నవతెలంగాణ-ఆర్మూర్
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో సోమవారం తెల్లవారు జామున నిజాంసాగర్ కెనాల్‌కు గండిపడింది. దీంతో నీరు ఇండ్లల్లోకి చేరడంతో స్థానికులు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. స్థానిక జర్నలిస్ట్ కాలనీకి ఆనుకొని ఉన్న నిజాంసాగర్ డిస్ట్రిబ్యూటరీ 82 నెంబర్ కెనాల్ కట్టకు ఒక్కసారిగా గండిపడింది. నీరు ఇండ్లల్లోకి చేరడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. రైతుల పంటల సాగు కోసం నిజాంసాగర్ ప్రాజెక్టులోని నీటిని చెరువులకు వదిలే సమయంలో ఆ ప్రాజెక్టు ప్రధాన కాలువను ఇరిగేషన్ అధికారులు శుభ్రం చేయాల్సి ఉంది. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే కెనాల్ కట్ట తెగిపోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. కాగా కెనాల్ కట్ట దిగువ ప్రాంతంలో పేద ప్రజలు అనేక మంది నివసిస్తున్నారు. నీరు ఇండ్లల్లోకి చేరడంతో బియ్యం, నిత్యావసర వస్తువులు తడిచాయని, నీళ్లల్లో కొట్టుకుపోయాయని స్థానికులు వాపోయారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. కాగా స్థానికుల సమాచారంతో విద్యుత్, మున్సిపల్ అధికారులు అక్కడి చేరుకొని మరమ్మతులు చేపట్టారు.
పరిశీలించిన జడ్పీ చైర్మెన్
సమాచారం అందుకున్న జడ్పీ చైర్మెన్ దాదన్న గారి విట్టల్ రావు అక్కడికి చేరుకొని పరిశీలించారు. స్థానిక కౌన్సిలర్ వనం శేఖర్‌ను ఇరిగేషన్ శాఖ అధికారులను అక్కడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పలు ఇండ్ల్లను పరిశీలించి ఇది బాధాకరమైన సంఘటనని తెలుపుతూ.. గుత్ప నుంచి వచ్చే నీటిని ఆపివేయించి నిల్వవున్న నీటిని ఖాళీ చేయించి అవసరమైన పనులను యుద్ధప్రాతిపాదికన చేయించాలని సంబంధిత ఇంజనీరింగ్ శాఖ అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. మున్సిపల్ కమిషనర్ రాజు, డిప్యూటీ ఈఈ కృష్ణమూర్తి, నాయకులు పాలెపు రాజు, కంచెట్టి గంగాధర్ తదితరులు పరిశీలించారు.