తెలంగాణ వ్యవసాయ పరిస్థితులను సమీక్షించినప్పుడు 1712 నుండి 1948 వరకు నిజాం పాలనలో జరిగిన భూ సంస్కరణలు జమిం దార్లకు, దేశ్‌ముఖ్‌లకు, భూస్వా ములకు అనుకూలంగానూ, భూమిలేని పేదలకు, కౌలుదార్లకు అత్యంత దారుణంగానూ ఉండేది. 1908లో నిజాం మంత్రివర్గం లో సాలార్జంగ్ తెచ్చిన సంస్కరణల వల్ల భూమిపై హక్కులు జమిందార్లకు, దేశ్‌ముఖ్‌లకు ఏర్పడ్డాయి. వాస్తవ సాగుదార్లయిన కౌలుదార్లు, నిరుపేదలకు ఎలాంటి హక్కులు లేవు. భూ హక్కులు 1. రైత్వారీ (దివానీ) విధానం 2. జమిందారీ విధానం 3. నిజాం స్వంత భూములు (సర్వేఖాస్) గా ఏర్పర్చారు. నిజాం పరిపాలనలో ఐదుకోట్ల ఎకరాల సాగుభూమిని ఈ దిగువ విధంగా పంపిణీ చేశారు.
1. రైత్వారీ విధానం (దివానీ విధానం) : ఈ విధానం కింద రైతులకు 3కోట్ల ఎకరాల భూమికి పట్టాలిచ్చారు. ఎకరాకు తరాన్నిబట్టి అనగా భూసారాన్ని బట్టి ఎకరాకు రూ.1.50 నుండి రూ.2ల వరకు నిర్ణయించారు. ఈ శిస్తుకు అదనంగా 25శాతం లోకల్ ఫండ్ నిర్ణయించి వసూళ్లు చేశారు. శిస్తు వసూళు చేయడానికి గ్రామంలో పటేల్, పట్వారీ, మాలీ పటేల్ పదవులు కల్పించారు. వీరికి గ్రామంలో సేథ్ సిందీలు (సుంకరీ) నౌకర్లుగా నియమించారు. పటేల్, పట్వారీలపై గిర్దావరీ ప్రతి 8-10 గ్రామాలకు ఒకరిని నియమించారు. దాదాపు 300 గ్రామాలకు ఒక తహశీల్దారును, ప్రతి 5 తహశీల్‌లకు ఒక రెవెన్యూ డివిజన్ ఆఫీసరును, ప్రతి నాలుగు రెవెన్యూ డివిజన్లకు ఒక కలెక్టర్‌ను నియమించారు. వీరి పని రైతుల నుండి శిస్తులను వసూళ్లు చేయడం. వసూళ్ల సందర్భంగా రైతుల నుండి తిరుగుబాటు వస్తే అణచివేయడానికి పోలీసు వ్యవస్థను ఏర్పర్చారు. రెవెన్యూ అనగా ఆదాయం. ప్రభుత్వ ఆదాయం కోసం రెవెన్యూ శాఖను ఏర్పాటు చేయడంతో పాటు వారికి రక్షణగా పోలీసు శాఖను ఏర్పాటు చేశారు. రైత్వారీ పద్ధతిలో కూడా ప్రతి గ్రామంలో 5-8 మంది వరకు భూస్వాములు ఉండేవారు. గ్రామంలోని 50శాతం భూమి వీరి చేతుల్లోనే ఉండేది. పటేల్, పట్వారీలు వీరి చెప్పుచేతల్లో ఉండటమో లేక మీ కుటుంబాల నుండే ఉండటమో జరిగింది. గ్రామంలోని మిగిలిన రైతులు భూస్వాముల భూములు సాగుచేసిన తర్వాత తమ భూములు సాగుచేసుకోవాలి. గ్రామాల్లో భూస్వాములు, పటేల్, పట్వారీలు చెప్పిందే వేదంగా అమలు జరిగింది.
2.జమిందారీ – దేశ్‌ముఖ్ విధానం : ఈ విధానం కింద 1.5కోట్ల ఎకరాలు కేటాయించారు. 20-30 గ్రామాలు ఒక జమిందారు లేదా దేశ్‌ముఖ్ ఆధీనంలో ఉంచి ఆ జమిందారీ ఏరియాలో గల భూమిపై హక్కులు కల్పించారు. ఆ భూములు సాగు చేసే కౌలుదార్లనుండి శిస్తు వసూళ్లు చేయడం దేశ్ ముఖ్‌ల పని. ప్రతి సం||రం మార్చిలో ”జమాబంధీ” (శిస్తు ఆడిట్) జరిపి మొత్తం శిస్తు వసూళ్ల లెక్కలు తేల్చేవారు.
3.సర్ఫేఖాస్ విధానం : నిజాం స్వంత భూములను సర్ఫేఖాస్ భూములంటారు. ఈ భూములు హైదరాబాద్ చుట్టూ గల ”అత్రాఫ్ బల్దా”గా ఉన్న ప్రాంతంలోను మెదక్ జిల్లాలోను ఎక్కువగా ఉన్నాయి. 55లక్షల ఎకరాలు నిజాం హక్కు కింద ఉన్నాయి. వీటిని కౌలుచేసే వారు శిస్తులు చెల్లించాలి.
జమిందారీ, సర్ఫేఖాస్ భూములలో సాగుచేస్తున్న రైతులు మొదట భూస్వాముల లేదా నిజాం భూములు సాగుచేసిన తర్వాత తమ భూములు సాగుచేసుకోవాలి. అదును పోయిన తర్వాత సాగుచేయడం వల్ల పంటలు పండక శిస్తు చెల్లించలేకపోయేవారు. ఎకరాకు 1 లేదా 2 బస్తాల జొన్నలు మాత్రమే పండేవి. తరి భూముల లో 6-7 బస్తా (75కిలోల బస్తా)లు మాత్రమే పండేవి. ఎకరం భూమిలో పండిన పంట అమ్మగా రూ.10ల లోపు ఆదాయం వచ్చేది. కరువులు ఎక్కువగా రావడంతో పంట భూములన్నీ బీళ్లుగా మారాయి. ఆహారం కోసం అడవిలోకి వెళ్లి కందలు తవ్వుకొని వచ్చి ఉడకబెట్టుకొని తినేవారు. కొన్ని సందర్భాల్లో రాగడి బురదను పెరుగుతో కలుపుకొని తిని ఆకలిని తీర్చుకున్నారు. శిస్తులు చెల్లించలేక తమ భూ హక్కులకు రాజీనామాలు పెట్టి (ఖారజ్ ఖాతా) భూములు వదిలేశారు. శిస్తు వసూళ్ల సందర్భంగా రైతులపై తీవ్రహింస సాగింది. దుస్తులు లేకుండా ఎండలో పడుకోబెట్టడం, వీపుపై బండరాళ్లు పెట్టడం చేసేవారు. రైతుల నుండి ”లెవీ గల్లా” పేరుతో మార్కెట్ ధరలోని 30శాతం ధరకు ధాన్యాన్ని బలవంతంగా తహశీల్దారులు సేకరించేవారు. నాడు రుణ సౌకర్యం లేకపోవడంతో అధిక వడ్డీలు, నాగులు(ధాన్యం అప్పుతీసుకున్నచో 50శాతం అదనంగా చెల్లించాలి) భూస్వాముల ఇళ్లలోకానీ, జమిందార్ల ఇళ్లలో కానీ వివాహాలు కానీ, ఉత్సవాలు కానీ జరిగినప్పుడు గ్రామస్తులంతా ఉచితంగా కోళ్లు, గొర్రెలు ఇవ్వడమే కాక ఆ కార్యక్రమం జరిగే వరకు వారింట్లో ఉచితంగా పనిచేయాలి. వారి ఆడకూతుళ్లతో అత్తవారింటికి గ్రామంలోని వివాహంకాని అమ్మాయిలను ”ఆడబాపలు”గా పంపించాలి. ప్రతి పనికి పన్నులు నిర్ణయించారు. ఒక భూమిపై ఒకరికి మించి హక్కులు కలిగి వుంటే జాయింట్ పట్టేదార్లుగా గుర్తించారు. 12 సం||రాలు సాగులు చేస్తే శిక్మీదారు (భాగస్వామి) గుర్తింపు ఇచ్చేది. 1944లో కౌలుదారుల రక్షణ చట్టం తెచ్చి 5సం||లు సాగులో ఉంటే నష్టపరిహారం లేకుండా తొలగించే హక్కు లేదు. అందువల్ల ఏ సంవత్సరానికి ఆ సం||రం కౌలు నిర్ణయించుకొని చెల్లింపులు చేయించుకునే వారు. చెరువు భూములు, ప్రభుత్వ భూములు సాగు చేసినచో శిస్తుకు అదనంగా ”తావాన్” (జరిమానా) 16రెట్ల వరకు నిర్ణయించేవారు. నీటి పారుదల భూములకు మెట్ట శిస్తు కన్నా పదిరెట్లు అదనంగా నిర్ణయించారు. దళితులు, వెనుకబడిన తరగతులు, చేతివృత్తుల వారికి ఇనాం పేరుతో భూములు ఉన్నప్ప టికీ ఆ భూములు భూస్వాముల భూములు సాగుచేసిన తర్వాతనే తమ భూములను సాగు చేసుకోవాలి. లేదా రైతులు దున్ని పెట్టాలి. భూమి శిస్తులే కాక పచ్చిక బీళ్లలో ఎడ్లను మేపినందుకు 75 పైసల చొప్పున పన్ను, నాగలిపన్ను, పశువులు మండపెట్టినందుకు పన్ను, ఇంటిపన్ను, నెగడి పన్ను (మంటవేసినందుకు) లు వసూళు చేశారు. గ్రామాలలో చదువుకు ఎలాంటి అవకాశం లేదు. భూస్వాములు తమ స్వంత ఖర్చుతో ఉపాధ్యాయులను నియమించుకునేవారు.
11సెప్టెంబర్1946న రైతుల సాయుధపోరాటం ప్రారంభం కావడంతో జమిందార్లు, దేశ్‌ముఖ్‌లు గ్రామలలోని పెద్ద భూస్వాములు గ్రామాలు వదిలిపెట్టి పట్టణాలకు పారిపోయారు. ఇది అవకాశంగా పేదలు, దళితులు, వెనుకబడిన తరగతుల వారు జమిందార్ల, భూస్వాములు భూములను పది లక్షల ఎకరాల వరకు ఆక్రమించి మూడు వేల గ్రామాలలో గ్రామ రాజ్యాలను ఏర్పాటు చేసుకొని (పన్నులులేని) కొత్త విధానాన్ని అనుసరించారు. శిస్తు విధానం రద్దు చేసుకున్నారు. గ్రామా లలో వెట్టిచాకిరి, వడ్డీలు, నాగులు, తదితర దోపిడీ పద్ధతులు లేకుండా చేశారు. 1948 సెప్టెంబర్ 17న నిజాం ప్రాంతం పోలీసుచర్య ద్వారా భారతదేశంలో విలీనం అయ్యింది. అయినప్పటికీ తాము సాధించుకున్న భూములను రక్షించుకోవడానికి 1951 అక్టోబర్ 21 వరకు పోరాటం కొనసాగించారు. కేంద్ర ప్రభుత్వం రక్షిత కౌలుదారీ చట్టం తేవడంతో సాయుధపోరాటం విరమిస్తూ ప్రకటించారు. నిజాం పాలనలో భానిస సమాజంలోని నిర్భందాలన్నీ రైతాంగం అనుభవించారు.
నేటి వ్యవసాయ పరిస్థితులు
తెలంగాణ 1948 సెప్టెంబర్‌లో భారతదేశంలో విలీనం అయినప్పటికీ, ఎస్టేట్‌ల రద్దు చట్టం వచ్చినప్పటికీ, తెలంగాణలో 1973లో భూసంస్కరణల చట్టం తెచ్చి 1975లో అమలు చేశారు. ఈ రెండు సం||రాల కాలంలో భూస్వాములు బినామీ పేర్లతో భూములన్నీ మార్చుకొని సీలింగ్ చట్టంలోనికి రాకుండా జాగ్రత్తలు వహించారు. 1985లో ముఖ్యమంత్రి ఎన్టీరామారావు భూమి శిస్తు రద్దు చేశారు. ప్రభుత్వ భూములను పేదలకు లావుణీ పట్టాలు ఇచ్చి పంపిణీ చేశారు. భూ హక్కుల చట్టాలను సవరణలు చేసి సాగు చేసే వారికి హక్కులు కల్పించారు. అన్ని హక్కులున్నప్పటికీ రైతులు భూములను రక్షించుకోలేకపోతున్నారు. బ్యాంకు వడ్డీలు, ప్రయివేటు వడ్డీలు పెరిగి భూములను అమ్ముకోవడమే కాక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఒకవైపున వ్యవసాయ ఉపకరణాల ధరలు విపరీతంగా పెరిగి, మరోవైపున వ్యవసాయ ఉత్పత్తుల ధరలు తగ్గిపోవడంతో పేదలు భూములు కోల్పోతున్నారు. ప్రభుత్వ భూములు పొందిన వారు కూడా చట్టానికి విరుద్ధంగా లక్షల ఎకరాల భూములు అమ్ముకుం టున్నారు. పట్టణ భూసంస్కరణల చట్టం దాదాపు రద్దు చేశారు. గ్రామీణ భూసంస్కరణల చట్టానికి తూట్లు పొడిచి వందల ఎకరాలను ఆక్రమించి ఫ్యాక్టరీలు, ఫామ్‌హౌస్‌ల పేర్లతో కొద్దిమంది పెట్టుబడిదారీ భూస్వాములు భూములు కేంద్రీకరించుకుంటున్నారు. మార్కెట్ అవకతవకల ద్వారా ఆర్థికంగా దెబ్బతినడమే కాక ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏటా రాష్ట్రంలో రూ.5వేల కోట్ల వరకు రైతులు పెట్టుబడిని నష్టపోతున్నారు. వ్యవసాయ పరిశోధనలు తగ్గించివేసి ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నారు. మన వాతావరణానికి ఆ టెక్నాలజీ (బిటి టెక్నాలజీ) సరిపోకపోవడంతో పంటలు దెబ్బతింటున్నాయి. వ్యవసాయ శాఖలో నలభై శాతం ఉద్యోగాలు ఖాళీలు ఉండటం వల్ల రైతులు ఎరువులు, ఇతర వ్యాపారుల సలహాపై వ్యవసాయాన్ని సాగిస్తున్నారు. నిర్ణయించిన కనీస మద్దతు ధరలు అమలు జరగకపోవడం వల్ల ఒక సర్వే ప్రకారం ఏటా తెలంగాణ రైతాంగం రూ.8వేల కోట్లు నష్టపోతున్నారు. తిరిగి పాతకాలం నాటి జమిందార్ల వలె కొత్తగా కార్పొరేట్ సంస్థలు ఉనికిలోకి వచ్చాయి. ధరల నిర్ణయంతో పాటు భూముల కేంద్రీ కరణకు కార్పొరేటీకరణ ప్రధాన అంశంగా ముందుకు వచ్చింది. ప్రభుత్వాలు కూడా కార్పొరేట్లకు అనుగు ణంగా చట్టాలు చేస్తున్నాయి. గత సాయుధ పోరాటం లాగా నేడు రైతాంగం సుదీర్ఘకాలంపాటు పోరాటాలు చేస్తూనే ఉన్నారు. 2020 జూన్ నుండి 2021 నవంబర్ వరకు లక్షల సంఖ్యలో రైతాంగం కనీస మద్దతు ధరలకు, రుణాల రద్దుకు ఉద్యమాలు సాగించారు. నేటికీ ఆ రెండు సమస్యలపై రాష్ట్ర వ్యాపితంగా రైతాంగం పోరాటాలు సాగిస్తూనే ఉంది. నాటి వలె నేడు కౌలుదార్లకు హక్కులు కల్పించాలని చట్టంలో రద్దు చేసిన కౌలు చట్టాలను పునరుద్ధరించాలని నిరంతరం ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. నాడు టెక్నాలజీ, చదువు లేకుండా సాగిన రైతాంగ పోరాటాల వలె నేడు టెక్నాలజీ, చదువు ఉన్నప్పటికీ రద్దయిన హక్కులను పునరుద్దరించడంతో పాటు ఆత్మహత్యల నివారణకు చర్యలు చేపట్టాలన్న ఆందోళనలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. కాలం మారినా రైతుల పోరాటాలు కొనసాగుతుండటం గత కాలాన్ని గుర్తు చేస్తున్నది.
– సారంపల్లి మల్లారెడ్డి 9490098666