మొదటి సారి తల్లి అయినపుడు ఆమె ఆనందానికి అవధులుండవు. అప్పటి వరకు తను పడ్డ బాధ మొత్తం క్షణంలో మాయమైపోతుంది. ఇదే సమయంలో కొన్ని సవాళ్లు కూడా ఉంటాయి. బిడ్డకు పాలు పట్టే దగ్గర నుండి ఇది మొదలవుతుంది. అలాంటి సమస్యే ఎదుర్కొంది గాయత్రి కనుమూరి. బిడ్డకు పాలివ్వడంలో సరైన అవగాహన లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంది. తనలా మరే తల్లీ బాధ పడకూడదని నారీ కేర్ ప్రారంభించింది. ఇంతకీ ఆమెకు ఎదురైన సమస్యలేంటీ? నారీ కేర్ ఎలా తల్లులకు సహాయం చేస్తుందో తెలుసుకుందాం…
వైజాగ్‌కు చెందిన గాయత్రికి 2020లో బిడ్డను ప్రసవించిన తర్వాత ఆసుపత్రిలో అంతా బాగానే ఉంది. ఇంటికి వచ్చిన తర్వాత బిడ్డకు పాలివ్వడం సవాలుగా మారింది. పాలిచ్చేటపుడు కొన్నిసార్లు బాధాకరంగా ఉండేది. అప్పుడప్పుడు రక్తస్రావం కూడా అయ్యేది. ఒక సారి పాలిచ్చిన తర్వాత తిరిగి 20 నుండి 40 నిమిషాల వరకు ఆమెకు చిరాగ్గా ఉండేది. బిడ్డ ఏడుస్తున్నా పాలివ్వడం చాలా కష్టంగా అనిపించేది. ‘ఆ సమయంలో నా బిడ్డ ఆకలితో అలమటిస్తున్నట్లు అనిపించేది. అంటే నా దగ్గర తగినంత పాల ఉత్పత్తి లేదు. అది మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. ఇలాంటి సమస్యలతో మొదటి సారి తల్లి అయిన వారు విపరీతమైన ఒత్తిడిలో ఉంటున్నారు’ అంటూ ఆమె మనతో పంచుకుంటున్నారు. ఇలాంటి సమస్యలు ఎంతో మంది అనుభవిస్తున్నారు. భారతదేశంలో పాలిచ్చే తల్లులకు సరైన సపోర్ట్ సిస్టమ్ లేదనే ఉద్దేశంతో గాయత్రి నారీ కేర్‌ను ప్రారంభించారు.
నారీ కేర్‌కు పునాది
లాస్ ఏంజెల్స్‌లో సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా పనిచేస్తున్న గాయత్రి బిడ్డ పుట్టిన తర్వాత భారతదేశానికి తిరిగి వచ్చారు. ఓ తల్లిగా తాను అనుభవించిన ఇబ్బంది ఇతరుల్లో ఎలా ఉందో అర్థం చేసుకునే ప్రయత్నం చేశారు. తన అనుభవాల నుండి ఇతరులకు మార్గనిర్దేశం చేయడం ప్రారంభించారు. ‘అయితే కేవలం నా చుట్టూ ఉన్న మహిళలకు మాత్రమే సహాయం చేస్తే సరిపోదని కొద్దికాలంలోనే గ్రహించాను. ఎక్కువ మంది మహిళలకు సహాయం చేయాలని నిర్ణయించుకున్నాను’ అని ఆమె జతచేస్తున్నారు. ఈ ఆలోచనే నారీ కేర్‌కు పునాది రాయిగా నిలిచింది. 2022లో దీన్ని ప్రారంభించారు. వైజాగ్ ఆధారిత ఈ స్టార్టప్ సర్టిఫైడ్ ల్యాక్టేషన్ కన్సల్టెంట్‌లతో తల్లులకు అవగాహన కల్పిస్తుంది. ‘నా ప్రసవానంతర కాలంలో నేను ఎదుర్కొన్న సమస్యలు ఇతర తల్లులు ఎదుర్కోకూడదని వీలైనంత ఎక్కువ మంది తల్లులకు సహాయం చేయాలనుకుంటున్నాను’ అని ఆమె అంటున్నారు.
తల్లిపాలకు సవాళ్లు
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం మొదటి ఆరు నెలలు శిశువుకు తల్లిపాలే ఇవ్వాలి. ఆ తర్వాత ఇతర పోషక ఆహారంతో పాటు బిడ్డకు రెండు మూడేండ్లు నిండేవరకు తల్లిపాలను కొనసాగించాలి. చాలా మంది తల్లులు ఎంతో సహజంగా పాలిస్తారు. అయితే చాలా మంది తల్లులు పాలు తక్కువ ఉండడం లేదా లాచింగ్ వంటి సమస్యలు ఎదుర్కొంటారు. చనుబాలివ్వడంలో కూడా నిపుణులు శిక్షణ ఇస్తున్నారు. ఇంటర్నేషనల్ బోర్డ్ సర్టిఫైడ్ లాక్టేషన్ కన్సల్టెంట్ ప్రకారం భారతదేశంలో 204 మంది నిపుణులు ఉన్నారు. చాలా మందికి తల్లిపాల సమస్యలకు నిపుణులు ఉన్నారనే విషయమే తెలియదు. గాయత్రి కూడా మొదట్లో తన సమస్యను పరిష్కరించుకునేందుకు ఓ శిశువైద్యుడిని కలిశారు. అతను ప్రత్యామ్నాయంగా కొన్ని సూచనలు చేశారు. అయితే తల్లి పాలలో ఉండే పోషకాలు అందులో ఉండవు. డాక్టర్ సూచన కాస్త ఊరటనిచ్చినా గాయత్రి బిడ్డకు తనపాలే పట్టాలనుకున్నారు. దానికోసం ఓ కన్సల్టెంట్‌తో అపాయింట్‌మెంట్ బుక్ చేసుకున్నారు. తన పాల ఉత్పత్తిని ఎలా అంచనా వేయాలో, బిడ్డను ఎలా పాలు పడ్డాలో, బిడ్డ ఆకలి సమస్యలను ఎలా నిర్వహించాలో తెలుసుకున్నారు.
తల్లిపాలను అందించడం
కొత్తగా ఈ ప్రోగ్రామ్‌లో చేరిన తేజశ్రీ మాట్లాడుతూ ‘బిడ్డను చూసుకోవడంలో నాకు మద్దతు లేదు, ఎవరితో మాట్లాడాలో తెలియదు. పాలు సరిగా రావడం లేదని బిడ్డకు పోతపాలు పట్టాను. అయితే రెండవసారి గర్భవతి అయినప్పుడు సహాయం కోసం వెతుకుతున్నాను. అప్పుడే నారీ కేర్ గురించి తెలుసుకున్నాను. ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది. ఆమె నాపై నాకు నమ్మకం కలిగించారు. నా శరీరాన్ని విశ్వసించడం నేర్పించారు’ అన్నారు. తేజశ్రీకి తల్లిపాలు పట్టించే పద్ధతులు, ఒత్తిడి నిర్వహణ, భావోద్వేగ మద్దతు గురించి వారు నేర్పించారు.
సపోర్టివ్ కమ్యూనిటీ
నారీ కేర్ ఓ నెల ప్రణాళికను మహిళలకు అందిస్తుంది. ఇక్కడ తల్లులు చనుబాలివ్వడం కన్సల్టెంట్‌తో ఒకరితో ఒకరు సంప్రదింపులు, రెండు గంటల బ్రెస్ట్ ఫీడింగ్ కోర్సుతో పాటు వాట్సాప్ బ్రెస్ట్ ఫీడింగ్ సపోర్ట్ గ్రూప్ ద్వారా ఒక నెల టెక్స్ట్ సపోర్ట్ పొందుతారు. ఇది వారు ఒకరి అనుభవాల నుండి మరొకరు నేర్చుకోగలిగే సపోర్టివ్ కమ్యూనిటీని ఏర్పరుచుకుంటూ నిపుణులను నేరుగా ప్రశ్నలు అడగడానికి వీలు కల్పిస్తుంది. నారీ కేర్ ప్రస్తుతం దేశంలో ఐదు కన్సల్టెంట్లను నిర్వహిస్తోంది. ఇందులో మూడు, ఆరు నెలల ప్లాన్‌లు కూడా ఉన్నాయి. వీటి ధర వరుసగా రూ.4,500 నుండి రూ.10,000. ఆరు నెలల ప్లాన్‌లో వన్-టు-వన్ ఫాలో-అప్ టెక్స్ట్‌తో పాటు పోషకాహార నిపుణులతో కాల్ సపోర్ట్, బిడ్డకు ఘనపదార్థాలను పరిచయం చేయడంపై వర్క్‌షాప్ కూడా ఉంటుంది. అదనపు ఫాలో-అప్‌లు, న్యూట్రిషన్ సపోర్ట్, ప్రసవానంతర యోగా తరగతులు, పిల్లల పోషకాహారం, నిద్ర, ప్రసవానంతర మానసిక ఆరోగ్యం వంటి అదనపు ప్రయోజనాలు ఉంటాయి. అదే సేవలను కలిగి ఉన్న మరో మూడు విస్తృతమైన ప్రోగ్రామ్‌లను స్టార్టప్ అందిస్తుంది.
భవిష్యత్‌లో…
ఇప్పటి వరకు నారీ కేర్ భారతదేశం అంతటా సుమారు 400 మంది మహిళలకు చేరువైంది. స్టార్టప్ తన క్లయింట్‌లకు పంపులు, స్టెరిలైజర్‌ల వంటి బ్రెస్ట్ ఫీడింగ్ ఉత్పత్తులను అందించడానికి స్పెక్ట్రా, మెడెలా, డాక్టర్ బ్రౌన్స్, కొమోటోమో వంటి బ్రాండ్‌లతో భాగస్వామ్యం కలిగి ఉంది. అలాగే సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా తల్లిపాల గురించి అవగాహన కల్పిస్తుంది. ‘తల్లిపాలు పట్టడం మొదటి కొన్ని వారాలు చాలా కష్టం. కాలక్రమేణా తల్లులకు ఇది ఇతర సమస్యలను తెచ్చుపెడుతుంది. అందుకే భవిష్యత్తులో తల్లిపాలు మాత్రమే కాకుండా ఇతర అంశాలపై మా అవగాహన కార్యక్రమాలు పెంచాలని పరిశీలిస్తున్నాం. అయితే ప్రస్తుతం పాలివ్వడంలో సమస్యలను ఎదుర్కొంటున్న తల్లులకు సహాయం చేయడమే మా లక్ష్యం’ అంటూ గాయత్రి తన మాటలు ముగించారు.