– రేషన్‌కార్డుల తొలగింపుపై సమాచారం లేదు
– చేర్చటం, మినహాయించటం రాష్ట్రాల బాధ్యత
– లోక్‌సభలో కేంద్రం వెల్లడి
న్యూఢిల్లీ : దేశంలో తప్పనిసరి ఈ-కేవైసీ ప్రక్రియ ద్వారా మినహాయించబడిన రేషన్ కార్డులకు సంబంధించి తమ వద్ద డేటా అందుబాటులో లేదని కేంద్రం పార్లమెంటులో తెలిపింది. ఈ-కేవైసీ అమలుతో రేషన్‌కార్డుదారులు, ప్రత్యేకించి వలసదారుల మినహాయింపునకు దారి తీస్తుందా అన్న విషయంలో ఎలాంటి సమాచారమూ తమకు అందలేదని వివరించింది. లబ్దిదారుల చేర్చటం, మినహాయించటమనేది రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత అని స్పష్టం చేసింది.
ఈ మేరకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి నిముబెన్ జయంతిభారు బంభనియా లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ఈ కేవైసీ ప్రక్రియను రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంత(యూటీ) ప్రభుత్వాలు నిర్వహిస్తాయని స్పష్టం చేశారు. ఈ-కేవైసీ అమలుతో తొలగించిన రేషన్‌కార్డులకు సంబంధించిన సమాచారం ఆహార, ప్రజా పంపిణీ విభాగం వద్ద లేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎంపీ శశికాంత్ సెంథిల్ అడిగిన ప్రశ్నకు స్పందనగా కేంద్ర మంత్రి పైవిధంగా సమాధానమిచ్చారు. దేశవ్యాప్తంగా 5.8 కోట్ల రేషన్‌కార్డులు తొలగించబడ్డాయని గతనెల 20న కేంద్రం ఒక ప్రకటనలో పేర్కొన్నది. 64 శాతం మంది లబ్దిదారుల ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తయిందనీ, అది కొనసాగుతున్నదని వివరించింది.