల భవిష్యత్తు. బాల్యం పట్ల నిర్లక్ష్యం వహించేవారి కృషికి అర్ధమేముంటుంది? ప్రపంచంలోని ఏ ఖండంలోని పిల్లలైనా శారీరక ఆరోగ్యం తోనూ, మానసిక ఆరోగ్యంతోనూ, సామాజిక ఆరోగ్యం తోనూ, థార్మిక (తత్వజ్ఞాన) ఆరోగ్యంతోనూ దృఢంగా ఎదగాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్) నొక్కి చెబుతున్నది.” (పేజి 15)
”పిల్లల్లో ప్రశ్నలు రేకెత్తే విధంగా టీచర్ చొరవ తీసుకోవాలి. పిల్లలు అడిగే ప్రశ్నలు అన్నింటికీ టీచర్ల వద్ద సమాధానాలుండవు. అయినా, నిజాయితీగా తెలియదని ఒప్పుకోవాలి. వారు చెబితే స్వీకరించాలి. లేదా తెలుసుకుని చెప్పాలి. లేదా టీచర్ – పిల్లలు కలిసి సత్యశోధన చేయాలి. అదే జ్ఞాన సముపార్జన మార్గం. అంటే పిల్లల నుండి నేర్చుకోవడానికి సైతం టీచర్ సిద్ధంగా ఉండాలి. టీచర్ అంటే నిత్య విద్యార్థి.”. (పేజి 41)
బియాండ్ ది క్లాస్‌రూమ్ (తరగతి గది ఆవల) బృందం పేరుతో గత మూడేళ్ళుగా కలిసి పని చేస్తున్న కొద్దిమంది విద్యా కార్యకర్తలు, పిల్లల ప్రేమికులు సమిష్టిగా తయారు చేసిన కరదీపిక ‘మా మంచి టీచర్’ అనే 50 పుటల ఈ చిరు పుస్తకం. ”మనిషి యంత్రాన్ని ఉపయోగించు కోవాలే తప్ప మనిషి యంత్రంగా మారకూడదు.” అనే స్పృహతో కూర్చిన ఈ మాడ్యువల్ ప్రత్యామ్నాయ మానవీయ విద్యావిధానాన్ని బలోపేతం చేసుకుందుకు ఒక మంచి ఆసరా!
చదువు నాలుగ్గోడల మధ్య నేర్చుకునేది కాదనీ, నలుదిక్కులా కదిలి, నలుగురితో మెదిలి, నదిలా ప్రవహించగలిగినప్పుడే సార్ధక విద్య సాధ్యమనే గొప్ప ఆశయంతో మహాత్మాగాంధీ, డా||బాబాసాహెబ్ అంబేద్కర్, మహాతత్వవేత్త సోక్రటీస్ మొదలగు మహనీయ మూర్తుల ప్రేరణతో ప్రకటించబడ్డ ఈ పుస్తకం ప్రతీ సామాజిక కార్యకర్త, ముఖ్యంగా ఉపాధ్యాయులు, విద్యావేత్తలు, తల్లిదండ్రులనే కాదు, పౌరసమాజంలో బాధ్యత కలిగిన ప్రతి వ్యక్తీ తప్పనిసరిగా చదివి, చర్చించి, తర్కించి, విమర్శించి తీరాల్సిన అవసరం ఉంది. ఎందుకనేది స్పష్టం… ”మన పిల్లలే మన వర్తమానం, భవితవ్యం, ఆనందం !” (పేజి 3)
అక్కడక్కడా మార్పులు, చేర్పులు చేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ, మిత్రులు పిల్లల కోసం, మంచి విద్యావిధానం రూపకల్పన కోసం తెలుగు రాష్ట్రాల్లో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న కె. శాంతారావు గారు రచించి కూర్చిన ఈ పుస్తకం ఒక్క సిట్టింగ్‌లో చదివేంత సులువుగా రాసారు. ఆయనకి ప్రత్యేక అభినందనలు. ప్రతీ విద్యా రంగ, సామాజిక కార్యకర్త, ఆలోచన పరులూ కచ్చితంగా చదవాల్సిన పుస్తకం. ఇంకా ఈ అంశానికి సంబంధించి విషయాలు తెలుసుకోగోరేవారు శాంతారావు గార్ని సంప్రదించవచ్చు !
– గౌరవ్, 8074322748