డీసీసీబీ ఛైర్మన్ మహేందర్ రెడ్డి పై అవిశ్వాసం

– డీసీఓ కిరణ్ కు తీర్మాన పత్రాన్ని అందజేసిన డైరెక్టర్లు
– ఏకపక్ష నిర్ణయాలతో విసుగు: కుంభం శ్రీనివాస్ రెడ్డి 
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్ 
జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి పై డైరెక్టర్లు అవిశ్వాస తీర్మానాన్ని ప్రకటించారు. డీసీసీబీ బ్యాంకులో మొత్తం 19 మంది డైరెక్టర్లు ఉండగా సోమవారం 14 మంది డైరెక్టర్లు చైర్మన్ పై అవిశ్వాసాన్ని ప్రకటిస్తూ ఆయనను వెంటనే పదవి నుండి తొలగించాలని కోరుతూ జిల్లా కో-ఆపరేటివ్ అధికారి కిరణ్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. మునుగోడు డైరెక్టర్ కుంభం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో మొత్తం 14 మంది డైరెక్టర్లు డిసిఒను కలిశారు. డీసీసీబీ వైస్ చైర్మన్ దయాకర్ రెడ్డి ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారని ఆయన కూడా గొంగిడి మహేందర్ రెడ్డిని పదవి నుంచి తొలగించాలని అవిశ్వాస తీర్మానానికి సంసిద్ధత వ్యక్తం చేశారని శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. నాలుగు సంవత్సరాల క్రితం డీసీసీబీ కార్యవర్గం ఏర్పడ్డ సమయంలో మొత్తం 19 స్థానాలకు గాను 18 స్థానాల్లో అప్పటి అధికార బీఆర్ఎస్ పార్టీ గెలిచింది.
దీంతో బీఆర్ఎస్ పార్టీకి చెందిన గొంగిడి మహేందర్ రెడ్డిని చైర్మన్ గా ఎన్నుకున్నారు. అవిశ్వాస తీర్మానాన్ని జిల్లా సహకార అధికారికి అందించిన అనంతరం డీసీసీబీ డైరెక్టర్ కుంభం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. చైర్మన్ ఏకపక్ష నిర్ణయాలతో విసుగు చెంది అవిశ్వాస తీర్మానాన్ని ప్రకటించినట్లు చెప్పారు. చైర్మన్ మహేందర్ రెడ్డి డైరెక్టర్లకు కనీస గౌరవం ఇవ్వకపోవడం, ఆదాయ వ్యయాలపై డైరెక్టర్లకు చెప్పకపోవడం, సిబ్బందిని ఇష్టా రీతిగా బదిలీ చేయడం తదితర కారణాలతో ఆయన మొండి వైఖరి పట్ల విసుగు చెంది అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టినట్లు చెప్పారు. 15 మంది డైరెక్టర్లను అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఉన్నందున కచ్చితంగా మహేందర్ రెడ్డి చైర్మన్ పదవిని వదలక తప్పదని చెప్పారు. పాలకవర్గం గడువు మరో ఎనిమిది నెలల పాటు ఉందని ఆయన తెలిపారు. జిల్లా మంత్రులు ఎమ్మెల్యేల సహకారంతో డీసీసీబీకి నూతన పాలకవర్గం ఏర్పాటు ఖాయమని కుంభం శ్రీనివాస్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. డి సి ఓ కిరణ్ కుమార్ కు అవిశ్వాస తీర్మానాన్ని అందించిన తర్వాత నిబంధనల ప్రకారం డైరెక్టర్లందరికీ నోటీసులు ఇచ్చి అవిశ్వాస తీర్మానంపై సమావేశం ఏర్పాటు చేస్తానని చెప్పారని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. అవిశ్వాస తీర్మానం అందించిన వారిలో డైరెక్టర్లు గడిపాటి సైదులు, ధనావత్ జయరాం, కోడి సుష్మ, పాశం సంపత్ రెడ్డి, విరిగినేని అంజయ్య, జూలూరు శ్రీనివాస్, కే. వీరస్వామి, కే సైదయ్య, బి. శ్రీనివాస్,  ఎస్. అనురాధ, కే. కరుణ  తదితరులు ఉన్నారు.
28న  అవిశ్వాసం: కిరణ్ కుమార్  (జిల్లా సహకార శాఖ  అధికారి)
అవిశ్వాసం పెట్టాలని డైరెక్టర్లు తీర్మాన  పత్రాన్ని ఇచ్చారు. తేదీని నిర్ణయించలేదు. దాదాపుగా  ఈనెల 28న అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెడదామని అనుకుంటున్నాం. అవిశ్వాసాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టిన నిబంధనలకు అనుగుణంగా ఉంటుంది.