కర్నాటక సీఎం సిద్ధరామయ్యపై చర్యకు నో

కర్నాటక సీఎం సిద్ధరామయ్యపై చర్యకు నో–  క్రిమినల్‌ ప్రొసీడింగ్స్‌పై సుప్రీం స్టే
న్యూఢిల్లీ : కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై క్రిమినల్‌ కార్యక లాపాలు చేపట్టకుండా సుప్రీం కోర్టు సోమవారం స్టే విధించింది. పాలక పక్షానికి వ్యతిరేకంగా శాంతి యుతంగా నిరసన సాగించడమనేది ప్రతి పౌరుని ప్రాధమిక హక్కని ఆయన వాదించిన నేపథ్యంలో సుప్రీం నిర్ణయం వెలు వడింది. 2022లో నిరసన ప్రదర్శన సందర్భంగా అప్పటి బీజేపీ ప్రభు త్వాన్ని భయపెట్టేందుకు నేరపూరితంగా బలాన్ని ఉపయోగించే లక్ష్యంతోనే చట్టవిరుద్ధంగా గుమిగూడారంటూ సిద్ధరామయ్య, మరో 35మందిపై చార్జిషీట్‌ దాఖలైంది. గ్రామీణాభివృద్ది, పంచాయితీరాజ్‌ మంత్రి ఈశ్వరప్ప రాజీనామాను కోరుతూ ఈ ప్రదర్శన నిర్వహించారు.
భావ ప్రకటనా స్వేచ్ఛ కలిగిన ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలియచేయడమనేది ప్రాధమిక హక్కు. ఎలాంటి నేరపూరితమైన ఉద్దేశం లేకుండా శాంతియుతంగా ఆందోళన నిర్వహించేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోలేరని సిద్ధరామయ్య తరపున సీనియర్‌ న్యాయవాదులు కపిల్‌ సిబల్‌, ఎ.ఎం.సింఘ్విలు వాదించారు.
కేవలం వాహనాల రాకపోకలను అడ్డగించారన్న ఆరోపణలతో ఆందోళనకారులపై క్రిమినల్‌ ప్రొసీడింగ్స్‌ చేపట్టలేరని సిబల్‌ పేర్కొన్నారు. శాంతి భద్రతల ఉల్లంఘన పేరుతో ప్రాధమిక హక్కుల ప్రక్రియపై శిక్షార్హమైన చర్యలు తీసుకుంటున్నారంటూ వాదించారు.