– స్వయంప్రతిపత్తి కావాలి : కేరళలో సహకార ఉద్యోగుల నిరసన
– మోడీ సర్కారు తీరుపై కేసీఈయూ ఆగ్రహం
తిరువనంతపురం : కేరళలో సహకార ఉద్యోగులు నిరసనకు దిగారు. మోడీ సర్కారు తీసుకొస్తున్న కేంద్రీకరణ విధానాలు వద్దనీ, తమకు స్వయంప్రత్తి కావాలని వారు డిమాండ్ చేశారు. వివిధ రంగాలకు చెందిన సామాజిక ఆర్థిక అంశాల్లో కీలక పాత్ర పోషిస్తున్న సహకార సంఘాలను కబ్జా చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల వద్దకు పాదయాత్ర చేపట్టారు. సహకార సంఘాలపై కేంద్రం చర్యలకు వ్యతిరేకంగా కొల్లాంలో జరిగిన నిరసన కార్యక్రమాన్ని కేరళ కోఆపరేటివ్ ఎంప్లాయీస్ యూనియన్(కేసీఈయూ) ప్రధాన కార్యదర్శి ఎన్.కె రామచంద్రన్ ప్రారంభించారు.కేరళలోని సహకార సంఘాల ఉద్యోగులు ఈ రంగంపై కేంద్ర ప్రభుత్వం నుంచి నిరంతర దాడులకు వ్యతిరేకంగా యుద్ధ మార్గంలో ఉన్నారు. ఫిబ్రవరి 27న కేసీఈయూ కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు మార్చ్‌లు నిర్వహించింది. ఈ రంగాన్ని కేంద్రం బారి నుంచి కాపాడటానికి నిరసనలు చేపట్టింది. సహకార సంఘాల కోసం కొత్త మంత్రిత్వ శాఖను సృష్టించటం ద్వారా రాష్ట్ర అంశంలోకి చొరబడడం ద్వారా మోడీ సర్కారు సమాఖ్య, ప్రజాస్వామ్య, రాజ్యాంగ ఆదేశాలను ఉల్లంఘిం చిందని కేసీఈయూ ఆరోపించింది. ప్రభుత్వం లేదా రిజిస్ట్రార్ నియంత్రణ లేకుండా కేవలం ఆడిట్ సిస్టమ్ ద్వారా మార్గనిర్దేశం చేయబడే మల్టీ-స్టేట్ కోఆపరేటివ్ సొసైటీల (ఎంఎస్‌సీఎస్) ప్రమోషన్‌ను ఉద్యోగులతో సహా భాగగస్వాములు వ్యతిరేకిస్తున్నారు .కేరళలో సహకార సంఘాలు సుదీర్ఘ చరిత్రను కలిగి ఉన్నాయి. 16,256 సంఘాలు సహకార రిజిస్ట్రార్ నియంత్రణలో, 6,911 సంఘాలు వివిధ శాఖల నియంత్రణలో ఉన్నాయి. సొసైటీలు ప్రధానంగా పాడి రైతులు, మత్స్య పరిశ్రమ, బీడీ కార్మికులు, కొబ్బరి, చేనేత, ఇతర రంగాలకు మద్దతును అందించటంతో పాటు వ్యవసాయానికి సంబంధించిన క్రెడిట్‌లను కవర్ చేస్తాయి . సీఐటీయూకి అనుబంధంగా ఉన్న కేసీఈయూ ప్రధాన కార్యదర్శి ఎన్.కె రామచంద్రన్ మాట్లాడుతూ.. రాజ్యాంగంలో రాష్ట్రాల అంశాల కింద జాబితా చేయబడిన సహకార సంఘాలపై నియంత్రణను లాక్కోవడానికి కేంద్రం ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు.