మణికొండ మున్సిపల్‌ చైర్మెన్‌పై అవిశ్వాసం?

– చైర్మన్‌ కస్తూరి నరేందర్‌కు వ్యతిరేకంగా 12 మంది తిరుగుబాటు
– రంగారెడ్డి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ప్రతీమాసింగ్‌కు అవిశ్వాస తీర్మానం అందజేత
– అధికార పార్టీ చైర్మెన్‌పై అవిశ్వాస నోటిసు ఇవ్వడంపై తీవ్ర చర్చ
నవతెలంగాణ-గండిపేట
రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీల్లో బీఆర్‌ఎస్‌ చైర్మెన్లపై అవిశ్వాస తీర్మానాలు పెడుతున్నారు. బీఆ ర్‌ఎస్‌ చైర్మెన్‌ పీఠాలను కాంగ్రెస్‌ కైవసం చేసుకుం టోంది. కానీ మణికొండలో మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. ఇక్కడ అధికార పార్టీ చైర్మెన్‌ పైనే కౌన్సిలర్లు తిరుగుబాటు జెండా ఎగురవేశారు. 12 మంది కౌన్సిలర్లు చైర్మెన్‌కు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానాన్ని రంగారెడ్డి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ప్రతీమాసింగ్‌కు అందజేశారు. అధికార పార్టీ చైర్మె న్‌పై అవిశ్వాస నోటీసు ఇవ్వడం ఇప్పుడు తీవ్ర చర్చ యాంశంగా మారింది. మణికొండ మున్సిపల్‌లో మొత్తం 20 కౌన్సిల ర్లు ఉన్నారు. ఇందులో కాంగ్రెస్‌ కౌన్సిలర్లు 9 మం ది, బీఆర్‌ఎస్‌ 6, బీజేపీ 4, ఒకరు ఇండిపెండెంట్‌ కౌన్సిలర్‌ ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్‌, బీజేపీ కలిసి సంకీర్ణ పరిపాలను కొనసాగిస్తున్నాయి. కాంగ్రెస్‌కు చెందిన కస్తూరి నరేందర్‌ముదిరాజ్‌ చైర్మెన్‌గా ఎన్నికయ్యారు. బీజేపీకి చెందిన నరేందర్‌రెడ్డి వైస్‌ చైర్మెన్‌గా కొనసాగుతున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కస్తూరి నరేందర్‌ రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యేగా కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసి ఓడిపోయా రు. కానీ రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో మణికొండలో కస్తూరి నరేందర్‌కు ఎలాంటి తిరుగు ఉండదని అందరూ భావించారు. అయితే మొదటి నుంచి కాంగ్రెస్‌కు ఇక్కడ స్పష్టమైన మెజార్టీ లేకపోవడం.. బీజేపీతో కలిసి చైర్మెన్‌ పీఠాన్ని దక్కించుకోవడం కస్తూరి నరేందర్‌కు మైనస్‌గా మారాయి. ఇప్పటి వరకు చైర్మెన్‌, కౌన్సిలర్లు మధ్య సఖ్యాత బాగానే ఉంది. కానీ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానాల జోరుగా సాగుతున్న నేపథ్యంలో ఒక్కసా రిగా మణికొండ మున్సిపాలిటీలో అలజడి మొ దలైంది. గతంలో ఎప్పుడూ లేనిది 12 మంది కౌన్సి లర్లు ఒక్కటై చైర్మెన్‌పై అవిశ్వాసం పెట్టడం కొత్త చర్చకు దారీ తీసింది. అయితే రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ చైర్మెన్లపై అవిశ్వాసం పెట్టగా.. మణికొండలో మాత్రం అధికార పార్టీ చైర్మెన్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టడం కొనమెరుపు. ఇదిలా ఉంటే కౌన్సిలర్లు కొత్త చైర్మెన్‌గా ఎవరిని బలపరుస్తారు అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.