ఏ చీకట్లకీ ప్రస్థానం?

చైత్ర వసంత విస్తరి శీలాన్ని చిత్తకార్తెలు
చిందరవందరగా చించిన దైన్యాలు

తూరుపు వాకిలిలో
ప్రభవించి పడమటిపొద్దై
విశ్రమించే పండుటాకులను
పరాధీనపరిచే
ద్రుత పల్లవ హైన్యాలు

లోకపు ఆకలి తీర్చే
వ్యవసాయ వ్యసనంలో
ప్రవాహానికి ఎదురీదలేక
పుట్టిముంచుకునే
పరోపకార త్యాగాలు

పెట్టుబడి దారుల్లో
ఒక్కోమెట్టే ఎక్కకుండా
శిఖరాగ్రాన్ని అమాంతం తలదన్నాలని
ప్రాణికోటి పచ్చధనాల్ని
నిలువునా దోచేసే నిరంకుశాలు

పుట్టపగిలి పుట్లు పుట్లుగా
ముసిరిన ఉసిళ్ళు
పర్యావరణ పాముల పదునుకోరలకు చిక్కి ఉక్కిరిబిక్కిరయ్యే ఉపద్రవాలు

గుప్తనిధుల కోసం
గుడులను బోర్లేసి
అనాథనాథలను నిర్లక్ష్యంగా
నిరాశ్రయులను చేసే నైచ్యాలు

కూడికత్వంలేని కులాలు
మానవత్వం లోపించిన మతాలు
సమాజంలో అనేకానేక వర్గకుడ్యాలు

వర్తమానంలో
ఒంటరి శోకాలే తప్ప
అనువర్తనంలో
సామూహిక స్పందనలులేని నాగరికతా!
ఎటువైపు నీ ప్రయాణం?
ఓ సంస్కతీ!
ఏ చీకట్లకు నీ ప్రస్థానం??

– కరిపె రాజ్‌కుమార్‌
8125144729