– అందని చైర్మెన్ రాజీనామా పత్రం
– ఇన్‌చార్జి చైర్మెన్‌గా కుంట రమేష్‌రెడ్డి
నవతెలంగాణ-నిజామాబాద్ సిటీ
ఎన్‌డీసీసీబీ అవిశ్వాసం నెగ్గింది. కానీ గత చైర్మెన్ పోచారం భాస్కర్‌రెడ్డి రాజీనామా పత్రం మాత్రం అధికారులకు అందలేదు. రాజీనామా పత్రం నేరుగా అందించినప్పుడే రాజీనామా చెల్లుతుందని (డీసీవో) జిల్లా సహకార సంఘాల అధికారి శ్రీనివాసరావు తెలిపారు. నిజామాబాద్ డీసీసీబీపై అవిశ్వాస తీర్మానం పెడుతున్నట్టు ఈ నెల 5న డైరెక్టర్లు అధికారులకు నోటీసు అందజేశారు. అదేవిధంగా ఆ నోటీసులను డీసీసీబీలో ఉన్న డైరెక్టర్లందరికీ అధికారులు అందించారు. ఈ నెల 21న అవిశ్వాస తీర్మానం ఉంటుందని తెలియజేశారు. కాగా.. గురువారం అవిశ్వాస తీర్మాన సమావేశానికి మొత్తం 21 మంది డైరెక్టర్లలో 17 మంది హాజరయ్యారు. అందులో 16 మంది డైరెక్టర్లు కుంట రమేష్‌రెడ్డికి మద్దతు తెలుపుతూ చేతులెత్తారు. కానీ బుస్సాపూర్ సొసైటీ డైరెక్టర్ నాగంపేట్ శేఖర్‌రెడ్డి మాత్రం మద్దతు పలకకుండా ఉండిపోయారు. అనంతరం డీసీసీబీ ఇన్‌చార్జి చైర్మెన్‌గా కుంట రమేష్‌రెడ్డిని ఎన్నుకున్నారు. ఈనెల 26 వరకు ఇన్‌చార్జి చైర్మెన్‌గానే రమేష్‌రెడ్డి బాధ్యతలు నిర్వహించనున్నారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్, షబ్బీర్ అలీకి కుంట రమేష్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. పోచారం భాస్కర్‌రెడ్డిపై అసంతృప్తి వల్లే అవిశ్వాసం ఏర్పాటు చేశామని, పాలకవర్గం సలహాలు, సూచనల మేరకు బ్యాంక్‌ను ముందుకు తీసుకెళ్తామని చెప్పారు.