– జులై 5న రెండో రౌండ్
టెహరాన్ : ఇరాన్ అధ్యక్ష ఎన్నికల్లో రికార్డు స్థాయిలో తక్కువ శాతం పోలింగ్ నమోదు కావడం, ఏ అభ్యర్ధి మెజారిటీ సాధించని పరిస్థితి నెలకొనడంతో జులై 5న రెండో రౌండ్ ఎన్నికలు జరగనున్నాయి. 6.1కోట్ల మందికి పైగా అర్హులైన ఓటర్లు వుండగా, కేవలం 40శాతం మంది మాత్రమే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని హోం శాఖ వర్గాలు శనివారం తెలిపాయి. 1979 విప్లవం అనంతరం అధ్యక్ష ఎన్నికల్లో ఇంత తక్కువ స్థాయిలో పోలింగ్ నమోదు కావడం ఇదే తొలిసారి కాగా, రెండో రౌండ్ అధ్యక్ష ఎన్నిక జరగడం కూడా రెండోసారి మాత్రమే. మధ్యేమార్గవాది పెజెషికాన్‌కు 100.41 లక్షల ఓట్లు రాగా. అణు చర్చల మాజీ ప్రతినిధి సయీద్ జలీల్‌కు 90.47లక్షల ఓట్లు లభించాయి. పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బాఘర్ ఘలిబఫ్‌కు 30.38లక్షలు, కన్జర్వేటివ్ ఇస్లామిక్ నేత ముస్తఫాకు 2,06,397ఓట్లు వచ్చాయి. దాంతో వారు పోటీ నుండి వైదొలగారు. మరో ఇద్దరు అభ్యర్ధులు కూడా పోటీ నుండి తొలగారు. ఈ పరిస్థితుల్లో రెండో రౌండ్‌లో జలీల్‌కు ఓటు వేయాల్సిందిగా వీరందరూ వారి మద్దతుదారులకు పిలుపిచ్చారు. మే 19న హెలికాప్టర్ ప్రమాదంలో అధ్యక్షుడు ఇబ్రహీం రైసి మరణించడంతో ఈ ఎన్నికలు నిర్వహించడం అనివార్యమైంది.
2022-23లో దేశవ్యాప్తంగా నిరసనల నేపథ్యంలో ప్రజలకు భ్రమలు తొలగడం, అమెరికా ఆంక్షల కారణంగా 40శాతానికి పైగా ద్రవ్యోల్బణం నెలకొనడంతో ఎన్నికల పట్ల ఓటర్లకు ఉదాసీనత బాగా పెరిగింది. రెండు ప్రధాన వర్గాల మధ్యనే పోటీ నెలకొన్న నేపథ్యంలో జులై 5న జరిగే రెండో రౌండ్‌లో పోలింగ్‌శాతం పెరిగే అవకాశముందని భావిస్తున్నారు.