రైతులకు నో పరిహారం

– చివ్వెంల మండలంలో ఒక్క రైతు పేరు కూడా పంట నష్టపరిహారం జాబితాలో లేకపోవడం ఆశ్చర్యం
– మంత్రిగారు.. జర మండల రైతులను పట్టించుకోవాలని విన్నపం
నవతెలంగాణ- చివ్వేంల

రాష్ట్రంలో కురిసిన వడగండ్ల వర్షం కారణంగా జరిగిన పంట నష్టం అంచనాలు తప్పాయి. ప్రాథమిక అంచనాలతో పోలిస్తే ఫైనల్‌ రిపోర్టులో లెక్కలు తారుమారయ్యాయి. కురిసిన అకాల వర్షాలు వడగండ్లు రైతును కుంగదిశాయి. మొత్తం పంటలు కనీసం 33 శాతం క్రాప్‌ లాస్‌ ఉండాలనే రూల్‌ కారణంగా చివ్వేంల మండలంలో 22వేలా200 ఎకరాల్లో వరిసాగుచేశారు. అకాల వర్షాలకు 1081 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు మండల అధికారులు పైకి నివేదిక పంపారు. 33శాతం కంటే తక్కువగా నష్టం ఉండడం వల్ల జాబితాలో లేరని అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా అకాల వర్షాలు వడగండ్ల వల్ల రైతులు నష్టపోయారని, నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని ఎకరానికి 10000 ఇస్తామని భరోసా ఇస్తే అధికారులు తప్పుడు సమాచారం పంపిచారని, పంట నష్టం అంచనా వేసే విషయంలో వ్యవసాయ శాఖ అధికారులపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. రైతు వేదికల వద్ద కూర్చొని స్థానిక ప్రజాప్రతినిధులను అడిగి పంట నష్టాన్ని అంచనా వేశారని విమర్శలు ఉన్నాయి. వాస్తవానికి ఏవో, ఏఈవోలు క్షేత్రస్థాయిలో పంటలు దెబ్బతిన్న ప్రాంతాలలో పర్యటించి ప్రతి ఎకరాను అంచనా వేసి నివేదిక సమర్పిస్తే రైతులకు పరిహారం అందేదని వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు విమర్శిస్తున్నారు. ఒక్కో రైతు ఎకరానికి సేద్యం కోసం రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు పెట్టుబడులు పెట్టారు. అయితే ప్రభుత్వం ఇస్తున్న ఎకరాకు రూ.10000 పరిహారం అందితే రైతులు కొంతమేరకైనా గట్టెక్కి అవకాశం ఉండేది.
మంత్రి గారు చివ్వేంల మండల రైతుల పైన జాలి చూపించండి…
చివ్వేంల మండలంలో అకాల వర్షం, వడగండ్ల వల్ల వరి పంట నేలవాలి ధాన్యం రాలిపోయింది. అయితే 33శాతం లోపే నష్టం వాటిల్లిందని మండలంలోని పంట నష్టపోయిన రైతుల పేర్లు జాబితాలో రాకపోవడం పట్ల రైతులు ఆవేదన చెందుతున్నారు. మంత్రి జగదీష్‌ రెడ్డి చొరవ తీసుకొని రైతులు నష్టపోకుండా ప్రభుత్వంతో మాట్లాడి నష్టపరిహారం అందే విధంగా కృషి చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
రైతాంగాన్ని ఆదుకోవాలి
వ్యవసాయకార్మిక సంఘంజిల్లాప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు
ఇటీవల కురిసిన అకాల వర్షం వడగళ్ల వాన వల్ల సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా లక్షలాది ఎకరాల్లో వరి, మిర్చి, మామిడి తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దెబ్బతిన్న పంటలను సర్వేనెంబర్‌ ఆధారంగా విచారణ జరిపి పంట నష్టాన్ని అంచనా వేయాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో జిల్లాలో లక్షలాదిగా నష్టపోయిన రైతాంగం ప్రభుత్వసహాయం అందక లబోదిబోమంటున్నారు. ప్రతి ఎకరాకు 25 వేల నుండి 30 వేల వరకు రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. ఇప్పటికైనా అధికారులు సమగ్ర సర్వే నిర్వహించి రైతాంగానికి న్యాయం చేయాలి. లేనియెడల రైతులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం.
33 శాతం కంటే తక్కువగా నష్టం ఉండడంతో పేర్లు రాలేదు
మండల వ్యవసాయాధికారి ఆశాకుమారి
33శాతం కంటే తక్కువగా పంట నష్టం జరగడం వల్ల మండలంలో ఏ ఒక్క రైతుకు కూడా నష్టపరిహారం జాబితాలో పేరు రాలేదు.